Andhra News: ఒకే నియోజక వర్గంలో ఒకరు ఎమ్మెల్యే.. మరొకరు ఎమ్మెల్సీ.. సర్దుకుపోతారా..?

| Edited By: Ram Naramaneni

Mar 15, 2025 | 9:58 PM

పెద్దల సభలోకి అడుగు పెడుతున్న కావలి గ్రీష్మ ఎంట్రీతో ఆమె సొంత నియోజకవర్గం రాజాంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఇక్కడ మొదటి నుండి ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ వర్గానికి... కావలి గ్రీష్మ వర్గానికి పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది.. ఎందుకో డీటేల్స్ తెలుసుకుందాం పదండి

Andhra News: ఒకే నియోజక వర్గంలో ఒకరు ఎమ్మెల్యే.. మరొకరు ఎమ్మెల్సీ.. సర్దుకుపోతారా..?
Greeshma Vs Kondru murali
Follow us on

కావలి గ్రీష్మ తల్లి కావలి ప్రతిభా భారతి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మొదటి మహిళ స్పీకర్‌గా పనిచేసిన నేత.. 1983 లో ఎన్. టి. ఆర్ ప్రోత్సాహంతో టిడిపిలో జాయిన్ అయిన ప్రతిభా భారతి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, స్పీకర్ గా, మంత్రిగా పనిచేశారు.. 2004, 2009, 2014 ఎన్నికల్లో పోటీచేసి ఓటమి పాలయ్యారు.. ఎచ్చెర్ల నుండి నాలుగు సార్లు గెలిచిన ప్రతిభా భారతి నియోజక పునర్విభజనలో భాగంగా ఎచ్చెర్ల నియోజకవర్గం నుండి ఎస్సి జనరల్ అయిన రాజాం నియోజకవర్గంకి మారి అక్కడ నుండి పోటీకి దిగారు.. అలా నియోజకవర్గం మారి 2009, 2014 ఎన్నికల్లో రాజాం నుండి పోటీచేసిన ప్రతిభా భారతి ఓటమి పాలయ్యారు.. అయితే 2004లో ఎచ్చెర్ల నుండి 2009, 2014 ఎన్నికల్లో రాజాం నియోజకవర్గం నుండి టిడిపి తరుపున ప్రతిభా భారతి, కాంగ్రెస్ నుండి కొండ్రు మురళీ వరుసగా మూడు సార్లు వేరు వేరు పార్టీల నుండి పోటీచేసి రాజకీయ ప్రత్యర్థులుగా మారారు.. 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ నుండి పోటీచేసి కావలి ప్రతిభా భారతిపై గెలిచిన కొండ్రు మురళీ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా పనిచేశారు.. అలా అప్పటి నుండి ఇద్దరి మధ్య వైరం ఉప్పు నిప్పులా మారింది.. ఒకరంటే ఒకరికి పచ్చగడ్డి వేస్తే భగ్గమంటోంది.

అయితే ఆ తరువాత జరిగిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో 2018 లో మాజీ మంత్రి కోండ్రు మురళీ టిడిపి తీర్థం పుచ్చుకున్నారు.. దీంతో బయటపోరు కాస్త ఇంటి రచ్చగా మారింది.. అయితే ఎట్టకేలకు 2019 ఎన్నికల్లో టిడిపి కొండ్రు మురళీకి టిక్కెట్ ఇవ్వడంతో రాజాంలో కొండ్రు మురళీ పోటీ చేసి వైసిపి వేవ్‌లో ఓటమి పాలయ్యారు… ఆ ఎన్నికల తరువాత టిడిపి క్యాడర్ కి అండగా ఉంటూ అటు కాంగ్రెస్, ఇటు టిడిపి క్యాడర్ ను తన వైపు తిప్పుకుని రాజకీయాలు నెరుపుతూ వస్తున్నాడు. అలా తప్పనిసరి పరిస్థితుల్లో కావలి ప్రతిభ భారతి కూడా రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.. అయితే ఆ తరువాత కొద్దిరోజులకు సడెన్ గా ప్రతిభా భారతి కుమార్తె కావలి గ్రీష్మ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు.. రాజాంలో విస్తృతంగా పర్యటించి తన పాత అనుచరులను కలిసి వారి మద్దతు అడుగుతూ హడావుడి చేశారు.. అంతేకాకు0డా 2024 ఎన్నికల్లో రాజాం టిక్కెట్ తన కుమార్తె గ్రీష్మకే ఇస్తున్నారని క్యాడర్ తో ప్రతిభా భారతి సమావేశాలు పెట్టడం, అలాగే గ్రీష్మ గ్రామాల్లో పర్యటించడం నియోజకవర్గ టిడిపి క్యాడర్లో ఆయోమయానికి గురిచేసింది.

ఈ నేపథ్యంలోనే ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు రాజాంలో పర్యటించారు. ఆ పర్యటన వీరి మధ్య మరింత వివాదానికి దారి తీసింది.. ఆ టూర్ లో ఎవరికి వారే తమ ఆధిపత్యం చూపించుకునే ప్రయత్నం చేశారు.. అందుకోసం ఇరు వర్గాలు పెద్ద ఎత్తున ఫ్లెక్స్‌లు పెట్టి రాజాంను పసుపుమయం చేశారు.. అయితే గ్రీష్మ పెట్టిన ఏ ఫ్లెక్స్ లో కూడా ఇంచార్జిగా ఉన్న కొండ్రు మురళి ఫోటో లేకపోవడం, అదే ఫ్లెక్స్ లో మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు ఫోటో ఉండటం కొండ్రు వర్గానికి ఒకింత ఆగ్రహానికి గురి చేసింది. దీంతో కోండ్రు వర్గం రాజాం పట్టణంలో పలుచోట్ల గ్రీష్మ ఫ్లెక్స్‌లను చించేసి నానా హంగామా చేశారు.. ఇదే విషయం పై గ్రీష్మ కూడా కోండ్రు మురళీ వర్గం పట్ల అసహనం వ్యక్తం చేశారు.. మాజీమంత్రి కిమిడి కళా వెంకట్రావు నివాసం కావడం, గతంలో ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా పనిచేయటంతో కళా వెంకట్రావుకి కూడా ఇక్కడ కొంత ఓటు బ్యాంక్ ఉంది..

ఈ పరిస్థితుల్లోనే కొండ్రుకి, కళా వెంకట్రావుకి గ్యాప్ ఉండటం, మరోవైపు తన రాజకీయ ప్రత్యర్ధి అయిన గ్రీష్మ, కళాకి దగ్గరవ్వడం కొండ్రుకి ఏ మాత్రం మింగుడు పడలేదు.. నియోజకవర్గంలో పర్యటిస్తూ ఆర్థికంగా ఎంతో ఖర్చుచేసి క్యాడర్ కు అండగా నిలవడంతో పాటు తనకు అనుకూలంగా పార్టీని బలంగా తయారు చేసుకుంటే గ్రీష్మ ఇలా గ్రూప్స్ కట్టడం ఎంత వరకు కరెక్ట్ అని అప్పట్లో అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్ళారట కోండ్రు.. అలా మొత్తానికి ఏమైందో ఏమో కానీ సడన్‌గా గ్రీష్మ సైలెంట్ అవ్వడం, 2024 ఎన్నికల్లో కోండ్రు రాజాం టిక్కెట్ దక్కించుకొని ఆ ఎన్నికల్లో గెలవడం జరిగిపోయాయి. ఆ తరువాత ఇప్పటివరకు గ్రీష్మ కూడా నియోజకవర్గంలో వేలు పెట్టలేదు. అయితే ఇప్పుడు గ్రీష్మ ఎమ్మెల్సీగా ఎన్నిక అయిన నేపథ్యంలో మరోసారి వర్గ విభేదాలు తలెత్తి పార్టీ కార్యకర్తల్ని అయోమయానికి గురిచేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ఆ పార్టీ నేతలు. ఏది ఏమైనా రాజాం నియోజకవర్గం ఇప్పటిలా ప్రశాంతంగా ఉంటుందా? లేక వేడెక్కుతుందో చూడాలి మరి .

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.