
లాకర్ కావాలంటూ బ్యాంక్ మేనేజర్‌ను అడిగాడు ఓ వ్యక్తి. తనకు తెలుసుకున్న వ్యక్తి కావడం.. చిన్నప్పటి నుంచి పరిచయం ఉండటంతో కొంచెం చనువు తీసుకుని మరీ ఇమ్మని అడిగాడు. లాకర్ కావాలంటే.. గోల్డ్ లోన్ తీసుకోవాలని ఆమె సలహా ఇచ్చింది. దీంతో చేసేదేమిలేక బంగారం తాకట్టు పెట్టి లోన్ తీసుకున్నాడు. సరిగ్గా రెండు నెలల్లో తిరిగి చెల్లించేశాడు. తీరా తన బంగారాన్ని తిరిగి ఇమ్మని అడిగేసరి.. ప్లేట్ మార్చేసింది. చివరికి పోలీసులను ఆశ్రయించాడు సదరు బాధితుడు. ఈ ఘటన కృష్ణాజిల్లాలో చోటు చేసుకుంది. ఆ స్టోరీ ఏంటంటే.?
పెనమలూరు నియోజకవర్గం.. గంగూరు యూనియన్ బ్యాంక్ మేనేజర్ దావులూరి ప్రభావతి ఈ విధంగా చేసిందని బాధితుడు లబోదిబోమంటున్నాడు. మర్రిబంధం గ్రామానికి చెందిన కవులూరి యోగేశ్వరరావు.. తనకు చిన్నప్పటి నుంచి పరిచయం ఉన్న ప్రభావతిని నమ్మి బ్యాంకులో బంగారం పెట్టాడు. లాకర్ అడిగితే గోల్డ్ లోన్ తీసుకోమని ప్రభావతి చెప్పింది. యోగేశ్వరరావు గోల్డ్ తాకట్టు పెట్టి లోన్ తీసుకున్నాడు. అమౌంట్ మొత్తాన్ని 2 నెలల్లోనే తిరిగి చెల్లించాడు. ఆ తర్వాత తన బంగారం ఇవ్వమని అడగ్గా.. ఇంట్లో ఉందని తీసుకెళ్లి.. పెళ్లి ప్రపోజల్ పెట్టిందంటున్నాడు బాధితుడు. అంతేకాదు తన బంగారంతో వడ్డాణం చేయించుకుంటున్నాని చెప్పిందన్నాడు. తన బంగారం కావాలని అడిగితే.. బెదిరిస్తోందని.. పెనమలూరు పోలీసులకు కంప్లైంట్ చేయడంతో.. మేనేజర్ ప్రభావతిపై చీటింగ్ కేసు నమోదు చేశారు.