Mangalagiri Politics: మంగళగిరి వైసీపీలో పరిణామాలు టీ-20 లెవెల్లో చకచకా జరిగిపోయాయి. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి ఔట్.. గంజి చిరంజీవి ఇన్.. ఇలా మంగళగిరి రాజకీయాలు శరవేగంగా మారిపోయాయి. మంగళగిరిలో రెండుసార్లు వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన ఆళ్ల రామకృష్ణారెడ్డి పార్టీతో పాటు తన ఎమ్మెల్యే పదవికి కూడా గుడ్‌బై చెప్పారు. దీంతో బీసీ సామాజిక వర్గానికి చెందిన గంజి చిరంజీవి.. సీఎం జగన్‌తో భేటీ అయ్యారు. అనంతరం మంగళగిరి వైసీపీ ఇన్‌చార్జిగా గంజి చిరంజీవిని ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి ప్రకటించారు. సుధీర్ఘ చర్చ అనంతరం పార్టీ అధిష్టానం గంజి చిరంజీవిని ఇన్‌ఛార్జ్ గా నియమించింది.
వివరాల్లోకెళ్తే..
సోమవారం ఉదయం మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి.. పార్టీతో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. శాసనసభ కార్యదర్శికి ఆళ్ల తన రాజీనామా లేఖ ఇచ్చారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నానని ఆ లేఖలో పేర్కొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో వైసీపీ నేతల మధ్య విభేదాలు ఇటీవలి కాలంలో తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. పోటాపోటీగా కార్యాలయాలు ఓపెన్ చేశారు. ఆళ్ల రామకృష్ణారెడ్డికి వ్యతిరేకంగా, మంగళగిరి తాడేపల్లి నగర అధ్యక్షుడు వేమారెడ్డి పార్టీ పేరుతో కార్యాలయం ఏర్పాటు చేశారు. ఇప్పటికే మంగళగిరిలో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పార్టీ కార్యాలయం ఉండగా.. వేమారెడ్డి కార్యాలయం ఓపెన్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. ఇక ఆ తరువాత కూడా నేతల మధ్య విభేదాలను సమసిపోయేలా చేసేందుకు వైసీపీ అధిష్టానం ప్రయత్నించలేదనే టాక్ కూడా నడుస్తోంది. ఆ విభేదాలు పెరిగి చివరకు ఆర్కే రాజీనామా చేశారంటున్నారు అనుచరులు.
ఇక ఇప్పుడు ఆర్కే రాజకీయ పయనం ఎటువైపు అనేది ఆసక్తిని రేపుతోంది. అమరావతి విషయంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి పలు కేసులు వేశారు. గల్లీ నుంచి ఢిల్లీ కోర్టు వరకు చంద్రబాబుతో సహా పలువురు టీడీపీ నేతలపై ఆయన కోర్టుకు ఎక్కారు. ఏపీ సీఎం జగన్‌కు సన్నిహితుడిగానూ ఆయనకు పేరుంది. ఐతే.. మంగళగిరి వైసీపీ ఇన్‌ఛార్జ్‌గా గంజి చిరంజీవిని నియమించే అవకాశం ఉందనే వార్తలతో ఆర్కే మనస్తాపానికి గురయ్యారు. కొద్ది నెలల కిందటే బీసీ నేత గంజి చిరంజీవి వైసీపీలో చేరారు. వెంటనే ఆయన్ను ఆప్కో ఛైర్మన్‌గా నియమించారు.
అలాగే పద్మశాలీ సామాజికవర్గానికి చెందిన మరో నేత హనుమంతరావుకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఈ పరిణామాలతో పాటు తనకు వ్యతిరేకంగా పనిచేసే వేమారెడ్డిని MTMC నగర అధ్యక్షుడుగా నియమించడం కూడా RKకు మింగుడు పడలేదు. ఈ నేపథ్యంలోనే ఆయన రాజీనామా నిర్ణయంతీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే ఆర్కే ప్రస్తుతం ఎవరికీ అందుబాటులోకి రావడం లేదు. ఆయన భవిష్యత్తులో ఎటువైపు అడుగులు వేస్తారో చూడాలి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..