
ఆంధ్రా.. ఆక్వా..! అక్షర క్రమంలోనే కాదు, ఆర్థికపరంగా కూడా తోబుట్టువులు. ఒకప్పుడు ఏపీ ఎకానమీకి వెన్నెముకగా నిలిచింది. అంతర్జాతీయ ఎగుమతులతో కాసుల వర్షం కురిపించింది. ఇప్పుడు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది ఘనత వహించిన మన ఆక్వారంగం. 3 లక్షల మంది ఆక్వా రైతుల జీవితాలు అగమ్యగోచరంగా మారాయి. ఆక్వా రంగం మీద పరోక్షంగా ఆధారపడ్డ 40 లక్షల మంది బతుకులు రోడ్డునపడ్డాయి. వరుస కష్టాలతో రొయ్య సాగు చతికిలపడి, ప్రభుత్వాలు కూడా చేతులెత్తేసిన పరిస్థితి. విధిలేని పరిస్థితుల్లో పంటకు భారీగా కోత పెట్టి కడుపు మాడ్చుకోడానిక్కూడా సై అంటున్నాడు సగటు ఆక్వా రైతు. అదే జరిగితే, ఏపీ ఆర్థిక పరిస్థితి కోమాలోకి పోవడం గ్యారంటీ. ఎందుకంటే, అరవైశాతం సీ-ఫుడ్ ప్రొడక్షన్‌కి కేరాఫ్ మన ఆంధ్రప్రదేశే. ఆక్వా ఎగుమతులతో ఏటా సగటున 66 వేల కోట్ల వ్యాపారం జరుగుతోంది. మన రొయ్యకు విదేశాల్లో గిరాకీ ఆ రేంజ్‌లో ఉందన్నమాట. అటు, ఏపీ సర్కారు కూడా మేజర్ రెవెన్యూ సోర్స్ ఆక్వా కల్చరే. తెలంగాణకు ఐటీ, ఫార్మా ఇండస్ట్రీలు ఎలాగో, ఆంధ్రా పాలిట బంగారు బాతుగుడ్లు పెట్టే రంగం ఆక్వా. అందుకే, ఇన్నాళ్లూ మైహూనా అని భరోసాలతోనే టైమ్‌పాస్ చేసిన ప్రభుత్వాల్లో సీరియస్‌గా కదలిక వచ్చేసింది. ఆశలు చిగురించి, ఢిల్లీ వైపు ఆర్తిగా చూస్తున్నాడు ఆక్వారైతు. ...