Cyclone Gulab Alert: ఉత్తర కోస్తాంధ్ర తీరానికి తుపాను హెచ్చరికల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టింది. తుపాను ముప్పు అధికంగా ఉన్న ఉత్తరాంధ్ర మూడు జిల్లాలతో పాటు ఇతర కోస్తా జిల్లాల్లోని అధికార యంత్రాంగం అప్రమత్తమయ్యింది. ఐఎండీ తుపాను హెచ్చరికల నేపథ్యంలో ఉత్తర కోస్తాంధ్రలోని విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల కలెక్టర్లను విపత్తు నిర్వహణ శాఖ అప్రమత్తం చేసింది. కోస్తా సముద్రతీరం వెంబడి 378 కిలోమీటర్ల పరిధిలోని 59,496 మత్స్యకార కుటుంబాలను అప్రమత్తం చేయాలని సూచనలు జారీ చేసింది. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల తీరప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న 86 వేల మందిని తుపాను షెల్టర్లకు తరలించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. తుపాను నేపథ్యంలో నిర్దేశిత కార్యాచరణను చేపట్టాల్సిందిగా రెవెన్యూ శాఖను విపత్తు నిర్వహణ శాఖ కోరింది.
అలాగే రాష్ట్రస్థాయిలో విపత్తు నిర్వహణ శాఖలోని ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ జిల్లాల్లో చేపట్టిన సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తుందని స్పష్టంచేసింది. తీరప్రాంతంలో ఉన్న 76 మండలస్థాయి అత్యవసర ఆపరేషన్ సెంటర్లు, 145 మల్టీపర్పస్ సైక్లోన్ సెంటర్లు, 16 ఫిష్ ల్యాండింగ్ కేంద్రాలు, 8 పర్యాటక ప్రాంతాలను రాష్ట్ర ఎమర్జెన్సీ ఆపరేషన్స్ సెంటర్‌కు ప్రభుత్వం అనుసంధానం చేసింది. అత్యవసర సమాచార వినిమయం కోసం 16 శాటిలైట్ ఫోన్లు, వీసాట్,డీఎంఆర్ సమాచార పరికరాలను విపత్తు నిర్వహణ శాఖ తరలించింది.
తుపాను ముప్పు పొంచివున్న మూడు జిల్లాల్లోనూ గ్రామ వార్డు సచివాలయాల్లో అత్యవసర కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను తుపాను తాకనున్న ప్రాంతాలకు తరలించాలని సూచించింది. అటు కోవిడ్ దృష్ట్యా ప్రభావిత మూడు జిల్లాల్లోనూ ఆక్సిజన్ నిల్వలతో పాటు ఇతర అత్యవసర సామాగ్రిని కూడా సిద్ధం చేసుకోవాలని ఆస్పత్రులకు సూచనలు జారీ చేసింది.
బంగాళాఖాతంలో నెలకొన్న తీవ్ర వాయుగుండం.. శనివారం మధ్యాహ్నానికి తుపానుగా రూపాంతరం చెందుతుందని ఐఎండీ అంచనావేస్తోంది. ఈ తుపానుకు గులాబ్‌గా నామకరణం చేశారు. ఆదివారం సాయంత్రం కళింగపట్నం వద్ద తుపాను సముద్రతీరం దాటే అవకాశముందని అంచనావేస్తున్నారు. దీంతో ఉత్తరాంధ్ర, ఒడిశా తీర ప్రాంతాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తూర్పు గోదావరి జిల్లాలోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనావేసింది. అటు తుపాను హెచ్చరికల నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. మత్సకారులు ఈ నెల 27వ తేదీ వరకు వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది.
తుఫాన్ ప్రభావం వల్ల శని, ఆదివారాల్లో తీరం వెంబడి గంటకు 75 నుంచి 85 కిలో మీటర్లు, గరిష్టంగా 95 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని అధికారులు తెలిపారు.
Also Read..
ఆ ఊరిలో ఆడపిల్ల పుడితే పండగే.. అమ్మాయి పుడితే ఘనంగా వేడుకలు జరుపునే గ్రామం మన దగ్గరే.. ఎక్కడంటే..
EPF Customers Alert: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. UANతో ఆధార్ అనుసంధానం గడువు పొడిగింపు..!