Andhra News: బట్టతల, తిప్పి కొడితే 5 అడుగులు.. 40 మంది మహిళల్ని ఎలా మోసం చేశావురా..

నేను ఒక ప్రముఖ మీడియా సంస్థకు సీఈఓను.. మాది చాలా రిచ్ ఫ్యామిలీ.. తల్లిదండ్రులు ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నారు.. సోదరి ఆస్ట్రేలియాలో స్థిరపడింది.. అంటూ మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్లను వేదికగా చేసుకుని మహిళలకు ఆకర్షణీయమైన వల వేస్తూ, పెళ్లి పేరుతో కోట్లాది రూపాయల నగదు, బంగారాన్ని కాజేస్తున్న ఒక అంతర్రాష్ట్ర నిత్య పెళ్ళికొడుకు గుట్టును ముదినేపల్లి పోలీసులు రట్టు చేశారు.

Andhra News: బట్టతల, తిప్పి కొడితే 5 అడుగులు.. 40 మంది మహిళల్ని ఎలా మోసం చేశావురా..

Edited By:

Updated on: Jun 27, 2026 | 6:33 AM

తానో రిచ్ ఫ్యామిలీకి చెందినవాడినని.. తమది ఉన్నత కుటుంబమని చెప్పుకుంటూ.. మ్యాట్రిమోనీలో అమ్మాయి నుంచి డబ్బులు కాజేస్తున్న ఓ కేటుగాడికి చెక్ పెట్టారు పోలీసులు. విరాల్లోకి వెళ్తే.. గుంటురు జిల్లా పాండురంగనగర్‌కు చెందిన వక్కలగడ్డ సాంబశివరావు (36) అనే వ్యక్తికి ఇప్పటికే భార్య, పిల్లలు ఉన్నారు. గతంలో ఇతను ఒక పత్రికలో పనిచేసేవాడు. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి, పెళ్లి పేరుతో మహిళలను మోసం చేస్తుండటంతో సదరు పత్రికా యాజమాన్యం ఇతడిని ఉద్యోగం నుండి తొలగించి కేసు కూడా పెట్టింది. అయినప్పటికీ సాంబశివరావు తన బుద్ధి మార్చుకోలేదు. మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్లలో ఖరీదైన వస్త్రాలు, లగ్జరీ కార్లు, బంగారు ఆభరణాలు ధరించిన ఫోటోలను పోస్ట్ చేస్తూ తానే ఆ సంస్థకు సీఈఓనని నమ్మబలికేవాడు.

ముఖ్యంగా భర్త చనిపోయిన, విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటున్న మహిళలను టార్గెట్ చేసుకుని పరిచయాలు పెంచుకునేవాడు. వివాహం చేసుకుంటానని నమ్మించి, అత్యవసరంగా డబ్బు అవసరమంటూ ఒక్కొక్క బాధితురాలి నుండి రూ.2 లక్షల నుండి రూ.10 లక్షల వరకు నగదు, బంగారు నగలు కాజేసేవాడు. సొమ్ము చేతికి చిక్కగానే వారి ఫోన్ నంబర్లను బ్లాక్ లిస్టులో పెట్టి ముఖం చాటేసేవాడు. 2020 నుంచి ఇప్పటివరకు సుమారు 40 మందికి పైగా మహిళలను ఈ విధంగా మాయమాటలతో బురిడీ కొట్టించినట్లు విచారణలో తేలింది.

తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెంకు చెందిన రాజ్యలక్ష్మి, విశాఖపట్నం జిల్లా పరవాడకు చెందిన దుర్గ భవానీ, తెలంగాణలోని కోదాడకు చెందిన జ్యోతితో పాటు పలువురు మహిళలను వివాహం చేసుకుని వదిలేశాడు. ఇటీవల ముదినేపల్లి మండలానికి చెందిన ఒక మహిళకు పెళ్లి చేసుకుంటానని పరిచయమైన సాంబశివరావు, అత్యవసరంగా డబ్బు కావాలని ఆమెను నమ్మించి, బెదిరించి పది కాసుల బంగారం, ఒక లక్ష రూపాయల నగదు కాజేసి పరారయ్యాడు. తాను మోసపోయానని గ్రహించిన బాధితురాలు ముదినేపల్లి పోలీసులను ఆశ్రయించడంతో ఈ భారీ మోసం వెలుగుచూసింది. పోలీసులు సాంకేతిక ఆధారాల సహాయంతో దొంక లాగడంతో నిత్య పెళ్ళికొడుకు పాపాల భైరవం బద్దలైంది.

బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి.. అతని వద్ద నుండి భారీగా సొత్తును స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వాటిలో 24 గ్రాముల బంగారు నాన్ తాడు, 10.5 గ్రాముల ఒక జత బంగారు బుట్టలు, 23.5 గ్రాముల ఒక సాదా బంగారు చైన్, రెండు బంగారు ఉంగరాలు, ఓ కారు ఉన్నాయి. వీటితో పాటు నేరాలకు ఉపయోగించిన 6 సెల్‌ఫోన్లు, 10 సిమ్ కార్డులు, 4 బ్యాంక్ పాస్‌బుక్కులు, 9 ఏటీఎం కార్డులు. మోసాలకు వెళ్లేటప్పుడు ధరించే 4 రోల్డ్ గోల్డ్ చేతి కడియాలు, 5 రోల్డ్ గోల్డ్ ఉంగరాలు, 3 రోల్డ్ గోల్డ్ చైన్లు, పెళ్లి వస్త్రాలతో పాటు ఎప్పుడూ సిద్ధంగా ఉంచుకునే 2 పెళ్లి బాసికాలు దొరికాయి.

ఈ ఘటన నేపథ్యంలో జనాలకు పోలీసులు కీలక సూచలు చేశారు. మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్లలో వచ్చే ఇటువంటి ఆకర్షణీయమైన ప్రొఫైల్స్ పట్ల మహిళలు, వారి కుటుంబ సభ్యులు అప్రమత్తంగా ఉండాలని, పూర్తి వివరాలు విచారించకుండా ఎవరికీ నగదు, నగలు ఇచ్చి మోసపోవద్దని పోలీసులు ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us