నైరుతి రుతుపవనాల ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తోంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో పలుచోట్ల వర్షం కురుస్తోంది. తెలంగాణ, రాయలసీమ మీదుగా తమిళనాడు, కొమరిన్ ప్రాంతం వరకూ ఏర్పడిన రుతుపవనాల ప్రభావంతో తిరుపతి, తిరుమలలో భారీ వర్షం కురుస్తోంది.
ఆదివారం సాయంత్రం తిరుమలలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఇక అర్దరాత్రి నుంచి ఎడతెరపి లేకుండా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడటంతో రహదారులన్ని జలమయం అయ్యాయి. భారీ వర్షం కారణంగా తిరుమలలో శ్రీవారి ఆలయ పరిసరాలు, మాఢ వీధులు,లడ్డూ వితరణ కేంద్రాల్లో వర్షపు నీరు భారీగా చేరుకోవడంతో టీటీడీ సిబ్బంది వర్షపు నీటిని బయటకు పంపే ప్రయత్నం చేస్తున్నారు.
మరోవైపు తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో 41వ మలపు వద్ద భారీ వృక్షం నేలకూలింది. దీంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. చెట్టును తొలిగించేందుకు టీటీడీ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. మరోవైపు తిరుమల ఘట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడే అవకాశం ఉండడంతో.. మొదటి, రెండవ ఘాట్ రోడ్డులలో ప్రయాణించే ప్రయాణికులను టీటీడీ విజిలెన్స్ అప్రమత్తం చేస్తోంది.
శ్రీవారి దర్శనానికి వైకుంఠం కాంప్లెక్స్‌కు వెళ్లే భక్తులతో పాటు దర్శనం తర్వాత బయటకు వచ్చే భక్తులు వర్షం వల్ల ఇబ్బందులు పడ్డారు.