
సంక్రాంతి పండుగ అంటే సంబరం.. గాలి పటాలు ఎగరవేయడం కూడా పండుగలో భాగం. కానీ ఆ ఆనందం వెనుక ఎన్నోసార్లు చెప్పుకోలేని విషాదం కూడా దాగి ఉంటుంది. చిన్నపాటి నిర్లక్ష్యం, క్షణం అప్రమత్తత లోపం ప్రాణాలకే ప్రమాదంగా మారుతుంది. అలాంటి హృదయ విదారక ఘటన ఒకటి ఇప్పుడు చోటుచేసుకుంది. గాలిపటం ఎగరవేసే ఆనందంలో ఉన్న ఐదేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలోని గాలివీడు మండలం గోరం చెరువు గ్రామం, బుచ్చవాండ్లపల్లిలో ఈ విషాదం జరిగింది. ఐదేళ్ల ఆనంద శ్రీనివాస్ అనే బాలుడు ఇంటి మీద గాలిపటం ఎగరవేస్తుండగా, అక్కడున్న విద్యుత్ తీగలను గమనించకపోవడంతో అవి తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. సంక్రాంతి సెలవులు రావడంతో అమ్మమ్మ ఇంట్లో ఆనందంగా గడపాల్సిన ఆ చిన్నారి, అనంత లోకాలకు చేరుకున్నాడు. ఈ ఘటనతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఇంటి పైభాగంలో ప్రమాదకరంగా ఉన్న కరెంటు తీగలు, వాటికి సమీపంలో గాలిపటం ఎగరవేయడం ఈ ప్రమాదానికి కారణమైంది. చిన్నారి అమాయకత్వం, క్షణం నిర్లక్ష్యం కలిసి ప్రాణాంతకంగా మారింది.
కొద్ది రోజుల్లో సంక్రాంతి పండుగ రానుంది. ఈ సందర్భంగా పిల్లలు, పెద్దలు గాలిపటాలు ఎగరవేసే సమయంలో పరిసరాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా విద్యుత్ తీగల సమీపంలో గాలిపటం ఎగరవేయకూడదు. అలాగే చైనా మాంజా తాడును పూర్తిగా నివారించి, సాధారణ కాటన్ తాడును మాత్రమే వినియోగించాలి. లేదంటే ఆ సంబరం క్షణాల్లోనే విషాదంగా మారే ప్రమాదం ఉంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..