బైక్ దొంగతనాల గురించి వినే ఉంటారు. కార్ల చోరి గురించి తెలిసే ఉంటుంది. ఇంకొన్ని చోట్ల ట్రాక్టర్లు, లారీలు, బస్సులు అపహరించిన వారి గురించి మీడియా ద్వారా తెలుసుకునే ఉంటున్నారు. అయితే గుంటూరులో జరుగుతున్న చోరీల గురించి మాత్రం తెలిసి ఉండదు. అవేమనుకుంటున్నారా… అవే సైకిళ్లు. గత కొన్ని రోజులుగా ఇంటి ముందు పెట్టిన సైకిళ్లు అపహరణకు గురవుతున్నాయి. దీంతో నగర వాసులు అప్రమత్తమయ్యారు. అ క్రమంలోనే ఆటోలో సైకిళ్లను తీసుకెల్తూ ఏకంగా సెల్ ఫోన్ కెమెరాకే చిక్కారు.
నగరంలోని సంపత్ నగర్, అడపా బజార్ లో సైకిళ్లు చోరికి గురవుతున్నాయి. చోరి చేసిన వాటిని తక్కువ ధరకే ఎవరికి అనుమానం రాకుండా అమ్మే అవకాశం ఉండటంతో దొంగలు వీటిపై కన్నేశారు. బైక్లు , కార్లు చోరి చేసిన తర్వాత అమ్మటం కష్టంగా మారింది. దీంతో సైకిళ్లను చోరి చేసి సులభంగా పాత ఇనుము షాపుల వారికి లేదంటే తక్కువ ధరకు పేదలకు వాటిని అంటగడుతున్నారు. రెండు రోజుల క్రితం రాత్రి సమయంలో మాజేటి పొగాకు కంపెనీ వద్ద ఆటో ఇరుకు సందులో సర్రుమంటూ దూసుకుపోతుంది.
ఆటోకు ఎడవైపు సగం సైకిల్ బయటకు కనిపిస్తూ ఉంది. ఆటో వేగంగా వెలుతుండటంతో చిన్న చిన్న నిప్పు రవ్వులు కూడా ఎగసి పడుతున్నాయి. అదే సమయంలో బైక్‌పై వెలుతున్న యువకుడికి అనుమానం వచ్చింది. వెంటనే తన సెల్ ఫోన్‌ను వెనుక కూర్చున్న స్నేహితుడికి ఇచ్చి ఆటోను వెంబడిస్తూ వీడియో రికార్డ్ చేయమని చెప్పాడు. ఇది గమనించని ఆటో డ్రైవర్ మాత్రం శరవేగంగా దూసుకుపోతూనే ఉన్నాడు. ఆటోలో రెండు మూడు సైకిళ్లు ఉండటంతో రోడ్డ పక్కన పార్క్ చేసిన ఆటోకు తగిలి ఒక సైకిల్ కింద కూడా పడిపోయింది. అయినా ఆటో డ్రైవర్ ఆటోను ఆపలేదు. దీంతో మరింత అనుమానం వచ్చిన బైక్ ప్రయాణీకుడు ఆటోను వెంబడిస్తూ దాని నంబర్ కూడా వీడియో తీశాడు. ఆ తర్వాత ఆటో జిటి రోడ్డులోకి వెళ్లి మాయమైపోయింది.
అయితే వీడియో తీసిన యువకుడు దాన్ని పోలీసులకు అందించాడు. దీంతో రాత్రి వేళల్లో సైకిళ్ళ దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాగా గుర్తించారు. ఆటో నంబర్ సాయంతో దొంగలను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం పూర్తి స్థాయి విచారణ చేస్తున్నారు. అయితే దొంగలు రాత్రి వేళ్లలో ఇలాంటి చోరీలకు పాల్పడుతుండటంతో అటు పోలీసులు ఇటు స్థానికులు అప్రమత్తంగా ఉంటున్నారు. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
మరిన్ని ఆంధప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..