Women Officers: ఎన్నికలను ఒంటిచేత్తో నడిపించిన మహిళా అధికారులు.. పనితీరుపై ప్రశంసలు
ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎక్కడో చోట, ఏదో ఒక వివాదం సంచలనంగా మారుతుంటే విజయనగరం జిల్లాలో మాత్రం మహిళ అధికారులు ఎన్నికలను సజావుగా నిర్వహించి అందరి మన్ననలు పొందుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అనేక జిల్లాల్లో ఎన్నికల నిభందనల ఉల్లంఘన పై ఐ ఏ ఎస్, ఐ పి ఎస్ స్థాయి అధికారుల పై సైతం ఎన్నికల కమీషన్ చర్యలు
ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎక్కడో చోట, ఏదో ఒక వివాదం సంచలనంగా మారుతుంటే విజయనగరం జిల్లాలో మాత్రం మహిళ అధికారులు ఎన్నికలను సజావుగా నిర్వహించి అందరి మన్ననలు పొందుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అనేక జిల్లాల్లో ఎన్నికల నిభందనల ఉల్లంఘన పై ఐ ఏ ఎస్, ఐ పి ఎస్ స్థాయి అధికారుల పై సైతం ఎన్నికల కమీషన్ చర్యలు తీసుకుంటుంది. దీంతో జిల్లా స్థాయి అధికారులు ఎంతో ఒత్తిడితో పనిచేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా అన్ని విభాగాల సమన్వయం, సహకారంతో విజయనగరం జిల్లాలోని మహిళ అధికారులు ఎన్నికలను సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారు. వారిలో ప్రధానంగా జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ గా ఉన్న జి.నాగలక్ష్మీ కీలకంగా ఉన్నారు.
2012 బ్యాచ్‌కి చెందిన నాగలక్ష్మి ఇప్పుడు జిల్లాలో ఎన్నికల విధులు నిర్వహిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలను సమర్ధవంతంగా నడిపించడానికి తనదైన శైలిలో జిల్లా యంత్రాంగాన్ని దూకుడుగా నడిపించారు. అంతేకాకుండా ఎన్నికల కోడ్ అమలు చేయడంలో ఆమె తీసుకున్న చర్యలు ఎన్నికల్లో కీలకంగా మారాయి. ఎన్నికలను సజావుగా జరిపి అనేక అవగాహన కార్యక్రమాలతో గత ఎన్నికల కన్నా ఈ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచి తనకంటూ ఓ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. జిల్లాలోని ఏడు అసెంబ్లీ, ఒక పార్లమెంటు స్థానంకు జరిగిన ఎన్నికల కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. జిల్లాలో ఉన్న మొత్తం 1847 పోలింగ్ స్టేషన్ల లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సమర్ధవంతంగా పనిచేశారు. ఇక ఇదే ఎన్నికల్లో జిల్లావ్యాప్తంగా శాంతిభద్రతలను సమర్థవంతంగా నడిపించిన మరో కీలక మహిళ అధికారి జిల్లా ఎస్పీ దీపిక మండవ.
ప్రస్తుత ఎన్నికల విధులను తనదైన శైలిలో నిర్వహిస్తున్నారు. దాదాపు మూడేళ్ల క్రితం జిల్లాకు వచ్చిన దీపిక వివాదాలకు దూరంగా ఉంటూ పోలీస్ యంత్రాంగాన్ని సమర్థవంతంగా నడిపించారు. ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల్లో తన సిబ్బందితో కలిసి ఎలాంటి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. పోలింగ్ రోజు అత్యంత కీలకంగా వ్యవహరించి ఎక్కడా ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. జిల్లాలో క్రిటికల్, హైపర్ క్రిటికల్ గ్రామాలను ముందుగానే గుర్తించి ఆయా గ్రామాల్లో ప్రత్యేక బలగాలు మోహరించి సమస్యాత్మక ఘటనలు జరగకుండా ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల్లో దీపిక పనితీరును అటు జిల్లావాసులతో పాటు ఇటు పోలీసు యంత్రాంగం సైతం ప్రశంసిస్తుంది. ఈ ఇద్దరి మహిళ అధికారుల ఆధ్వర్యంలో నడిచిన ఎన్నికల్లో మరో ఇద్దరు మహిళ అధికారులు కూడా కీలకంగా వ్యవహరించారు.
వారిలో జిల్లా రెవెన్యూ అధికారి అనిత ఒకరు. సీనియర్ డిప్యూటీ కలెక్టర్ అయిన అనిత జిల్లా రెవెన్యూ యంత్రాంగాన్ని ఎన్నికలకు సిద్ధం చేయడంలో కీలకంగా వ్యవహరించారు. జిల్లా ఎన్నికల అధికారి ఆదేశాలతో ఎన్నికల సంఘం నిబంధనల మేరకు తనదైన పనితీరును కనబరిచారు. జరుగుతున్న ఎన్నికల్లో పోలింగ్ రోజు ఈమె క్రియాశీలంగా వ్యవహరించి ఓ ప్రత్యేకతను చాటుకున్నారు. అదేవిధంగా ఎన్నికల నిర్వహణలో మరో మహిళ అధికారి జిల్లా అడిషనల్ ఎస్పీ అస్మా ఫర్హీన్. ఈమె జిల్లా ఎస్పీకి తన సహాయ సహకారాలు అందిస్తూనే జిల్లా పోలీస్ అడ్మినిస్ట్రేషన్ విభాగాన్ని సజావుగా నడిపిస్తున్నారు. జరిగిన ఎన్నికల్లో శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా కీలకంగా వ్యవహరించి అందరి మన్ననలు పొందారు. ఇలా ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో నలుగురు మహిళ అధికారులు జిల్లా ఎన్నికలను ఒంటి చేత్తో నడిపించి ఔరా అనిపించుకున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి