Voter List: ఏపీలో ఓటర్ల లిస్ట్ పంచాయతీకి చెక్ పడుతుందా.? ఈసీకి అధికార, ప్రతిపక్షాల ఫిర్యాదులు
ఆంధ్రప్రదేశ్ గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఓట్ల పంచాయతీ నడుస్తోంది. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలు నకిలీఓట్లపై ఎన్నికల కమిషన్‌కు వరుసగా ఫిర్యాదులు చేస్తున్నాయి. సుమారు ఆరు నెలలుగా రెండు పార్టీలు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనాకు పరస్పర ఫిర్యాదులు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఓట్ల పంచాయతీ నడుస్తోంది. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలు నకిలీఓట్లపై ఎన్నికల కమిషన్‌కు వరుసగా ఫిర్యాదులు చేస్తున్నాయి. సుమారు ఆరు నెలలుగా రెండు పార్టీలు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనాకు పరస్పర ఫిర్యాదులు చేస్తున్నారు. తమ పార్టీ సానుభూతిపరుల ఓట్లు తొలగించేస్తున్నారంటూ రెండు పార్టీలు ఎవరికి వారు ఆరోపణలు చేస్తున్నారు. అంతేకాదు రెండు నెలల క్రితమే ఇరు పార్టీల నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదులు చేసాయి. అయితే రాజకీయ పార్టీల నుంచి వస్తున్న ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో.. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి చర్యలు తీసుకుంటున్నారు.
బోగస్ ఓట్లు, ఒకే డోర్ నెంబర్‌తో వందలాది ఓట్లు ఉండటం, మనుషులు లేకున్నా ఓటర్ ఐడీలు ఇస్తున్నారంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు కొన్ని ఆధారాలను సీఈవోకు సమర్పించారు. మరోవైపు ఉరవకొండ, పర్చూరు నియోజకవర్గాల్లో ఓట్ల నమోదు, తొలగింపులో అక్రమాలు జరిగాయంటూ పలువురు అధికారులపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంది. అక్టోబర్ 21 వ తేదీ వరకూ డోర్ టు డోర్ వెరిఫై చేసిన తర్వాత ఇటీవల డ్రాఫ్ట్ ఓటర్ జాబితాను విడుదల చేసారు సీఈవో ముకేష్ కుమార్ మీనా.
గత నెల 27న విడుదల చేసిన డ్రాఫ్ట్ జాబితాపై తాజాగా మళ్లీ తీవ్ర వివాదం మొదలైంది. డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్‌లో అవకతవకలు జరిగాయంటూ ప్రధాన పార్టీలు ఆరోపిస్తున్నాయి. టీడీపీతో పాటు వైసీపీ కూడా పోటాపోటీగా ఫిర్యాదులు చేస్తోంది. ఒకే ఇంటి నంబర్‌తో వందలాది ఓట్లు ఉన్నట్లు, స్థానికంగా ఉండే కొంత మందిని ఓటర్ జాబితా నుంచి తొలగించారని, ఒకే వ్యక్తికి వేర్వేరు చోట్ల ఓట్లు ఉండటం వంటి ఆరోపణలు వస్తున్నాయి. అయితే డ్రాఫ్ట్ ఓటర్ జాబితాపై అభ్యంతరాల స్వీకరణకు డిసెంబర్ 9 వ తేదీ వరకూ గడువు ఉంది. దీంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసేలా ప్రత్యేకంగా పరిశీలకులను నియమించింది ఎన్నికల కమిషన్.
తుది జాబితా తయారీ కోసం ఐఏఎస్‌ల నియామకం..
ఇప్పటికే డ్రాఫ్ట్ ఓటర్ జాబితాను అక్టోబర్ 27 వ తేదీన విడుదల చేసిన ఎన్నికల సంఘం. వీటిపై అభ్యంతరాలకు డిసెంబర్ 9 వ తేదీ వరకూ గడువు ఇచ్చింది. ఆ తర్వాత డిసెంబర్ 10 నుంచి 26 వ తేదీ వరకూ అభ్యంతరాలను పరిష్కరించేందుకు గడువు పెట్టారు. డిసెంబర్ 27 నుంచి జవనరి 4 వ తేదీ వరకూ బీఎల్ వో ల వద్ద ఉన్న వర్కింగ్ కాపీ వెరిఫికేషన్ ఉంటుంది. జనవరి 5వ తేదీన ఫైనల్ ఎస్‌ఎస్‌ఆర్ విడుదల చేయనున్నారు. ఈ లిస్ట్ ప్రకారమే ఎన్నికలు జరగనున్నాయి. అయితే పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నందున ఎలాంటి సమస్యలు రాకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ-2024 కోసం పరిశీలకులుగా ఐదుగురు ఐఏఎస్ అధికారులను నియమించింది.
ఓటర్ల జాబితాలోని లోపాలు సరిదిద్దేలా జిల్లా ఎన్నికల అధికారులకు పరిశీలకులు దిశానిర్దేశం చేయనున్నారు. ఆయా అంశాలను ఎప్పటికప్పుడు ఎన్నికల సంఘానికి పరిశీలకులు రిపోర్ట్ ఇవ్వనున్నారు. ప్రతి జిల్లాలో డిసెంబర్ 9 లోగా ఓసారి, డిసెంబర్ 10 నుంచి 26వ తేదీలోగా రెండోసారి, డిసెంబర్ 27 నుంచి జనవరి 4వ తేదీలోగా మూడోసారి పర్యటించనున్నారు. స్థానికంగా రాజకీయ పార్టీల నాయకులు, ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులు స్వీకరించనున్నారు.
శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ జిల్లాల పరిశీలకులుగా ఐఏఎస్ అధికారి జె.శ్యామలరావును నియమించారు. ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లాలకు బి.శ్రీధర్‌ను నియమించారు. అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాలకు ఎన్.యువరాజ్ ఎంపిక చేసింది. బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాలకు పోలా భాస్కర్‌ను నియమించింది ఈసీ. కర్నూలు, అనంతపురం, నంద్యాల, సత్యసాయి, అన్నమయ్య, వైఎస్సార్ జిల్లాలకు డి.మురళీధర్‌ను ఎన్నికల సంఘం పరిశీలకులుగా ఎంపికయ్యారు. రాష్ట్రంలో ఆయా పార్టీలు చేస్తోన్న ఆరోపణలపై ఎన్నికల పరిశీలకుల నియామకం ద్వారా చెక్ పడుతుందేమో వేచిచూడాలి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..