టీడీపీలోకి మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని.. నేడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో చేరిక

|

Dec 03, 2024 | 1:11 PM

ఏలూరు అసెంబ్లీ నుంచి 4సార్లు ఎమ్మెల్యేగా గెలిచి.. మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆళ్లనాని.. రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పారు.

టీడీపీలోకి మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని.. నేడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో చేరిక
Chandrababu Naidu, Alla Nani
Follow us on

అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో అధికారం చేతులు మారింది. రాజకీయమూ రంగులు మార్చింది. కానీ, ఏలూరులో మాత్రం రోజుకో మలుపు తిరుగుతోంది. ముఖ్యంగా వైసీపీ నుంచి బయటకు వచ్చిన కీలక నేతలు ఒక్కొక్కరు గా తెలుగు దేశం పార్టీలో చేరిపోయారు. చివరికి మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని(కాళీకృష్ణ శ్రీనివాస్‌) కూడా సైకిల్ ఎక్కేందుకు సిద్ధమయ్యారు. దీంతో ఏలూరు జిల్లా రాజకీయాల్లో ఒక్కసారిగా అలజడి మొదలైంది..!

మంగళవారం(డిసెంబర్ 3) ఉండవల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసి ఆయన సమక్షంలో పార్టీలో కండువా కప్పుకోనున్నారు ఆళ్ల నాని. కొద్ది నెలల క్రితం వైసీపీ పార్టీకి, పదవులకు రాజీనామా చేసి రాజకీయాలకు దూరంగా ఉంటానంటూ ప్రకటించిన ఆళ్ల నాని, తాజా నిర్ణయంతో ఏలూరులో మరోసారి రాజకీయాలు హీటెక్కాయి. ఆళ్ల నాని టీడీపీలో చేరికపై కొంతమంది వైసీపీ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహంతో ఉన్నారు. ఆయన జాయినింగ్‌ను వ్యతిరేకిస్తూచ, వాట్సాప్ గ్రూపుల్లో వీడియోలు విడుదల చేశారు. ఈ నేపథ్యంలోనే పార్టీ ముఖ్యనేతలు ఉండవల్లి రావాల్సిందిగా టీడీపీ అధిష్టానం నుంచి పిలుపు అందింది. మధ్యాహ్నం తర్వాత టీడీపీ అధినేతతో సమావేశమయ్యే అవకాశం ఉంది.

ఏలూరు రాజకీయాల్లో మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని తాజాగా మరోసారి హాట్‌టాపిక్‌గా మారారు. వైసీపీని వీడాక… ఏ పార్టీలోనూ చేరకుండా.. కొంతకాలంగా మౌనంగా ఉండిపోయారు. తాజాగా పొలిటికల్‌ సస్పెన్స్‌కు తెర దించారు. ఆయన పార్టీ మారడం ఖాయం అయ్యింది. ఇప్పటికే చాలామంది నాని అనుచరులు, వైసీపీ కార్పొరేటర్లు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వాళ్లందరినీ ఆయనే పంపించారన్న ప్రచారం కూడా జరిగింది. అయితే తమను ముందుగా పంపించేసి.. ఇప్పుడాయన టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో పసుపు కండువా కప్పుకునేందుకునేందుకు రంగం సిద్ధమైంది.

రాజకీయాల్లో అటో, ఇటో.. ఏదో ఒక స్టాండ్‌ తీసుకోవాలి. కుదిరితే అధికారపక్షం.. లేదంటే విపక్షం అన్నట్టుగా వ్యవహరించాలి. కానీ, ఎటూ కాకుండా… న్యూట్రల్‌గానో, సైలెంట్‌గానో ఉంటే కష్టం. అదే విషయాన్ని లేట్‌గా గుర్తించిన ఆళ్లనాని.. సైలెన్స్‌ను బ్రేక్‌ చేయాలని డిసైడ్‌ అయినట్టు తెలుస్తోంది. కీలక అనుచరులతో మీటింగ్ పెట్టుకుని గట్టి నిర్ణయం తీసుకున్నారు.

ఏలూరు అసెంబ్లీ నుంచి 4సార్లు ఎమ్మెల్యేగా గెలిచి.. మంత్రిగా,ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆళ్లనాని.. రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పారు. అయితే, వైసీపీకి రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది. రాష్ట్రంలో ఇతర వైసీపీ మాజీలు.. ఇప్పటికే పవన్‌తో కలిసి జనసేనలో చేరిపోయారు. అనంతరం అనుచరులతో సమావేశమై వారి అభిప్రాయాల మేరకు టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఏలూరు కార్పొరేషన్‌లో పార్టీమారగా మిగిలిపోయిన మిగితా వైసీపీ కార్పొరేటర్లతో కలిసి టీడీపీలో నాని సిద్ధమైనట్టు తెలుస్తోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..