ఏపీపై ఫుల్ పోకస్ పెట్టింది రాష్ట్ర ఎన్నికల కమిషన్. పోలింగ్ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో కౌంటింగ్.. ఆతర్వాత జరిగే పరిణామాలపై ముందస్తుగా అలర్ట్ అయింది. విజయోత్సవాలు, ఊరేగింపులు, కవ్వింపులు లేకుండా స్పెషల్ యాక్షన్ చేపట్టింది. ఏపీలో పోలింగ్ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై ఎలక్షన్ కమిషన్ సిరీయస్ అయింది. దాడులను దృష్టిపెట్టుకుని ..ఈసీ అలర్ట్ అయింది. కౌంటింగ్, తదనంతరం జరిగే పరిణామాలపై ఈసీ ఫోకస్ పెంచింది. కౌంటింగ్ రోజు మాత్రమే కాకుండా ఆ తర్వాత 15 రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల అధికారికి సూచన చేసింది. రాష్ట్రానికి అదనంగా మరో 25 కంపెనీల కేంద్ర బలగాలను నియమించింది. ఇప్పటికే 20 కంపెనీల కేంద్ర బలగాలు రాష్ట్రానికి చేరుకున్నాయి. ఇవాళో రేపు మరో 5కంపెనీల కేంద్ర బలగాలు రాష్ట్రానికి రానున్నాయి. మరోవైపు ఈసీ కౌంటింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూంల దగ్గర మూడంచెల భద్రత ఏర్పాటు చేసింది. హింసాత్మక ఘటనల నేపథ్యంలో స్ట్రాంగ్ రూంల దగ్గర భద్రతను రెండెంచల నుంచి మూడంచెలకు పెంచింది.
మరోవైపు స్ట్రాంగ్ రూంలు, కౌంటింగ్ ఏర్పాట్ల పర్యవేక్షణను క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తున్నారు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేశ్‌కుమార్ మీనా. విశాఖపట్నం, శ్రీకాకుళంలో పర్యటించారు మీనా. జిల్లా కలెక్టర్, పోలీసు కమిషనర్ తో కలిసి ఏయూ పరిధిలోని స్ట్రాంగ్ రూమ్‌ల భద్రతను స్వయంగా పరిశీలించారు. విశాఖపట్టణం పార్లమెంటుతో పాటు, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన స్ట్రాంగ్ రూమ్‌లను తనిఖీ చేశారు. అక్కడ పరిస్థితులను గమనించారు. తలుపులకు వేసిన తాళాలను, వాటికున్న సీళ్లను సున్నితంగా పరిశీలించారు. అన్ని చోట్లా సీసీ కెమెరాలు ఉన్నాయా? అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారా? అనేక అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
తనిఖీ అనంతరం లాగ్ బుక్లో సంతకం చేశారు. మూడెంచల భద్రతను పాటించాలని, ఇక్కడి పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్‌కు సూచించారు. అనధికార వ్యక్తులను స్ట్రాంగ్ రూమ్‌లు ఉన్న ప్రాంతంలోకి ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించరాదని చెప్పారు. ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం అన్ని రకాల జాగ్రత్తలు వహించాలన్నారు. స్ట్రాంగ్ రూమ్‌ల దగ్గర పటిష్ట భద్రతా ప్రమాణాలు పాటించాలని అధికారులను ఆదేశించారు సీఈవో. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్త వహించాలని జిల్లా అధికారులకు సూచించారు. శ్రీకాకుళం శ్రీ శివానీ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఈవీఎంల స్ట్రాంగ్ రూంలను సీఈవో పరిశీలించారు.
శ్రీకాకుళం పార్లమెంటుతో పాటు, ఎనిమిది శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించిన స్ట్రాంగ్ రూమ్‌లతో పాటు కంట్రోల్ రూమ్‌లను క్షుణ్ణంగా పరిశీలించారు. అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు సీఈవో ముకేశ్‌కుమార్ మీనా. కౌంటింగ్ రోజు కోసం భారీగా ప్రిపేర్ అవుతోంది ఈసీ. ఆరోజు కోసం భారీగా కేంద్ర బలగాలను రాష్ట్రానికి రప్పించింది. పూర్తిగా కేంద్రబలగాల నిఘా నీడలో కౌంటింగ్ జరిగేలా ప్లాన్ చేసుకుంది. కౌంటింగ్ తర్వాత కూడా విజయోత్సవాలు, ఊరేగింపులు, కవ్వింపులు లేకుండా స్పెషల్ యాక్షన్ తీసుకుంటుంది. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు చేపడుతోంది ఈసీ.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…