Andhra Pradesh: ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాలో ఓ నాలుగేళ్ల బుడతడు.. తల్లిదండ్రులను తెగ టెన్షన్ పెట్టాడు. తోటి పిల్లలతో కలిసి ఆడుకుంటున్న సమయంలో.. బిందెలో ఇరుక్కుపోయాడు. ఎంత ప్రయత్నించినా చిన్నోడు బయటకు రాలేదు. దీంతో పేరెంట్స్ హైరానా పడిపోయాడు. బ్లేడ్ కట్టర్ సాయంతో.. బిందెను కోసి.. ఎట్టకేలకు బాలుడిని బయటకు తీశారు. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని తిరువూరు మండలం(Tiruvuru Mandal) వామకుంట్ల(Vamakuntla) గ్రామానికి చెందిన బండి వీరాస్వామి ఇంట్లో ఇటీవల ఓ శుభకార్యం జరిగింది. ఆ ఫంక్షన్‌కు వీరాస్వామి చెల్లి అరుణ తన నాలుగేళ్ల కుమారుడు విక్రమ్‌తో కలిసి వచ్చింది. ఈ క్రమంలో ఇంట్లోని పనుల్లో అందరూ నిమగ్నమయ్యారు. శుక్రవారం సాయంత్రం సమయంలో నీళ్లు పట్టేందుకు బిందెలు అన్నీ తీసుకొచ్చి బయట పెట్టారు. పక్కనే ఆడుకుంటున్న విక్రమ్ బిందెల వద్దకు వెళ్ళాడు. బిందెల లోపలకి ఎక్కుతూ దిగుతూ ఆడుకుంటున్నాడు. అలాగే చిన్న సైజ్ ఉన్న బిందెలోకి దిగి.. అందులో నడుం వరకు ఇరుక్కు పోయాడు. ఎంతకీ కాళ్ళు బయటకు రాకపోవడంతో బిగ్గరగా ఏడవడం స్టార్ట్ చేసాడు. ఇది గమనించిన తల్లి బాలుడిని బిందెలో నుంచి బయటకు తీసేందుకు ప్రయత్నం చేసింది. అయినా రాకపోవడంతో చుట్టు పక్కల వారిని పిలిచారు. అయినా ఫలితం లేదు. దీంతో స్థానికుల వద్ద ఉన్న ఇనుప కట్టర్ తో బిందెను కట్ చేశారు. చాలా సేపు శ్రమించి బిందెలో ఇరుక్కున్న బాలుడిని బయటకు తీశారు. సురక్షితంగా బాలుడు బయట పడడంతో తల్లిదండ్రులు, బంధువులు ఊపిరి పీల్చుకున్నారు.
సాగర్, టీవీ9 తెలుగు, విజయవాడ