మీరు చదువుతోంది నిజమే. ఉచిత ఆటో ప్రయాణమే. అందులోనూ బీచ్ రోడ్ లో. ఒకటి కాదు, 2 కాదు… ఏకంగా 10 ఆటోలు. మీరు కూడా ఉపయోగించుకోవచ్చు… అసలు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా విశాఖ లోనే ఎందుకు పెట్టరా? అనే కదా అయితే ఓ సారి ఈ స్టోరీ చూడండి. రాష్ట్రంలోనే ఈ తరహా సేవలను గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ప్రవేశ పెట్టింది. కోస్టల్ బ్యాటరీ నుండి సాగర్ నగర్ వరకు నిత్యం 10 ఆటోలు షటిల్ సర్వీసెస్ చేస్తూ ఉంటాయి. కోస్టల్ బ్యాటరీ నుంచి ఆర్ కే బీచ్ మీదుగా పార్క్ హోటల్ జంక్షన్, లాసన్స్ బే కాలనీ, తెన్నేటి పార్క్ మరియు జోడుగుళ్లపాలెం నుంచి సాగర్ నగర్ వరకు ఈ ఎలక్ట్రిక్ ఆటోలు నిత్యం తిరుగుతూ ఉంటాయి. బీచ్ రోడ్డు ప్రాంతంలో విహరించే పౌరుల కోసం ఈ ఉచిత ఈ-ఆటో రిక్షా సేవలను ప్రారంభించింది జీవీఎంసీ
ఈ సర్వీస్‌కు సంబంధించి జివీఎంసీ అధికారి ఒకరు టీవీ9 తో మాట్లాడుతూ ప్రతి రోజు పది ఈ-ఆటో రిక్షాలు నిర్ణీత సమయాల్లో బీచ్ రోడ్ స్ట్రెచ్‌లో తిరుగుతున్నాయనీ వివరించారు. సీనియర్ సిటిజన్లు, పిల్లలు, గర్భిణీ స్త్రీలు మరియు శారీరకంగా వికలాంగులైన ప్రయాణికులు ఉచిత ఆటో-రిక్షా సేవను పొందేందుకు ఆటో డ్రైవర్లు ప్రాధాన్యత ఇస్తారని వివరించారు. అయితే పర్యాటక ప్రదేశాలలో ఈ-వాహనాలను ప్రోత్సహించడమే ఈ ఉచితం వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం. కాలుష్య నివారణకు ఇవి ఎంతో దోహదం చేస్తాయి. బీచ్ పరిసర ప్రాంతాలు కూడా ఆహ్లాదంగా ఉంచేందుకు వీలవుతుంది. ఆహ్లాదకరమైన వాతావరణాన్ని నెలకొల్పే అవకాశం ఉంటుందన్న లక్ష్యంతోనే ఈ-ఆటోలను ప్రోత్సహించడం ఈ సేవ ప్రధాన లక్ష్యం అదే సమయంలో పేదలకు ఉచిత సేవలను అందించడం కూడా ఈ సేవ లక్ష్యం అంటున్నారు అధికారులు.
ఈ ఉచిత ఆటోలను గుర్తించడం ఎలా?
సాధారణంగా ఆటోలు బ్లాక్ అండ్ యెల్లో కలర్ లో ఉంటాయి. కానీ ఈ వాహనాలు బ్లూ అండ్ వైట్ కలర్ లో ఉంటాయి కాబట్టి సులభంగా గుర్తు పట్టే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు బీచ్ రోడ్ లో వెళ్తున్నప్పుడు ఆ బ్లూ అండ్ వైట్ వాహనాలు కనిపిస్తే మీరూ ఆపి ఎక్కేయవచ్చు.
అదే సమయంలో ఈ ఉచిత సేవ దుర్వినియోగం జరిగే అవకాశం కూడా లేదని.. ఒకవేళ అలా జరుగుతుందని భావిస్తే ఆటో పై ఉన్న మొబైల్ నంబర్ కు ఫిర్యాదు చేయాలని అధికారులు కోరుతున్నారు. అలాగే ఈ వాహనాలను నడిపే ప్రతి వాహన డ్రైవర్‌కు ప్రతినెలా 15,000 రూపాయలను గౌరవ వేతనం గా ఇస్తున్నారు. సేవ ఉచితం అయినా డ్రైవర్లు జీతభత్యాలు లేకుండా పని చేయలేరు కాబట్టి జీవీఎంసీ ప్రత్యేకంగా సేవా భావం కలిగిన వారిని గుర్తించి ఎంపిక చేసింది. అంతేకాదు ఈ వాహనాల కదలికలను ట్రాక్ చేయడానికి జియో-ట్యాగింగ్ చేసుంటుంది.
నిర్ణీత సమయాల్లోనే…
అయితే ఈ ఉచిత ఆటోలు ఎప్పుడు కావాలంటే అప్పుడు లభ్యం కావు. నిర్ణీత సమయాల్లోనే ఆన్న విషయం గుర్తుంచుకోవాలి. ప్రతీ రోజూ ఉదయం పూట 9 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. మళ్లీ మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటలవరకు అందుబాటులో ఉండే విధంగా నిర్ణయించారు అధికారులు. మిగతా సమయాల్లో జీవీఎంసీకి చెందిన ఈ-చార్జింగ్ సేవా కేంద్రాల ద్వారా వాహనాల ఛార్జింగ్ జరుగుతుంది. ఈ ఉచిత సర్వీస్ ఆటో రిక్షాలకు సంబంధించిన ఒక డ్రైవర్ పి. రాంబాబు టీవీ9 తో మాట్లాడుతూ నిజంగా ఉచిత సేవ అవసరమైన ప్రయాణికులను గుర్తించి గౌరవంగా సర్వీస్ చేయమని మాకు ఆదేశాలు ఉన్నాయన్నారు.
అదే సమయంలో పూర్తి ట్రాఫిక్ నిబంధనలకు అనుగుణంగా వాహనాలను నడుపుతామని, కేవలం ముగ్గురు ప్రయాణికులకు మాత్రమే ఒక ట్రిప్ కు అనుమతి ఉంటుందన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఓవర్‌లోడింగ్ అనుమతించబడదనీ స్పష్టం చేశాడు. అదే సమయంలో ఈ సేవలు పక్కదారి పట్టకుండా జీపీఎస్ ఉందని, పర్యవేక్షించే మెకానిజం ఉందన్నారు.ఈ సర్వీస్ కు సంబంధించి ఈ-ఆటోలు, ఉచిత ఆటో సర్వీస్, ఛార్జింగ్ సెంటర్లు మొదలైన వాటికి ఆసియా అభివృద్ధి బ్యాంక్ ‘అర్బన్ క్లైమేట్ చేంజ్ రెసిలెన్స్ ట్రస్ట్ ఫండ్’ కింద అందించడం విశేషం. ఈ-ఆటోల ఏర్పాటు లక్ష్యం ఎలక్ట్రిక్ ఆటోలను ప్రోత్సహించడం.. తద్వారా కాలుష్య రహిత వాతావరణాన్ని సృష్టించడం.