ఉద్యోగం పేరుతో జార్ఖండ్ నుంచి బావను పిలిపించారు.. ఏపీలో దారుణ హత్య.. కారణం ఇదే!
అక్కను వేధిస్తున్నాడనే కక్షతో జార్ఖండ్‌కు చెందిన వ్యక్తిని ఉద్యోగం ఇప్పిస్తామని శ్రీ సత్యసాయి జిల్లాకు పిలిపించిన ఐదుగురు బావమరుదులు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి బండరాళ్లతో దారుణంగా హత్య చేశారు. అనుమానాస్పద మృతి కేసును ఛేదించిన పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు.

బావమరుదులు బావ బతుకు కోరతారు అంటారు.. కానీ, అక్కను వేధిస్తున్న బావను బావమరుదులే కొట్టి అతి దారుణంగా హత్య చేశారు. అది కూడా ఎక్కడో జార్ఖండ్ రాష్ట్రంలో ఉన్న బావను సత్యసాయి జిల్లాకు పిలిపించి.. ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి హత్య చేశారు. శ్రీ సత్య సాయి జిల్లా తనకల్లు మండలం పడమటి వారి పల్లి సమీపంలో అనుమానాస్పద మృతి కేసును.. పోలీసులు హత్య కేసుగా తేల్చారు.
బావమరుదులే అసలు హంతకులు..
ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించిన ఐదుగురు బావమరుదులు… బావను అతి దారుణంగా హత్య చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లు మండలం పడమటివారిపల్లిలో కొన్ని రోజుల క్రితం కలకలం రేపిన కుళ్ళిపోయిన మృతదేహం కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. పడమటివారిపల్లి సమీపంలో లభించిన ఆ మృతదేహం వెనుక ఉన్న బావమరుదుల మర్డర్ స్కెచ్ కోణాన్ని పోలీసులు బయటపెట్టారు. అనుమానాస్పద మృతిగా మొదలైన కేసు విచారణలో… అది పక్కా పథకం ప్రకారం జరిగిన దారుణ హత్యగా తేలింది. పోలీసుల కథనం ప్రకారం.. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన మంత్రాజ్ తథేరా అనే వ్యక్తి తన భార్య సుమిత్రా సితారని నిత్యం వేధించేవాడు. బావ వేధింపులు తాళలేక నరకం చూస్తున్న అక్కను కాపాడుకోవడానికి ఆమె సొంత తమ్ముళ్లు ఐదుగురు అత్యంత ఘోరమైన ప్లాన్ వేశారు.
బావను వదిలించుకోవడానికి స్కెచ్ వేసిన ఆ ఐదుగురు బావమరుదులు… తనకల్లు మండలం చీకటిమానుపల్లి సమీపంలో ఉన్న ‘ఆత్మిక పేపర్ మిల్లు’లో మంచి ఉద్యోగం ఇప్పిస్తామని బావకు నమ్మబలికారు. అక్కడి నుంచి పక్కా ప్లాన్ ప్రకారం జార్ఖండ్ నుంచి బావను కదిరి రప్పించారు. అనంతరం పడమటివారిపల్లి సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి మద్యం తాగించి బండరాళ్లతో కొట్టి బావను దారుణంగా హత్య చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు సాంకేతిక, శాస్త్రీయ ఆధారాలతో రంగంలోకి దిగారు. హత్య జరగడానికి ముందు జార్ఖండ్‌కు చెందిన ఐదుగురు యువకులు చీకటిమానుపల్లిలో ఉన్న ఆత్మిక పేపర్ మిల్లులో పని చేస్తున్నారని.. హత్య అనంతరం ఆ ఐదుగురు యువకులు అదృశ్యం అవ్వడంతో…. పేపర్ మిల్ యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆ దిశగా పోలీసులు విచారణ చేపట్టగా.. బావ హత్య చేసిన బావమరుదులు మర్డర్ ప్లాన్ బయటపడింది.
డీఎస్పీ శివనారాయణస్వామి పర్యవేక్షణలో వేగంగా దర్యాప్తు చేపట్టి.. జార్ఖండ్‌కు చెందిన ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి రూ. 500 నగదుతో పాటు, హత్యకు ఉపయోగించిన రక్తపు మరకలు ఉన్న దుస్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్కను బావ మంత్రాజ్ వేధింపులకు గురి చేస్తుండడంతో… కక్ష పెంచుకున్న బావమరుదులు.. బావను అంతమొందించిన సంఘటన సంచలనం రేపింది. ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
