Vijayawada: “సముద్రంలో చేపలు పట్టేటోళ్లేనా మనుషులు.. నదిలో పట్టే మేం కాదా”

సముద్రంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులకు ప్రభుత్వం ఎంతోకంత చేయూతనందిస్తుంది. వేట ఆగితే నగదు, వేట జరిగితే వలలు – పడవలకు సబ్సిడీలు ఇస్తుంది. కానీ నదిలో చేపలు పట్టే మత్స్యకారుల ఇవేమీ అందవు. సముద్రంలో పట్టేవి చేపలే, నదిలో పట్టేవి కూడా చేపల గత రెండున్నర నెలలుగా కృష్ణానదిలో చేపల వేట లేక ఆకలి కేకలు పెడుతున్నారు స్థానిక మత్స్యకారులు.  ప్రభుత్వం సాయం చేయాలని కోరుతున్నారు. 

Vijayawada: సముద్రంలో చేపలు పట్టేటోళ్లేనా మనుషులు.. నదిలో పట్టే మేం కాదా
Fishing

Edited By: Ram Naramaneni

Updated on: Oct 30, 2025 | 2:58 PM

విజయవాడకు సమీపంలోని ఇబ్రహీంపట్నంలో ఫెర్రీ ఘాట్ ఉంటుంది. అక్కడి నదీప్రాంతంపై ఆధారపడి చాలామంది మత్యకారులు జీవనం సాగిస్తారు. దాదాపు 450 కుటుంబాలకు చేపల వృత్తే జీవనాధారం. కానీ గత రెండున్నర నెలలుగా వీరి బాధలు చెప్పలేనివి… ఇప్పటివరకు ఏడుసార్లు వరదలు రావడంతో చేపల వేట నిషేధించారు అధికారులు. జూలై–ఆగస్టు గుడ్లు పెట్టే కాలం, తర్వాత వరదలతో వేట పూర్తిగా ఆగిపోయింది. ప్రస్తుతం ఎగువనుంచి 6లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తుంది.. వల వేస్తే చేపలు చిక్కడం లేదు.  వలలు మొక్కలకు చిక్కి తెగిపోతుండడంతో అప్పులు పెరుగుతున్నాయి.

మరోవైపు ఇంకో సమస్య – నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్… ఇక్కడ నుంచి వచ్చే వేడి నీరు పవిత్ర సంగమం వద్ద నదిలో కలుస్తుంది.
దీంతో మూడు కిలోమీటర్ల మేర వేడి నీరు ఉండడంతో చేపలు చనిపోతున్నాయి. వాటిని తినడానికి కూడా పనికిరావు. పరిహారం కింద ప్రతి సంవత్సరం రూ. 20 లక్షలు ఇవ్వాలని ఒప్పందం చేసుకున్నా ఇప్పటివరకు ఆ మొత్తం అందలేదన్నది మత్స్యకారుల ఆరోపణ. వేడి నీటి కారణంగా సంగమం పరిసరాల్లో చేపలు కనిపించడం లేదు. మత్స్యకారులు గుంటుపల్లి నుంచి ప్రకాశం బ్యారేజ్ వైపు వెళ్లాల్సి వస్తోంది..

ఫెర్రీ ఘాట్ వద్ద నదిలోకి వెళ్లి చేపలు తెస్తారని ఎదురు చూసే కొనుగోలుదారులు కూడా నిరాశే ఎదురవుతుంది. రోజుకు 60 పడవలు వేటకు వెళ్ళేవి.  ఇప్పుడు 10 మాత్రమే వెళ్తున్నాయి. వల వేస్తే రాగంటి, బొచ్చలు తప్ప ఏవీ చిక్కడం లేదు.  గత మూడు నెలలుగా వరదలు, ప్రభుత్వ ఆంక్షలతో మత్స్యకారుల వ్యాపారాలు స్తంభించిపోయాయి.

చేపల వేట ఆగిపోవడంతో మహిళలు, పిల్లలు కూడా ఇళ్లకే పరిమితమయ్యారు. భర్తతో కలిసి వేటకు వెళ్లి జీవనం సాగించేవాళ్లు ఇప్పుడు ఆకలితో అల్లాడుతున్నారు. ప్రభుత్వం ఇచ్చే 10 కిలోల బియ్యంతోనే పొట్ట నింపుకుంటున్నామని చెబుతున్నారు. పిల్లల ఫీజులు కట్టలేక, అప్పులు తీర్చలేక నరకం అనుభవిస్తున్నారు. ప్రభుత్వం తమను కూడా ఆదుకోవాలని వేడుకుంటున్నారు.

గత రెండున్నర నెలలుగా నదిలో చేపల వేట లేక ఇబ్రహీంపట్నం మత్స్యకారులు అల్లాడిపోతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ఎవ్వరూ పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నదిలో చేపలు పట్టేవారికి కూడా సబ్సిడీ, లోన్లు ఇవ్వాలని కోరుతున్నారు. చూడాలి, ప్రభుత్వం వీరి కేకలు ఎప్పటికైనా వింటుందేమో.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.