
తమ పెళ్లి ఖర్చుల కోసం కన్నవారు ఉన్న ఇంటిని, కొద్దిపాటి పొలాన్ని అమ్ముకునేందుకు సిద్ధపడటం చూసి తీవ్ర మనస్తాపానికి గురైన ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన హృదయవిదారక సంఘటన మన్యం జిల్లా సీతానగరం మండలంలో చోటుచేసుకుంది. పెళ్లి కొడుకు వస్తున్నాడని తెలియడంతో ఆమె మరింత ఆవేదన చెంది, తన ప్రాణాన్ని తీసుకుంది. ఈ విషాదం గ్రామంలో తీరని శోకాన్ని నింపింది.
చినభోగిల గ్రామానికి చెందిన చుక్క శ్రీను, లక్ష్మి దంపతులు వ్యవసాయ కూలీలుగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లు కాగా పెద్ద కూతురుకు రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. రెండో కూతురు అనూష (19) సీతానగరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎంపీహెచ్‌డబ్ల్యూ కోర్సును పూర్తి చేసింది. ప్రస్తుతం శిక్షణ కోసం సిద్ధమవుతున్న సమయంలోనే, తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి సంబంధాలు చూడటం ప్రారంభించారు. అయితే కూలి పనులు చేసుకునే తమ తల్లిదండ్రులు తన పెళ్లి కోసం ఇల్లు, కొద్దిపాటి భూమిని అమ్మేందుకు సిద్ధపడటం అనూషను కలచివేసింది. పెళ్లి కోసం తాము ఉన్న నీడ, ఆధారం కోల్పోవద్దని ఆమె తల్లిదండ్రులను గట్టిగా వారించింది.
తల్లిదండ్రులు ఎన్నిసార్లు చెప్పినా అనూష పెళ్లికి ఒప్పుకోలేదు. అయినప్పటికీ వారు ఒక పెళ్లి సంబంధాన్ని ఖాయం చేసుకుని, పెళ్లి కొడుకు ఫ్యామిలీ కూతురు చూసేందుకు వస్తుండడంతో ఏర్పాట్లు చేశారు. తల్లిదండ్రుల బలవంతం, ఆపై ఆస్తులను అమ్ముకోవాల్సి వస్తుందనే ఆందోళనతో తీవ్ర వేదనకు గురైన అనూష.. ఇంట్లో ఉన్న గడ్డి మందు తాగింది.
కుటుంబ సభ్యులు వెంటనే అనూషను జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమెకు వైద్యులు చికిత్స అందించారు. రెండు రోజుల పాటు మృత్యువుతో పోరాడిన అనూష శనివారం రాత్రి తుదిశ్వాస విడిచింది.
అనూష మరణంతో తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. కూతురు చదువు పూర్తై మంచి ఉద్యోగం చేస్తుందని ఆశించిన ఆ పేద తల్లిదండ్రులు, పెళ్లి కోసం చేసిన ప్రయత్నం ఇంతటి విషాదాన్ని మిగిల్చడంతో కన్నీరు మున్నీరయ్యారు. పెళ్లి ఖర్చుల కోసం తల్లిదండ్రులు పడుతున్న ఆర్థిక ఇబ్బందులే అనూష ఆత్మహత్యకు ప్రధాన కారణమని స్థానికులు చెబుతున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..