
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల సమయంలో ఈసీ ప్రత్యేక నిఘా ఉంచింది. సరిహద్దు ప్రాంతాల్లో 31 ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టులతో సహా మొత్తం 150 చెక్‌పోస్టులు ఏర్పాటు చేసింది. 35మొబైల్ బోర్డర్ పెట్రోలింగ్ పార్టీస్ ను అందుబాటులో ఉంచింది. వీటన్నింటితో పాటు 18 టెంపరరీ చెక్ పోస్ట్‌లను కూడా ఏర్పాటు చేసింది. ఇలా ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల్లో పట్టుబడ్డ నగదు, మద్యం వివరాలను ఈసీ తాజాగా వెల్లడించింది. గత 2019లో జరిగిన ఎన్నికల్లో పట్టుబడ్డ నగదు, మద్యం, మాదక ద్రవ్యాలు, లోహాలు విలువతో పాటుగా ఈ సారి 2024 సార్వత్రిక ఎన్నికల్లో జరిగిన అక్రమ రవాణా గురించి పూర్తి వివరాలను వెల్లడించింది. 2019లో ఏపిలో పట్టుబడ్డ నగదు రూ.41.80 కోట్లు కాగా 2024 లో పట్టుబడ్డ నగదు రూ.107.96 కోట్లుగా తెలిపింది. మొత్తం కలిపి 7,305 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు ప్రకటించింది. ఇక మద్యం విషయానికి వస్తే 2019 పట్టుబడ్డ అక్రమ మద్యం విలువ రూ.8.07 కోట్లుగా తెలిపింది. అదే 2024 లో పట్టుబడ్డ అక్రమ మద్యం విలువ రూ.58.70 కోట్లుగా చెప్పింది. ఈ సారి అదుపులోకి తీసుకున్న నిందితుల సంఖ్య గతంలో కంటే పెద్ద ఎత్తున పెరిగినట్లు తెలిపింది. మొత్తం 61,543 మంది అరెస్ట్ చేసినట్లు వెల్లడించింది.
2019 ఎన్నికల సమయంలో పట్టుబడిన నిషేధిత మాదక ద్రవ్యాల విలువ రూ. 5.04 కోట్లు కాగా 2024 ఎన్నికల్లో పట్టుబడిన నిషేధిత డ్రగ్స్ విలువ రూ. 35.61 కోట్లుగా తెలిపారు. ఈ వ్యవహారంలో మొత్తం 1730 మంది నిందితులను అరెస్టు చేసినట్లు ప్రకటించారు. ఇక 2019 ఎన్నికల సమయంలో స్వాధీనం చేసుకున్న విలువైన లోహాల విలువ రూ.27.17 కోట్లు కాగా.. 2024 ఎన్నికల్లో పట్టుబడిన విలువైన లోహాల విలువ రూ.123.62 కోట్లు అని చెప్పింది ఎన్నికల కమిషన్. ఈ అక్రమ వ్యవహారాల్లో పట్టుబడిన వారి సంఖ్య 42గా పేర్కొంది. 2019 ఎన్నికల సమయంలో స్వాధీనం చేసుకున్న ఉచితాలు/ఇతర వస్తువుల ద్రవ్య విలువ రూ.10.63 కోట్లు కాగా 2024 ఎన్నికల్లో పట్టుబడిన ఉచితాలు/ఇతర వస్తువుల విలువ రూ.16.98కోట్లుగా ప్రకటించింది. అక్రమంగా ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడిన మొత్తం 233 మందిని అరెస్టు చేసినట్లు వివరించింది. మొత్తం 3,466 వాహనాలను సీజ్ చేసినట్లు తెలిపారు అధికారులు. గత ఎన్నికలతో పోలిస్తే ఈ సారి ఎన్నికలు చాలా ఖర్చుతో కూడుకున్నట్లు చెప్పవచ్చు. ఈ మొత్తాన్ని చూసి ముక్కున వేలేసుకుంటున్నారు ప్రజలు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..