ఖజానా కార్యాలయానికి కన్నం వేశారు. ట్రెజరీ ఉద్యోగులే దొంగలుగా మారారు. ట్రెజరీలో దాచి ఉంచిన నగదు తో పాటు పురాతన నాణేలు కూడా తస్కరించారు. దీనిపై రాజంపేట పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే… అన్నమయ్య జిల్లా రాజంపేట ట్రెజరీలో ఇంటి దొంగల చేతి వాటం ప్రదర్శించారు. ట్రెజరీలో దాచి ఉంచిన పురాతన నాణేలతో పాటు నగదును మాయం చేశారు. ఈ విషయమై సబ్ డివిజనల్ ట్రెజరీ అధికారి అమీనుద్దీన్ పోలీసులకు పిర్యాదు చేశారు.
పట్టణ పోలీస్‌లు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. విచారణలో నలుగురు ఉద్యోగస్తులు పేర్లు బయట పడడంతో వారిపై జిల్లా ట్రెజరీ అధికారి శివశంకర్ సస్పెన్షన్ వేటు వేశారు. సస్పెండ్ అయిన వారిలో అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ సయ్యద్ అమిరుద్దీన్, సబ్ ట్రెజరీ ఆఫీసర్ రమేష్ రెడ్డి, క్యాషియర్ మురళీమోహన్, అటెండర్ విష్ణువర్ధన్ రెడ్డిలు ఉన్నారు. ప్రధాన సూత్రదారి ఆటెండర్ విష్ణువర్ధన్ రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ట్రెజరీలో డిపాజిట్ చేసిన 12 వేల రూపాయలతో పాటు పుల్లంపేట మండలంలో గతంలో దొరికిన పురాతన నాణాలను కూడా ట్రెజరీ గదిలో నుంచి దొంగిలించారు. దాదాపు 60 పురాతన నాణేలు దొంగిలించినట్లు తెలుస్తుంది. పురాతన నాణేలకు సంబంధించి వాటి విలువ ఎంత అన్నదానిపై స్పష్టత రాకున్నా బహిరంగ మార్కెట్లో వీటి విలువ లక్షల్లో ఉంటుందని సమాచారం. ఏది ఏమైనా ఇంటి దొంగల గుట్టురట్టు బయటపడి కటకటాలపాలైన సంఘటన రాజంపేట పట్టణంలో చోటుచేసుకుంది. ప్రభుత్వ కార్యాలయాలలో అప్పుడప్పుడు అధికారులు తనిఖీలు చేస్తూ ఉంటే తప్ప ఇలాంటివి అరికట్టలేము. ఎప్పుడో దొరికిన వాటిని ఎవరు తీస్తారులే అనుకుంటే ఇలాంటి ఇంటి దొంగలే కార్యాలయాల్లో తయారవుతారు. అధికారులు ఇప్పటికైనా ఇలాంటివి గమనించి ఎప్పటికప్పుడు తనిఖీలు చేసుకుంటే ఇంటి దొంగల గుట్టు రట్టు అవుతూ ఉంటుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..