మనుషుల మధ్య వైషమ్యాలు పెరిగిపోయాయి. చిన్న, చిన్న కారణాలకే మితిమీరిన కోపం వచ్చేస్తుంది. క్షణికావేశం కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తుంది. బంధాలను, బంధుత్వాలు కూడా కనుమరుగు అవుతున్నాయి. ఆస్తి కోసం హత్యలు జరగడం నిత్యం వార్తల్లో చూస్తూనే ఉన్నాం. ఆర్థిక వ్యవహారాల్లో తేడావస్తే.. ఆప్త మిత్రులను కూడా విడవడం లేదు. ఇక అక్రమ సంబంధాల వల్ల.. జరుగుతున్న క్రైమ్స్ అన్నీ, ఇన్నీ కావు. రోజూ ఇలాంటి ఘటనలు దేశవ్యాప్తంగా అనేకం వెలుగులోకి వస్తున్నాయి. లేనిపోని మోహాల్లో పడి కొందరు బిడ్డల జీవితాలతో పాటు తమ జీవితాలను కూడా నాశనం చేసుకుంటున్నారు. 2017-2019 మధ్య మూడేళ్లలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 2,859 హత్యకేసులు నమోదయ్యాయి. వీటిలో 1,660 (58.60 శాతం) ఘటనలకు వివాదాలు, అక్రమ సంబంధాలే కారణమని తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. మరో దౌర్భాగ్యకరమైన విషయం ఏంటంటే.. బాధితులుగా మారుతున్న వారిలో ఎక్కువ మంది 18-30 ఏళ్ల వారే.
2017-19 మధ్య వివాదాల వల్ల 1,139 మంది హత్యలకు గురయ్యారు. నగదు లావాదేవీల్లో తలెత్తిన విభేదాలు, కుటుంబ తగాదాలు, భూ వివాదాలు, చిన్నచిన్న గొడవల్లో ప్రత్యర్థులు వారిని హతమార్చారని రిపోర్ట్ చెబుతోంది. వీరిలో 492 మంది (43.19 శాతం) కుటుంబ వివాదాల వల్లే ప్రాణాలు పోగొట్టుకున్నారు. పలు ఘటనల్లో హతులు, హంతకులు ఒక ఫ్యామిలీకి చెందినవారే ఉంటున్నారు. ఆర్థిక పరమైన విబేదాల వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని పోలీసులు చెబుతున్న విషయం. ముఖ్యంగా అన్నదమ్ములు, ఒకే పేగు పంచుకు పుట్టిన వారి మధ్య ఇలాంటి విభేదాలు అధికమని నిపుణులు చెబుతున్నారు.
వివాహేతర సంబంధాల వల్ల మూడేళ్లలో 521 మంది హత్య గావించబడ్డారు. ఏటా ఈ ఒక్క కారణంతో సగటున 17-18 శాతం హత్యలు జరుగడం దిగ్భ్రాంతి కలిగించే అంశం. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భాగస్వామిని తొలగించుకోవాలనే ఉద్దేశంతో కొందరు, తమ దాంపత్య జీవితంలోకి ప్రవేశించి కుటుంబంలో కలహాలు రేపుతున్నారన్న కారణంతో మరికొందరు ఈ హత్యలకు పాల్పడుతున్నారు. భాగస్వాములకు వివాహేతర సంబంధాలు ఉన్నాయనే అనుమానంతోనూ హత్యలు జరుగుతున్నాయి. ఈ హత్యల్లో అంతమవుతున్న వారిలో ఎక్కువమంది 18-30 ఏళ్లకు చెందినవారే ఉంటున్నారని పోలీసులు చెబుతున్నారు.
మన కుటుంబ వ్యవస్థ రోజురోజుకు కలుషితం అవుతున్నది అన్నది ఈ నివేదికలు చెబుతున్న అంశం. మారాలి.. మార్పు రావాలి. కుటుంబ వ్యవస్థ, విలువల అంటే ప్రపంచం మొత్తం భారతదేశం వైపు చూస్తుంది. అందునా తెలుగు రాష్ట్రాల ఉమ్మడి కుటుంబాలు, అనుబంధాలకు మంచి పేరు ఉంది. భవిష్యత్ తరాలను ఆ వారసత్వం అందించకపోతే.. పరిస్థితులు మరింత దిగజారే ప్రమాదం ఉంది.
ALSO READ: భూమికి మనం ఏలియన్స్‌గా వచ్చామా..? మార్స్ మన సొంత ఊరా..?.. ఆసక్తికర వివరాలు మీ కోసం..
ALSO READ: ఎదురీత ముందు.. విధిరాత ఎంత..?.. కష్టాల దిగమింగి.. కన్నీళ్లను చెరిపేసి.. మెకానిక్‌గా మహిళ జీవనపోరాటం