ఆంధప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో ఆరుగురు దుర్మరణం చెందగా.. 15మందికి పైగా తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన కావలి ముసునూరు టోల్‌ప్లాజా వద్ద శుక్రవారం అర్ధరాత్రి దాటక 2 గంటల సమయంలో జరిగింది. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును లారీ ఢీకొట్టింది. ఆగి ఉన్న లారీని వెనుకనుంచి వస్తున్న.. ముందు ఆగిఉన్న మరో లారీని ఢీకొట్టింది. దీంతో ముందున్న లారీ.. అదే సమయంలో ఎదురుగా బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు ఆసుపత్రిలో మరణించారు. 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. రెండు లారీల డ్రైవర్లు, బస్సు డ్రైవర్, మరో ముగ్గురు ప్యాసింజర్లు మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఘటనలో బస్సు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలానికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. చెన్నై వైపు వెళుతున్న రెండు లారీలు ఒకదాన్ని ఒకటి ఢీకొట్టుకుని ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొట్టడంతో ఈ ఘోర ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.
ఓ ప్రముఖ ట్రావెల్స్ కు చెందిన బస్సు చెన్నై నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ఘటన జరిగింది. మరి కొన్ని గంటల్లో హైదరాబాద్ చేరుకుంటామనగా.. ఈ ఘటన జరగడంతో బాధితుల కుటుంబసభ్యలు కన్నీరుమున్నీరవుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..