
ప్రకాశం జిల్లా కంభం మండలం తురిమెళ్ళ గ్రామ చెరువులో విదేశీ పిచ్చుకలు సందడి చేస్తున్నాయి. మధ్య ఆసియా, సైబీరియా ప్రాంతాలలో అత్యధికంగా నివసించే స్టోన్ చాట్.. ఆసియా, యూరప్‌లో కనిపించే కామన్ రోస్ పించ్ పక్షులు స్థానికులను కనువిందు చేస్తున్నాయి. పిచ్చుక జాతికి చెందిన ఈ రెండు రకాల పక్షులు శీతాకాలంలో చలిని తట్టుకోలేకపోవడంతో పాటు సంతాన ఉత్పత్తి కొరకు దక్షిణ భారతదేశానికి అత్యధికంగా తరలివస్తాయని పక్షి ప్రేమికులు చెబుతున్నారు.
స్టోన్‌చాట్ పక్షి చిన్న పిచ్చుకలా కనిపిస్తుంది. వాస్తవానికి ఇది పాసెరిన్ పక్షి. దీన్ని “స్టోన్‌చాట్” అని పిలుస్తారు. ఇది రాళ్లను పగులగొట్టినట్లు శబ్దం చేస్తుంది. ఇది అరుపులకు చెవులు చిల్లులు పడాల్సిందే. దీనిని సాధారణంగా “స్టోన్‌చాట్” లేదా “కామన్ స్టోన్‌చాట్” అని పిలుస్తారు. ఇది ఎక్కువగా బహిరంగ ప్రదేశాలలో నివసిస్తుదంది. మగ పక్షులు నల్లటి తల, తెల్లటి మెడతో నారింజ – ఎరుపు రంగు శరీరంతో ఉంటాయి.
చూసేందుకు పిచ్చుకల్లా కనిపిస్తున్నా ఇవి విదేశీ పక్షులు. ప్రస్తుతం ఇవి ప్రకాశం జిల్లా తురిమెళ్ల గ్రామంలోని చెరువులు, పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్నాయి. సాధారణంగా చల్లటి ప్రాంతాలైన సైబీరియా, మధ్య ఆసియాలో ఉండే ఈ పక్షులు అక్కడి అతి శీతల వాతావరణంలో ఉండలేకపోవడంతో పాటు సంతానోత్పత్తి కోసం మన దేశానికి వస్తుంటాయి. అలా వచ్చిన వాటిలో కొన్ని ప్రకాశం జిల్లాకు చేరుకుని సందడి చేస్తున్నాయి. గడ్డి భూములు, సరస్సులు, చిత్తడి నేలలు, చెరువుల చుట్టూ ఇవి ఆవాసం ఏర్పరుచుకుని సంతానాన్ని వృద్ది చేసుకుంటాయి. పొలాల్లో ఉండే పురుగులు, కీటకాలు, చిన్న చిన్న పండ్లు తింటాయి.
అలాగే ఆసియా, యూరప్‌లో కనిపించే కామన్ రోస్ పించ్ పక్షులు కూడా ఇక్కడే సేదదీరుతున్నాయి. ముదురు గోధుమ, ఆలివ్ రంగులో ఈ పక్షులు ఆకర్షణీయంగా ఉంటాయి. చెట్ల పైభాగాల్లో ఉంటూ కోకిలలా పాటలు పాడుతాయి. ఇవి పాడుతుంటే మైమరచి పోవాల్సిందే. అందుకే దీనిని పాటపక్షిగా స్థానికులు పిలుస్తారు. ఇవి మన స్వదేశీ పిచ్చుకల్లా ఎక్కువగా గింజలు తింటాయి. స్వదేశీ పక్షుల తరహాలో కనిపిస్తున్న ఈ రెండు రకాల విదేశీ పక్షులు ఇప్పుడు తురిమెళ్ళ గ్రామంలో స్థానికులకు కనువిందు చేస్తున్నాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..