టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పర్యటన సందర్భంగా.. శుక్రవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. దీనికి బాధ్యులుగా పేర్కొంటూ చంద్రబాబుపై బిక్కవోలు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. డీఎస్పీ భక్తవత్సలం ఫిర్యాదు మేరకు చంద్రబాబుతోపాటు మరో ఏడుగురిపై కేసు నమోదు చేశారు. రోడ్ల మధ్యలో బహిరంగ సభలు పెట్టకూడదన్నా.. నిబంధనలకు విరుద్ధంగా రోడ్ షో నిర్వహించడంతో పాటు, తనను దూషించారంటూ డీఎస్పీ భక్తవత్సలం పోలీసులకు ఫిర్యాదు చేశారు. డీఎస్పీ ఫిర్యాదుతో చంద్రబాబు, మరో ఏడుగురు టీడీపీ నేతలపై కేసు నమోదు చేసినట్లు బిక్కవోలు పోలీసులు తెలిపారు. చంద్రబాబు తదితరులపై 143, 353, 149, 188 సెక్షన్లు కింద కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.
ఇదిలాఉంటే.. ఏపీలోని వైసీపీ ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతోందని చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తంచేశారు. అనపర్తిలో పోలీసులను పురిగొల్పి మీటింగ్ దగ్గరకు పంపారని ఆరోపించారు. సభ నిర్వహణకు ముందురోజు అనుమతి ఇచ్చారనీ.. కానీ, అప్పటికప్పుడు అనుమతి నిరాకరించారంటూ తెలిపారు. అనపర్తిలో పోలీసుల దాడిలో గాయపడిన పార్టీ కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలంటూ చంద్రబాబు ఆకాంక్షించారు. అక్రమంగా నమోదు చేసిన కేసులపై న్యాయబద్ధంగా పోరాడుతామని.. కేసులకు భయపడమంటూ తెలిపారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం..