పశ్చిమగోదావరి జిల్లా, డిసెంబర్ 13;ఆహా ఏమి రుచి… తినరా మైమరచి.. అనే మాట వింటే ముందుగా గుర్తొచ్చేది విందు భోజనాలు. సాధారణంగా ఏ శుభకార్యాలలోనైనా ముందుగా భోజనాలు ఎలా ఉన్నాయి. వెరైటీలు ఏంటి అనే టాక్ వినిపిస్తుంది.. అలాంటిది ఎంతో రుచికరమైన భోజనాలు పెడితే అలాంటి వారిని ఎవరు మర్చిపోరు. ముఖ్యంగా అలాంటి రుచికరమైన భోజనాలు ప్రత్యేకంగా వివాహలు, ఇతరత్రా శుభకార్యాల్లో మాత్రమే పెడుతుంటారు. కానీ అక్కడ నిత్య అన్నదాన సత్రంలో మాత్రం ప్రతిరోజు అక్కడకి వచ్చిన ప్రతి ఒక్కరికి రుచికరమైన ఎన్నో వెరైటీలతో కలిగిన భోజనం అందిస్తారు. ఇంతకీ అంత రుచికరమైన భోజనాలు సైతం ఉచితంగా పెడుతున్నారంటే మీరు నమ్ముతారా.. కానీ అది నిజం.. నిత్యం అక్కడికి వచ్చిన భక్తులకు వెరైటీలతో నాణ్యమైన భోజనాన్ని ఉచితంగా ప్రసాదం రూపంలో అందిస్తున్న నిర్వాహకులను పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.
భక్తులు నిత్య అన్నదానశాల అనగానే ఏదైనా పుణ్యక్షేత్రమా అనే డౌట్ మీకు రావచ్చు.. అది పుణ్యక్షేత్రమే కానీ క్రైస్తవ పుణ్యక్షేత్రం. ఆంధ్రప్రదేశ్‌లో సంవత్సరం పొడుగునా ప్రతిరోజు అక్కడికి వచ్చిన వారందరికీ ఉచితంగా అన్నదానం చేసే ఏకైక పుణ్యక్షేత్రం ఇదొక్కటే.. ఇంతకీ ఎక్కడా ఆ క్రైస్తవ పుణ్యక్షేత్రం అని అనుకుంటున్నారా.? ఉభయ గోదావరి జిల్లాలో ఎంతో పేరొందిన గౌరీపట్నం నిర్మలగిరి మేరీ మాత పుణ్యక్షేత్రం.. అక్కడికి నిత్యం వేలాదిమంది భక్తులు మేరీమాతను దర్శించేందుకు వస్తుంటారు. అయితే ఇక్కడికి వచ్చే భక్తులలో ఎక్కువ శాతం హిందువులే ఉండడం గమనార్హం.. భక్తులు ముందుగా మేరీ మాతకు ప్రత్యేక ప్రార్థనలు, పూజలు నిర్వహించి తమ మొక్కులు తీర్చుకుంటారు. ముఖ్యంగా కొండపై నిత్య అన్నదాన శాలలో ఎంతో రుచికరమైన భోజనాన్ని ఉచితంగా వితరణ చేస్తారు. అక్కడ నిత్య అన్నదాన శాలాలో భోజనం చేసిన భక్తులు ఆహా ఏమి రుచి… తినరా మైమరిచి అనే విధంగా ఆనందం పొందుతున్నారు. ఎందుకంటే అంత టేస్ట్ గా ఉంటుంది ఆ భోజనం.
ఇక్కడి అన్నదానశాలలో భోజనాలు ఎంతో ఫేమస్.. ఆ కారణం చేతనే కొండపైన, కానీ కొండ దిగువన కానీ ఎక్కడ కూడా భోజనానికి సంబంధించిన ఏ విధమైన హోటల్లు ఉండవు. నిత్యాన దానశాల రెండు అంతస్తులలో ఉండి ఒక్కొక్క అంతస్తులో ఒకేసారి 300 మందికి పైగా భోజనం చేయవచ్చు. నిత్య అన్నదానశాలలో ప్రతిరోజు సుమారు 1500 నుంచి 2000 మందికి ఉచిత భోజన ప్రసాదాన్ని పంపిణీ చేస్తారు. ఆదివారాల్లో అయితే సుమారు 5000 మంది పైన భక్తులు అన్నదానంలో పాల్గొంటారు. ఇక్కడ అన్నదానంలో ముందుగా రుచికరమైన స్వీట్, ఆ తరువాత ఎంతో స్వచ్ఛమైన రైస్, పప్పు, రెండు కూరలు, ఒక చట్నీ, అదేవిధంగా ఎంతో రుచికరమైన సాంబార్ ను వడ్డిస్తారు. ఇక్కడ సాంబార్ ఎంతో ఫేమస్. ఇక్కడికి వచ్చిన భక్తులు సాంబార్ తో రైస్ తినేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతారు.. ఇక్కడ పెట్టిన సాంబార్ టేస్ట్ మరెక్కడ లేదని భక్తులు అంటున్నారు. ఎందుకంటే ఇక్కడ సాంబార్‌ని స్టీమ్ తో కాస్తారు. కట్టెపుల్లల ద్వారా వేడిని రగిలించి దాని ద్వారా వచ్చే ఆవిరిని పైపులగుండా చాంబర్‌లోకి ప్రవేశపెట్టి ఆ ఛాంబర్ నుండి వచ్చిన స్టీమ్ తోనే సాంబార్ ను కాయడం ఇక్కడ ప్రత్యేకత. అందుకనే ఇక్కడ సాంబార్ చాలా రుచిగా ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు.
అంతేకాదు ఎప్పుడు ఒక నెలకు సరిపడా అన్నదానానికి సంబంధించిన స్టాక్ స్టోర్ రూమ్ లో రెడీగా ఉంటుంది. దాంతో రుచిగా ఇన్ని వెరైటీలతో భోజనం పెట్టే ఏకైక క్రైస్తవ పుణ్యక్షేత్రం నిర్మలగిరి మేరీ మాత పుణ్యక్షేత్రమని భక్తులు కొనియాడుతున్నారు. అయితే ఇంతకీ మీరు అనుకోవచ్చు ఇంతటి రుచికరమైన భోజనాలు ఎలా పెడుతున్నారు.. వాటికి ఎంత ఖర్చవుతుందనీ.. ఇక్కడ అన్నదానశాలలో పెట్టే భోజనాల ఖర్చు మొత్తం భక్తులు, దాతలు ఇచ్చే విరాళాల తోనే సాగుతుంది. గత 23 సంవత్సరాలుగా భక్తులు, దాతలు ఇచ్చిన విరాళాలతోనే శ్రేష్టమైన అన్నదానాన్ని నిర్వహిస్తున్నారు. ఇక్కడ వైవిద్య భరితంగా ప్రార్థనలు, పూజలు నిర్వహిస్తారు. ఇక్కడ ప్రార్థనలు క్రైస్తవ నియమాలకు కాస్తంత భిన్నంగా హిందూ ఆచారాలకు దగ్గరగా నిర్వహిస్తారు. నిర్మలగిరి మేరీ మాత పుణ్యక్షేత్రంలో ఇలానే ప్రార్థన చేయాలని అక్కడికి వచ్చే భక్తులకు ఎటువంటి రూల్స్ ఉండవు. వారు తమకు నచ్చిన విధంగా అక్కడున్న మేరీ మాతను పూజిస్తారు. ఉభయగోదావరి జిల్లాలలే కాకుండా రాష్ట్రం నలుమూలల నుంచి అక్కడికి భక్తులు వస్తుంటారు.
హిందువులే అధిక సంఖ్యలో మేరీమాతను దర్శించడం ఇక్కడి ప్రాముఖ్యత.. అయితే హిందూ సంప్రదాయ విగ్రహాలకు ఆలయాల్లో కొబ్బరికాయలు కొట్టినట్టుగానే ఇక్కడికి వచ్చిన భక్తులు కొబ్బరికాయలు కొట్టి ప్రార్థనలు చేస్తారు. మేరీమాతను తమ సమస్యను చెప్పుకొని ప్రార్థించి ఆ సమస్య తీరిన తరువాత హిందూ ఆలయాలలో మాదిరిగా క్రైస్తవ ఆలయంలో తలనీలాలు సమర్పించడం ఇక్కడ ప్రధాన విశేషం. అలాగే మేరీ మాతకు భక్తులు సమర్పించిన చీరలను అక్కడ విక్రయిస్తారు. అంతేకాకుండా కొండపైకి వెళ్లే మెట్ల మార్గంలో మొక్కుబడలు ఉన్న భక్తులు తమ మోకాళ్లపై నడుచుకుంటూ ఎక్కుతూ ఏసుప్రభును ప్రార్థిస్తారు. ఇక కొండపై ప్రధాన గోపురంలో ఉన్న మందిరంలో ఏసూప్రభు ముందు ఓ గంటను సైతం ఏర్పాటు చేశారు. అక్కడికి చేరుకున్న భక్తులు గంట కొట్టి మోకాళ్ళ ప్రార్థన చేస్తారు. అలాగే ప్రతిరోజు మేరీ మాత క్షేత్రంలో అక్కడున్న ఫాదర్లు దివ్య బలి పూజలు నిర్వహిస్తారు.
ఇక నిర్మలగిరి కొండకు ఎడమవైపున ఉన్న పెద్ద ప్రార్థనా మందిరం ముందు పొడవాటి స్తంభాన్ని ఏర్పాటు చేశారు. దానిని ‘యావే నాధ్వజము’ అని పిలుస్తారు. అంతేకాకుండా కొండపైన ప్రభువైన ఏసుక్రీస్తు జీవిత విశేషాలు తెలిసేలాగా అనేక కళాఖండాలు ఏర్పాటు చేశారు. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల నిర్విరామంగా అక్కడ ప్రార్థనలు నిర్వహిస్తారు. ఈ నిర్మలగిరి మేరీమాత పుణ్యక్షేత్రం సంబంధించిన అన్ని వ్యవహారాలు ఏలూరు పీఠాధిపతులు జయరావు పొలిమేర, పుణ్యక్షేత్ర డైరెక్టర్ ఫాదర్ జాన్ పీటర్ చూసుకుంటారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..