Andhra Pradesh: వీడో మాయగాడు.. కళ్ళ ముందే కనికట్టు.. సహాయం చేస్తానంటూ మొత్తం కాజేస్తాడు..!

| Edited By: Balaraju Goud

Nov 25, 2024 | 1:40 PM

ఏటీఎం సెంటర్లో అసలు డబ్బులే తీసుకోలేదని, అకౌంట్ నుంచి డబ్బులు ఎలా కట్ అయ్యాయని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Andhra Pradesh: వీడో మాయగాడు.. కళ్ళ ముందే కనికట్టు.. సహాయం చేస్తానంటూ మొత్తం కాజేస్తాడు..!
Atm Cheating
Follow us on

చదువు రాని వాళ్లకు సహాయం చేయాల్సింది పోయి.. నిండా ముంచేస్తున్నాడు. నిరక్షరాస్యులను ఆసరాగా చేసుకున్న ఓ ప్రబుద్ధుడు మోసాలకు పాల్పడుతున్నాడు. తాజాగా ఏటీఎం సెంటర్‌లో డబ్బులు విత్ డ్రా చేయడం ఎలాగో తెలియని రైతును ఓ దొంగ మోసం చేసిన తీరు సీసీ కెమెరాలో రికార్డు అయింది. అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలోని ఏటీఎం సెంటర్‌లో డబ్బులు విత్ డ్రా చేసుకోవడానికి సహాయం చేస్తున్నట్లు నటించి ఏటీఎం కార్డు మార్చి డబ్బులు కాజేశాడు ఓ దొంగ.

ఉరవకొండ పట్టణంలోని కెనరా బ్యాంక్ ఏటీఎంలో నగదు తీసుకోవడం కోసం ఖాయంపల్లి గ్రామానికి చెందిన నెట్టికల్లు అనే వ్యక్తి ఏటీఎం సెంటర్‌కు వచ్చాడు. ఏటీఎం సెంటర్‌లో కార్డ్ పెట్టి డబ్బులు తీసేందుకు ప్రయత్నించాడు. అయితే, డబ్బులు ఎలా విత్ డ్రా చేసుకోవాలో తెలియక అలాగే నిల్చున్నాడు. ఇంతలో ఓ దొంగ ఏటీఎం సెంటర్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. డబ్బులు తీసి ఇస్తున్నట్లు నటించి, చాకచక్యంగా కళ్ళముందే ఏటీఎం కార్డు మార్చేశాడు.

రైతు నెట్టికల్లు డబ్బులు డ్రా చేయమని సహాయం కోరగా… ఏటీఎం కార్డు తీసుకుని మెషిన్ లో పెట్టి, పిన్ నెంబర్ ఎంటర్ చేశాడు. మెషిన్ నుంచి కార్డు బయటికి తీసి అంతలోనే ఏటీఎం కార్డును మార్చేశాడు. తన దగ్గర ఉన్న డమ్మీ ఏటీఎం కార్డును బాధితుడు నెట్టికల్లుకి ఇచ్చి డబ్బులు రావడం లేదంటూ, ఎంచక్కా ఏటీఎం సెంటర్ నుంచి జారుకున్నాడు. ఇక్కడ బాధితుడు ఏటీఎం సెంటర్‌లో డబ్బులు డ్రా చేయకపోయినా, 75 వేల రూపాయలు నగదు విత్ డ్రా అయినట్లు బ్యాంకు నుంచి మెసేజ్ వచ్చింది. దీంతో షాక్ అయ్యాడు సదరు రైతు.

ఏటీఎం సెంటర్లో అసలు డబ్బులే తీసుకోలేదని, అకౌంట్ నుంచి డబ్బులు ఎలా కట్ అయ్యాయని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు ఏటీఎం సెంటర్‌లోని సీసీ ఫుటేజ్ పరిశీలించి ఖంగుతిన్నారు. బాధితుడు నెట్టికల్లును మాటల్లో పెట్టి ఎంత చాకచక్యంగా.. కళ్ళముందే కనికట్టు చేసినట్లు ఏటీఎం కార్డు మార్చిన తీరు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. అలా ఎత్తుకెళ్లిన ఏటీఎం కార్డుతో హీరేహాల్‌లోని మరో ఏటీఎం నుంచి 75 వేల రూపాయలు నగదు డ్రా చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు, సీసీ ఫుటేజ్ ఆధారంగా దొంగ కోసం గాలింపు చేపట్టారు.

వీడియో చూడండి.. 

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..