Andhra Pardesh: మైనర్ బాలికతో అసభ్య ప్రవర్తన.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్

ఏపీలో మరో మాజీ ఎమ్మెల్యే అరెస్ట్‌ అవ్వడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. ఇంతకు ఎవరా ఎమ్మెల్యే...? ఎందుకు ఆయన్ను అరెస్ట్ చేశారు...?

Andhra Pardesh: మైనర్ బాలికతో అసభ్య ప్రవర్తన.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్
Jaradoddi Sudhakar Arrest

Updated on: Jul 05, 2024 | 8:54 AM

ఏపీలో వైసీపీ నేతలను అరెస్టులు వెంటాడతున్నాయి. ఇటీవల ఎన్నికల సమయంలో ఘర్షణల కారణంగా మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్‌ చేసిన పోలీసులు… ఇప్పుడు మరో మాజీ ఎమ్మెల్యే సుధాకర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మైనర్ బాలికపై లైంగిక వేధింపుల ఆరోపణలతో సుధాకర్‌పై పోక్సో చట్టం సెక్షన్‌ 6 రెడ్‌విత్‌ 5(ఎల్‌) కింద కేసు నమోదు చేశారు. కర్నూలులోని తన నివాసంలోనే సుధాకర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసి స్టేషన్‌కు తరలించారు. అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి… సుధాకర్ ను కోర్టులో ప్రవేశపెట్టగా అతనికి 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. దీంతో జిల్లా కారాగారానికి సుధాకర్‌ను తరలించారు.

ఎన్నికలకు ముందే సుధాకర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలొచ్చాయి. తన ఇంట్లో పనిచేసే ఓ యువతిపై సుధాకర్‌ అసభ్యంగా ప్రవర్తించారన్న ఆరోపలున్నాయి. అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టడంతో… అప్పట్లో మహిళా సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి. సుధాకర్‌కు వ్యతిరేకంగా ధర్నాలకు సైతం దిగాయి. ఇక ఇప్పుడు ఆయనపై కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేయడం కర్నూలులో హాట్‌టాపిక్‌గా మారింది. మరోవైపు పలువురు టీడీపీ నేతలు సైతం సుధాకర్‌ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

2019 ఎన్నికల్లో కర్నూలు జిల్లా కోడుమూరు నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి మంచి మెజారిటీతో గెలిచారు డాక్టర్‌ సుధాకర్‌. అయితే ఆయనపై ఇలాంటి లైంగిక ఆరోపణల నేపథ్యంలో .. 2024 ఎన్నికల్లో వైసీపీ అధిష్టానం ఆయనకు టికెట్ కేటాయించలేదు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..