Fact Check: నకిలీ మద్యం కాదు.. అదే కారణం.. అన్నమయ్య జిల్లా యువకుల మృతి ఘటనలో అసలు నిజాలివే..

సరదా కోసం వేసిన పందెం.. సంక్రాంతి పండుగ పూట రెండు ఇళ్లను విషాదంలో ముంచేసింది. ఎవరు ఎక్కువ తాగుతారనే చిన్నపాటి పోటీ.. చివరకు ప్రాణాలు కోల్పోయేలా చేసింది. అన్నమయ్య జిల్లాలో జరిగిన ఈ దుర్ఘటనపై సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు షికారు చేస్తున్నాయి. అయితే నిజానికి అక్కడ జరిగింది నకిలీ మద్యం మరణాలు కాదు.. అతిగా మద్యం సేవించడం వల్ల జరిగిన ఘోరం.

Fact Check: నకిలీ మద్యం కాదు.. అదే కారణం.. అన్నమయ్య జిల్లా యువకుల మృతి ఘటనలో అసలు నిజాలివే..
Annamayya Youth Deaths

Updated on: Jan 19, 2026 | 11:52 AM

సంక్రాంతి వేడుకల్లో భాగంగా సరదాగా మొదలైన ఒక పందెం, రెండు నిండు ప్రాణాలను బలితీసుకుంది. అతిగా మద్యం సేవించడం వల్ల జరిగిన ఈ దుర్ఘటనపై సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాలను అధికారులు ఖండించారు. అసలు ఏం జరిగిందంటే.. పీలేరు నియోజకవర్గం కేవీ పల్లి మండలం బండవడ్డీపల్లిలో సంక్రాంతి పండుగ పూట ఒక విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఆరుగురు యువకులు కలిసి మద్యం పార్టీ చేసుకున్నారు. అయితే వీరిలో ఆవలకుంట మణికుమార్, వేముల పుష్పరాజ్ అనే ఇద్దరు యువకులు ఎవరు ఎక్కువ తాగుతారనే విషయంలో పందెం వేసుకున్నారు.

మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు.. అంటే కేవలం నాలుగున్నర గంటల వ్యవధిలోనే వీరిద్దరూ ఏకంగా 19 బీర్లను తాగేశారు. అంత తక్కువ సమయంలో భారీ స్థాయిలో ఆల్కహాల్ శరీరంలోకి చేరడంతో వారు తీవ్రమైన డీహైడ్రేషన్‌కు గురయ్యారు. పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి తరలిస్తుండగా మణికుమార్ మరణించగా, చికిత్స పొందుతూ పుష్పరాజ్ ప్రాణాలు కోల్పోయాడు. వీరితో పాటు పార్టీలో పాల్గొన్న ఆవలకుంట శ్రవణ్ కుమార్, పసుపులేటి శివమణి, ఆవలకుంట వేణుగోపాల్, కోటకొండ అభిషేక్ అనే మరో నలుగురు యువకులు బీరు తక్కువగా తాగడంతో వారు క్షేమంగానే ఉన్నారు. కేవలం అతిగా తాగిన ఇద్దరు మాత్రమే మృతి చెందడం, మిగిలిన వారు ఆరోగ్యంగా ఉండటం గమనించదగ్గ విషయం.

తప్పుడు ప్రచారాలను నమ్మకండి

ఈ మరణాలపై సోషల్ మీడియాలో నకిలీ మద్యం వల్ల చనిపోయారని వస్తున్న వార్తల్లో నిజం లేదని ప్రాథమిక విచారణలో తేలింది. డీహైడ్రేషన్, ఆల్కహాల్ ఓవర్ డోస్ వల్లనే ఈ మరణాలు సంభవించినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేసేందుకు వారు తాగిన బీరు శాంపుళ్లను చిత్తూరులోని ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపించారు.