నాలుగు రోజులు గడిచిపోయింది. ఇంకా వరద ముంపులోనే ఉంది విజయవాడ. బుడమేరు, కృష్ణా వరద సగానికి సగం విజయవాడ నగరాన్ని ముంచెత్తింది. బుడమేరు పరిసర ప్రాంతాల్లోని కాలనీలన్ని నీటమునిగాయి. వరద ఉధృతి తగ్గినా సింగ్‌నగర్ ముంపులోనే ఉంది. సింగ్‌నగర్‌లో ఎటు చూసినా మోకాళ్ళ లోతు వరద నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. నాలుగు రోజులుగా వేలాది మంది ప్రజలు జలదిగ్బంధంలో ఉన్నారు. వేలాది మంది తాత్కాలిక పునరావాస కేంద్రాల్లోనే తలదాచుకుంటున్నారు. విజయవాడకు వరద మిగిల్చిన విషాదం నుంచి పూర్తిగా కోలుకోకుండానే.. మళ్లీ పిడుగులాంటి వార్త చెప్పింది వాతావరణశాఖ. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడుతుందని.. దీని ప్రభావంతో కృష్ణా, గుంటూరు, గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.
భారీ వరదలతో విజయవాడ కన్నీటి సంద్రమైంది. అంతులేని విషాదాన్ని మిగిల్చింది. వరద తగ్గుముఖం పడుతున్నా కొద్దీ… చనిపోయివారి సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు 29 మంది వరదల్లో చనిపోయినట్లు అధికారులు ఇప్పటికే ప్రకటించారు. దాదాపు 22 మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వస్పత్రికి తరలించారు. దీంతో ప్రభుత్వాస్పత్రి దగ్గర విషాదచాయలు అలుముకున్నాయి. మృతదేహాలను చూసి కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఆస్పత్రి ప్రాంగణంలో ఎటు చూసినా కన్నీటి దృశ్యాలే కనిపిస్తున్నాయి.
విజయవాడలో వరద బాధితుల కోసం గత మూడు రోజులుగా సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. డ్రోన్లు,హెలికాప్టర్ల ద్వారా ఆహారం, తాగునీరు పంపిణీ చేస్తున్నారు. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు ఆహార పంపిణీ చేపడుతున్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో సరఫరా చేస్తున్న ఆహార ప్యాకెట్ల పంపిణీని మంత్రి కొల్లు రవీంద్ర, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని పరిశీలించారు. మొత్తం 8 లక్షల ఆహార ప్యాకెట్లు, ఆరు లక్షల నీటి బాటిళ్లు సిద్ధం చేశామని కొల్లు రవీంద్ర తెలిపారు. బాధితులకు ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పారు. కష్టాల్లో ఉన్న విజయవాడకు ఏపీ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆపన్నహస్తం అందిస్తున్నారు. విజయవాడ క్యాంపు కార్యాలయంలో ఆయన ఆహారపొట్లాలు సిద్ధం చేసి బాధితుల కోసం తరలించారు. వర్షం పడుతున్నా.. దగ్గరుండి ఆహార పొట్లాలు సిద్ధం చేయించారు మంత్రి. బాధితులెవరు ఇబ్బంది పడకూడదనే ఆలోచనతోనే ఈ పని చేశామని మంత్రి తెలిపారు.
చురుగ్గా ఎన్డీఆర్ఎఫ్ సహాయ చర్యలు..
గత కొన్ని దశాబ్ధాల కాలంలో మునుపెన్నడూ లేని రీతిలో పోటెత్తిన వరదల్లో సర్వం కోల్పోయిన పేదలు దీనావస్థలో ఉన్నారు. బెజవాడలోని కొన్ని కాలనీల్లోకి వెళ్లడానికి ఇంకా బోట్లే ఆధారంగా ఉన్నాయి. వరద వల్ల ఇల్లు కదల్లేక 4 రోజులుగా నరకం చూసిన గర్భిణులు, వృద్ధులు, పిల్లల్ని పునరావాసాలకు తరలించారు. బోట్ల సాయంతో NDRF టీమ్‌లు సహాయ చర్యల్లో చురుగ్గా పాల్గొంటున్నాయి స్వచ్ఛంద సంస్థలు. పాలు, బిస్కెట్లు, వాటర్ బాటిళ్లు, మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేస్తున్నారు. ఉదయం అల్పాహారం, పులిహోర ప్యాకెట్లు అందించి సాయం చేస్తున్నారు. ఫుడ్ ట్రక్స్ దగ్గర ఇప్పటికీ క్యూలు కనిపిస్తునాయి.
నాలుగు రోజులుగా వరద గుప్పిట్లో చిక్కుకొని విలవిలలాడిన విజయవాడలోని కొన్ని పలు ప్రాంతాల్లో వరద ఉధృతి తగ్గడంతో స్థానికులు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. గుణదలలో నిన్నటితో పొలిస్తే ఒక అడుగు మేర వరద నీరు తగ్గిందని అధికారులు తెలిపారు. ప్రకాశం బ్యారేజ్ దగ్గర వరద ఉధృతి క్రమంగా తగ్గుతుంది. బ్యారేజ్ దగ్గర ఇన్ ఫ్లో 4లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా… దాదాపు అదే స్థాయిలో నీటిని కిందికి వదులుతున్నారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ దగ్గర మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
తగ్గని బుడమేరు ఉధృతి..
అటు కృష్ణాజిల్లా నందివాడ పుట్టగుంట వద్ద బుడమేరు ఉధృతి తగ్గలేదు. ఎగువ నుండి వస్తున్న వరద నీటితో ప్రమాద స్థాయిలో నీటి ప్రవాహం ఉంది. ముంపు బారిన పడ్డ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బలహీనంగా ఉన్న బుడమేరు పరివాహక గట్లకు గండి పడకుండా… మట్టి కట్టలు వేస్తున్నారు ప్రజలు. అరిపిరాల, చిన్నలింగాల, పెదలింగాల, చేదుర్తిపాడు గ్రామాల్లోకి వరద నీరు చేరింది. ముంపు బాధితులకు ఆహారంతో పాటు దుస్తులు, దుప్పట్లను పంపిణీ చేస్తున్న అధికార యంత్రాంగం… కాలనీలను క్లీన్ చేసే పనులను వేగవంతం చేసింది. వరదల కారణంగా పేరుకుపోయిన చెత్తను పారిశుద్య కార్మికులు తొలగిస్తున్నారు.
పారిశుధ్యంపై ఫోకస్..
విజయవాడలో వరద కాస్త తగ్గడంతో పారిశుధ్యంపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. యుద్ధప్రాతిపదికన క్లీనిక్ పనులను చేపట్టింది. ఒక్కో సచివాలయం చొప్పున మొత్తం 63 మంది ప్రత్యేక అధికారులను నియమించి పనుల్లో వేగం పెంచింది. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల నుంచి అధికారులతో పాటు కార్మికులను విజయవాడకు రప్పించింది. ఫైరింజన్లతో రోడ్లను శుభ్రం చేయిస్తోంది. ప్రొక్లెయిన్లు, టిప్పర్లతో వేస్టేజ్‌ను తొలగిస్తున్నారు కార్మికులు. మరోవైపు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక చర్యలు చేపట్టింది ప్రభుత్వం. క్లోరినేటెడ్ మంచినీటి సరఫరాకు ప్రయత్నాలు చేస్తోంది.
సీఎం చంద్రబాబు సమీక్ష
వరద పరిస్థితులపై నిరంతరం సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష చేస్తున్నారు. మరోసారి ముంపు ప్రాంతాలను ఆయన పరిశీలించారు. మళ్లీ బుడమేరు ముంచెత్తకుండా వాటర్ డైవర్షన్‌కి యాక్షన్‌ప్లాన్ రెడీ చేశారు. బాపట్ల, రేపల్లె, లంక గ్రామాల్లో ఏరియల్ సర్వేకు వర్షం ఆటంకంగా మారింది. దీంతో చంద్రబాబు పర్యటన వాయిదా పడింది. అయితే వరద నీటిని లెక్క చేయకుండా ఆయన ముంపు బాధితులను నేరుగా వెళ్లి పరామర్శించారు.
వరద ముంపు ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు
VIDEO | Andhra Pradesh CM N Chandrababu Naidu (@ncbn) visited flood-affected areas and interacted with locals in Vijayawada earlier today.
(Full video available on PTI Videos – https://t.co/n147TvqRQz) pic.twitter.com/gBQZR9e75e
— Press Trust of India (@PTI_News) September 4, 2024
వెంటాడుతోన్న అల్పపీడన గండం..
నాలుగు రోజులుగా విజయవాడలోని చాలా ప్రాంతాల్లో వరద నీటిలో ఉన్నాయి. ఇంతులోనే మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశముందన్న వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికలు..బాధితులకు, అధికార యంత్రాంగానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. బంగాళాఖాతంలో గురువారం (సెప్టెంబర్ 5) మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. దీని ప్రభావంతో ఏపీలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. మధ్యాహ్నం 3 తర్వాత కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రలో ఓ గంటపాటూ భారీ వర్షాలు కురుస్తాయి. ఆ తర్వాత కూడా మోస్తరుగా కురుస్తాయి. రాయలసీమలో పొడి వాతావరణం ఉంటోంది. అరేబియా సముద్రంలో గాలి వేగం గంటకు 30 కిలోమీటర్లుగా ఉండగా…ఏపీలో 15 నుంచి 25 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. అల్పపీడనం బలహీనపడే అవకాశమున్నా.. వర్షాలు కురవొచ్చన్న అంచనాలతో విజయవాడ ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
కనిపించని వాహనాలు..
విజయవాడలో వందల సంఖ్యలో కార్లు, వేల బైక్‌లు, ఆటోలు.. గత నాలుగు రోజులుగా ముంపులోనే ఉండిపోయాయి. విజయవాడ సింగ్‌నగర్‌లో వరద తగ్గడంతో అవన్నీ ఇప్పుడు బురదలో దర్శనమిస్తున్నాయి. కలర్ పోయి, డోర్లు, టైర్లు డ్యామేజ్ అయి కనిపిస్తున్నాయి. బురదలో కూరుకుపోయిన వాహనాలు పనికొస్తాయా అన్న సందేహం ఓ వైపు అయితే.. రిపేర్లకి అయ్యే ఖర్చు తడిసి మోపెడు కావడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు మా వాహనాలు ఎక్కడ? అని వెతుక్కునే పనిలోపడ్డారు చాలామంది. ఎక్కడ వాహనం పార్క్ చేశారో.. వరద ఎటువైపు వెళ్లిందో.. ఆ పరిసర ప్రాంతాల్లో సెర్చ్ చేస్తున్నారు. బుడమేరు దెబ్బకి విజయవాడలో లక్షకు పైగా బైక్‌లు.. 30వేల కార్లు.. 5 వేల వరకు ఆటోలు నీట మునిగాయని అంచనా. అవేవీ పనిచేసే పరిస్థితి లేదు. వరద ప్రవాహానికి కొట్టుకుపోయిన వాహనాల రూపు రేఖలు మారిపోయాయి. వరదలో కొట్టుకుపోయి.. నీళ్లలో నానిన వాహనాలు చాలా వరకు డ్యామేజ్ అయ్యాయి. వాహానాలు ఏ స్థాయిలో దెబ్బతిన్నాయో క్లియర్‌గా తెలుస్తోంది.
మరిన్ని ప్రీమియం కథనాల కోసం.. TV9 News యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి