Tiger Cubs : ఆపరేషన్ ఫెయిల్.. దొరకని తల్లి జాడ.. తిరుపతి ‘జూ’కు పులి కూనలు

తల్లి పులి కోసం అటవీశాఖ అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఎలాగైనా ఆ పులిని కనిపెట్టి తన పిల్లలను అప్పజెప్పాలని చాలా ప్రయత్నించారు.

Tiger Cubs : ఆపరేషన్ ఫెయిల్.. దొరకని తల్లి జాడ.. తిరుపతి జూకు పులి కూనలు
Tiger Cubs

Updated on: Mar 10, 2023 | 6:01 AM

ఆహరం కోసం దారి తప్పి జనావాసంలోకి వచ్చాయి నాలుగు పులి కూనలు. తల్లి జాడ తెలియక తల్లడిల్లిపోయిన ఆ పులి పిల్లలను స్థానికులు గుర్తించారు. గత నాలుగు రోజులుగా తల్లి ప్రేమ కోసం ఆ పిల్లలు విలవిలలాడున్నాయి. అయితే తల్లి పిల్లలను కలిపేందుకు ఫారెస్ట్ సిబ్బందికి ఇదో బిగ్‌ టాస్క్‌గా మారిపోయింది. ఒక వేళ తల్లి దగ్గరకు పిల్లలను చేర్చినా మనిషి తాకిన పిల్లలను తల్లిపులి చేరదీస్తుందా అన్న అనుమానం.

ఈ క్రమంలోనే తల్లి పులి కోసం అటవీశాఖ అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఎలాగైనా ఆ పులిని కనిపెట్టి తన పిల్లలను అప్పజెప్పాలని చాలా ప్రయత్నించారు. మదర్ టైగర్ ఆపరేషన్ T108ని నిర్వహించారు. ముసలిమడుగు ప్రాంతాల్లో తల్లి పులి కోసం వేచిచూశారు ఫారెస్ట్ అధికారులు. ఎంతకూ తల్లి జాడ దొరక్క పోయేసరికి ఆ నాలుగు పులి పిల్లలను తిరుపతి జూ కు తరలించారు అధికారులు.

ఆత్మకూరు డీఎఫ్‌ఓ కార్యాలయంలో పులికూనలను సంరక్షించారు. ఓ గదిలో వాటిని ఉంచి.. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి మానిటరింగ్ చేశారు ఫారెస్ట్ అధికారులు. పులికూనల ఆరోగ్య పరిస్థితిపై అనుమానాలు వస్తుండటంతో తొలిసారి సీసీ కెమెరాలు ఫుటేజ్ కూడా రిలీజ్ చేశారు ఫారెస్ట్ అధికారులు.

పులి పిల్లలకు పాలు, ఉడకబెట్టిన లివర్‌ను ఆహారంగా ఇచ్చారు అటవీశాఖ అధికారులు. కేవలం ఆహారం అందించేందుకే పులి కూనల గదిలోకి సిబ్బందిని అనుమతించారు. పులి కూనలను ముట్టుకోకుండా ఉండేందుకు, పర్యవేక్షించేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.