ఆయ్‌.. గోదారోళ్ల కొత్తల్లుడికి 500 వంటకాలతో విందండీ!

| Edited By: Srilakshmi C

Jan 13, 2025 | 7:06 PM

వెటకారానికేకాదు.. మర్యాదలకూ గోదారోళ్లు మాసెట్ట మంచోళ్లండీ బాబూ.. ఒక్కసారి ఆతిథ్యమిచ్చారంటే జన్మలో మర్చిపోలేదురు. ఇక సంక్రాంతికి కొత్త అల్లుళ్లు ఇంటికొస్తే హడావిడి మామూలుగా ఉండదుగా. ఇక ఈ ఇంటి అత్తామమాలైతే కొత్త అల్లుడికి ఏకంగా 500 రకాల వంటకాలు రుచి చూసించి మురిసిపోయారు..

యానాం, జనవరి 13: యానాం లో కొత్తగా పెళ్లయిన చిన్న అల్లుడుడికి 500 వందల రకాల ఐటమ్స్‌తో అదిరిపోయే విందు ఏర్పాటు చేసారు ఆ మావా, అత్త. వివరాల్లోకెళ్తే.. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో పండగలంటే చేసే హడావిడి అంతాఇంతా కాదు. ఇంటికొచ్చిన చుట్టాలను మర్యాదలతో కట్టిపడేయటం గోదావరి జిల్లా వాసుల ప్రత్యేకత. కేంద్ర పాలిత ప్రాంతమైన యానాం వర్తక సంఘం గౌరవ అధ్యక్షుడు సత్యభాస్కర్ వెంకటేశ్వరి దంపతుల రెండవ కుమార్తె హరిణ్యకు విజయవాడకు చెందిన పారిశ్రామికవేత్త సాకేత్‌తో ఇటీవల వివాహం అయింది. కొత్తగా పెళ్లయి వచ్చిన చిన్నల్లుడిని సంక్రాంతి పండగకు ఆహ్వానించి 500 రకాలతో ప్రత్యేక విందును ఏర్పాటు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు అత్తా, మామలు. వివిధ రకాల శాకాహారం, పిండి వంటలు, స్వీట్లు, డ్రై ఫ్రూట్స్, పండ్లు ఇలా 500 వందల రకాలు కప్పులలో ఉంచి వాటిని అందంగా అలంకరించి.. అల్లుడు సాకేత్ కుమార్తె హరిణ్యకు ఇద్దరికి విందు ఏర్పాటు చేశారు. అత్తవారింట్లో ఏర్పాటు చేసిన విందుకు అల్లుడు సాకేత్ ఉబ్బితబిబ్బయ్యాడు. శాఖాహారంలో ఇన్ని రకాల వంటకాలు ఉంటాయని ఇప్పుడే తెలిసిందని అల్లుడు సాకేత్ తెగ మురిసిపోయాడు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.