Ongole RIMS: ఒంగోలు మెడికల్‌ కాలేజిలో గ్యాంగ్‌ వార్‌..! క్లాస్‌రూంలోనే చితక్కొట్టుకున్న మెడికోలు.. 15 మంది సస్పెండ్

| Edited By: Srilakshmi C

Nov 23, 2023 | 1:16 PM

ఒంగోలు రిమ్స్ మెడికల్ కాలేజీలో విద్యార్ధుల మధ్య ఘర్షణల ఘటనలో 15 మంది థర్డ్‌ ఇయర్‌ స్టూడెంట్స్‌ను కాలేజి ప్రిన్సిపల్‌ సస్పెండ్‌ చేశారు. విద్యార్దుల మధ్య ఏడాదికాలంగా చెలరేగుతున్న వరుస ఘర్షణలపై ఐదుగురు అధికారుల బృందంతో దర్యాప్తునకు ఆదేశించారు. రెండు రోజుల క్రితం తాజాగా క్లాస్‌రూంలో జరిగిన ఘర్షణపై వైద్య విద్యా విభాగం డైరెక్టర్ సీరియస్ అయ్యారు. కాలేజీలో గొడవ పడిన 15 మంది విద్యార్థులను హాస్టల్, కాలేజీ తరగతుల నుంచి బహిష్కరించారు. మెడికల్ కాలేజీలో థర్డ్‌ ఇయర్‌ సంవత్సరం చదువుతున్న పలువురు..

Ongole RIMS: ఒంగోలు మెడికల్‌ కాలేజిలో గ్యాంగ్‌ వార్‌..! క్లాస్‌రూంలోనే చితక్కొట్టుకున్న మెడికోలు.. 15 మంది సస్పెండ్
Ongole Rims Medical Students
Follow us on

ఒంగోలు, నవంబర్‌ 23: ఒంగోలు రిమ్స్ మెడికల్ కాలేజీలో విద్యార్ధుల మధ్య ఘర్షణల ఘటనలో 15 మంది థర్డ్‌ ఇయర్‌ స్టూడెంట్స్‌ను కాలేజి ప్రిన్సిపల్‌ సస్పెండ్‌ చేశారు. విద్యార్దుల మధ్య ఏడాదికాలంగా చెలరేగుతున్న వరుస ఘర్షణలపై ఐదుగురు అధికారుల బృందంతో దర్యాప్తునకు ఆదేశించారు. రెండు రోజుల క్రితం తాజాగా క్లాస్‌రూంలో జరిగిన ఘర్షణపై వైద్య విద్యా విభాగం డైరెక్టర్ సీరియస్ అయ్యారు. కాలేజీలో గొడవ పడిన 15 మంది విద్యార్థులను హాస్టల్, కాలేజీ తరగతుల నుంచి బహిష్కరించారు. మెడికల్ కాలేజీలో థర్డ్‌ ఇయర్‌ సంవత్సరం చదువుతున్న పలువురు విద్యార్థులు మద్యం తాగి గొడవలకు దిగుతున్నారన్న ఆరోపణల నేపధ్యంలో విచారణకు ఆదేశించారు… ఈ నేపథ్యంలో వరుస ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని డీఎంఈ ఆదేశించారని మెడికల్ కలాశాల ప్రిన్స్‌పల్ ఏడుకొండలరావు తెలిపారు. ఈ మేరకు ఐదుగురు సభ్యులతో విచారణ కమిటీని నియమించారు… పోలీసులు ఇరు వర్గాలపై రెండు పోలీస్‌ స్టేషన్లలో నాలుగు కేసులు నమోదు చేశారు.

తాజా ఘర్షణతో వెలుగులోకి వచ్చిన వివాదాలు…

ఒంగోలు ప్రభుత్వ మెడికల్‌ కాలేజిలో థర్డ్‌ ఇయర్‌ ఎంబిబియస్‌ విద్యార్ధులు రెండు రోజుల క్రితం తన్నుకున్నారు. క్లాస్‌రూంలోనే చితక్కొట్టుకున్నారు. అది చాలదన్నట్టు కాలేజి బయట కూడా ఘర్షణ పడ్డారు. ఈ దాడుల్లో ఓ విద్యార్ధి తలకు తీవ్ర గాయమైంది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. విద్యార్ధులు మద్యం, గంజాయి మత్తులో గొడవలకు దిగుతున్నారన్న ఆరోపణలపై విచారణ చేపట్టారు. అయితే కాలేజి హాస్టల్‌లో విద్యార్ధులు పార్టీల పేరుతో మద్యం తాగుతున్నట్టు తెలిసింది కానీ గంజాయి గురించి ఎలాంటి ఆధారాలు లభించలేదని సెబ్‌, పోలీసు అధికారులు తెలిపారు. మరోవైపు విద్యార్ధుల మధ్య ఘర్షణపై కాలేజి ప్రిన్సిపల్‌, గాయపడ్డ విద్యార్ధి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. కాలేజి క్లాస్‌రూంలో గొడవ పడిన ఘటనలో ఇరువర్గాలపై ఒంగోలు ఒన్‌టౌన్‌ పియస్‌లో రెండు కేసులు నమోదు చేశారు… కాలేజి బయట మరోసారి విద్యార్ధులు ఘర్షణపడిన ఘటనలో ఒంగోలు తాలూకా పియస్‌లో ఇరువర్గాలపై మరో రెండు కేసులు నమోదు చేశారు… కాలేజిలోని హాస్టళ్లలో విద్యార్ధులు బర్త్‌డే పార్టీల పేరుతో మద్యం, సిగరెట్లు తాగుతూ తీసుకున్న వీడియోలు సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తుండటంతో ఒంగోలు ప్రభుత్వ మెడికల్‌ కాలేజిలో విద్యార్ధుల వ్యవహారం రచ్చకెక్కింది.

వరుస ఘర్షణలు..15 మంది మెడికోలు సస్పెండ్‌..

ఒంగోలు రిమ్స్‌ ఆసుపత్రికి అనుబంధంగా ఉన్న ప్రభుత్వ మెడికల్‌ కాలేజి గత ఏడాది కాలంగా వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. థర్డ్‌ ఇయర్‌ చదువుతున్న 2020 బ్యాచ్‌కు చెందిన విద్యార్ధుల మధ్య ఏడాది కాలంగా ఆధిపత్యం కోసం పోరునడుస్తోంది. అందుకు కారణం కులాల వారీగా విద్యార్ధులు విడిపోయారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అంతే కాకుండా ఓ గ్రూపుకు చెందిన విద్యార్ధులు మరో గ్రూపుకు చెందిన విద్యార్ధికి గుండు కొట్టించిన ఘటన కూడా చోటు చేసుకోవడంతో ఈ ఘటనతో సంబంధం ఉన్న విద్యార్ధులను సస్పెండ్‌ కూడా చేశారు. దీంతో రెండు గ్రూపులుగా విడిపోయిన విద్యార్ధులు తరచూ గొడవలు పడుతున్నారు. ఈ క్రమంలో కొంతమంది విద్యార్ధులు కాలేజి హాస్టల్‌లో మందు తాగి మెస్‌కు వస్తున్నారని, అక్కడ భోజనం విషయంలో గొడవకు దిగుతున్నారని 9 మంది విద్యార్ధులపై ఆరోపణలు వచ్చాయి.

ఈ ఆరోపణలపై అప్పట్లోనే కాలేజి డీన్‌ విచారణ చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న 9 మంది విద్యార్దులను హాస్టల్‌ నుంచి పంపించివేశారు. దీంతో తమను హాస్టల్‌ నుంచి బయటకు పంపేందుకు ప్రత్యర్ది గ్రూపునకు చెందిన కొంతమంది విద్యార్ధులు కారణమయ్యారన్న కారణంగా కాలేజిలో థర్డ్‌ ఇయర్‌ చదువుతున్న విద్యార్ధుల మధ్య విభేధాలు తీవ్రస్థాయికి చేరాయి. ఈ క్రమంలో గత మూడు రోజుల నుంచి కాలేజిలో రెండు వర్గాలకు చెందిన విద్యార్ధులు గొడవలు పడుతున్నారు. రెండు రోజుల క్రితం కాలేజి క్లాస్‌రూంలోనే విద్యార్ధులు ఒకరినొకరు నెట్టుకుంటూ కొట్టుకున్నారు. ఈ ఘర్షణలో ఓ విద్యార్ది తలకు తీవ్ర గాయం కావడంతో నగరంలోని ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స అందించారు. అయితే ఈ వివాదం ఇంతటితో సద్దుమణగక మరింత ముదిరింది.

గాయపడ్డ విద్యార్ధి చికిత్స పొందుతున్న ప్రయివేటు ఆసుపత్రి ముందు మరోసారి గొడవ పడటంతో విషయం కొత్తగా వచ్చిన ప్రిన్సిపల్‌ ఏడుకొండరావు దగ్గరకు చేరింది. ఇరువర్గాలకు ప్రిన్సిపల్ కౌన్సిలింగ్‌ ఇచ్చారు. అయినా ఇరువర్గాలు మరోసారి ఘర్షణ పడటంతో పోలీసులు రంగంలోకి దిగారు. కాలేజికి చేరుకున్న పోలీసులు ప్రిన్సిపల్‌ ఇచ్చిన సమాచారం మేరకు విద్యార్ధులను విచారించారు. గాయపడ్డ విద్యార్దిని ఒంగోలు ఒన్‌టౌన్‌ సిఐ లక్ష్మణ్‌ విచారించి స్టేట్‌మెంట్‌ తీసుకున్నారు. ఈ వరుస ఘటనలపై 15 మంది విద్యార్ధులపై రెండు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇరువర్గాలపై నాలుగు కేసులు నమోదు చేశారు. మెడికల్ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ ఆదేశాల మేరకు పోలీసు కేసులు నమోదైన 15 మంది విద్యార్ధులను సస్పెండ్‌ చేశామని, ఈ ఘటనలపై ఐదుగురు అధికారు బృందంతో విచారణకు ఆదేశించామని కాలేజి ప్రిన్సిపల్‌ ఏడుకొండలరావు తెలిపారు.

విద్యార్ధుల తల్లిదండ్రుల్లో ఆందోళన…

ఒంగోలులోని ప్రభుత్వ మెడికల్‌ కాలేజిలో విద్యార్ధుల మధ్య ఘర్షణలు జరగడానికి కారణం ఆధిపత్యపోరుతో పాటు కులాల వారీగా విద్యార్ధులు గ్రూపులు కట్టడమేనని భావిస్తున్నారు. అంతేకాకుండా కొంతమంది విద్యార్ధులు కాలేజి హాస్టళ్ళలో పార్టీల పేరుతో మద్యం తాగడం, సిగరెట్లు, హుక్కాలు పీలుస్తున్నట్టు సోషల్‌ మీడియాలో వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో కాలేజి యాజమాన్యంతో పాటు విద్యార్ధుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. అసలు కాలేజిలో ఏం జరగుతోందని ఆరా తీస్తున్నారు. ఇప్పటికైనా కాలేజి ప్రిన్సిపల్‌ ఇతర అడ్మినిస్టేటివ్‌ అధికారులు గొడవలు, వివాదాలు లేకుండా పరిష్కరించాలని కోరుతున్నారు. ఏడాది కాలంగా మెడికల్‌ కాలేజిలో విద్యార్ధులు కులాల వారీగా గ్రూపులు కట్టడం, హాస్టళ్ళలో మద్యం, సిగరెట్లు తాగుతూ గొడవులు పడుతున్నా అడ్మినిస్ట్రేటివ్‌ అధికారులు ఉదాసీనంగా వ్యవహరించడం వల్లే పరిస్థితి దిగజారిందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.