
అల్లూరి సీతారామరాజు జిల్లాలో జనవరి 2026లో ప్రారంభమైన డ్రోన్ ఆధారిత వైద్య రవాణా వ్యవస్థ ద్వారా ఇప్పటివరకు 24,500 మందికిపైగా రోగులకు సేవలు అందాయి. నాలుగు డ్రోన్లు 1,800కుపైగా ట్రిప్పులు పూర్తి చేసి 71 వేల కిలోమీటర్లకుపైగా ప్రయాణించాయి. వైద్య పరీక్షల నమూనాలు, మందులు, వ్యాక్సిన్లు, పరీక్షల నివేదికలను వేగంగా తరలించడంతో గిరిజనులకు సమయం, దూరం, ఖర్చు ఆదా అవుతోంది. అల్లూరి సీతారామరాజు జిల్లా అంటేనే కొండలు, అటవీ ప్రాంతాలు, మారుమూల గిరిజన ఆవాసాలు. కొన్ని ప్రాంతాలకు రహదారి మార్గంలో ప్రయాణం చేయాలంటే ఎక్కువ సమయం పడుతుంది. ఈ పరిస్థితుల్లో వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడం వైద్య సిబ్బందికి కూడా సవాలుగా మారేది.
ఈ సమస్యకు సాంకేతిక పరిష్కారంగా రాష్ట్రంలో తొలిసారి డ్రోన్ ఆధారిత వైద్య రవాణా వ్యవస్థను ప్రవేశపెట్టారు. జనవరి 2026లో ప్రారంభమైన ఈ సేవలు.. ఇప్పుడు గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవల వేగాన్ని పెంచుతున్నాయి. నాలుగు డ్రోన్లు ఇప్పటివరకు 1800కుపైగా ట్రిప్పులు పూర్తి చేశాయి. మొత్తం 71 వేల కిలోమీటర్లకుపైగా ప్రయాణించాయి. రహదారి మార్గంలో ఎక్కువ సమయం పట్టే వైద్య నమూనాలు, మందులు, వ్యాక్సిన్లు వంటి వాటిని అవసరమైన ప్రాంతాలకు వేగంగా చేరవేస్తున్నాయి. వైద్య పరీక్షల కోసం సేకరించిన నమూనాలను సకాలంలో ప్రయోగశాలలకు చేర్చడం ఈ వ్యవస్థలో కీలకమైన అంశం. ఇప్పటివరకు 2,200కుపైగా వైద్య పరీక్షల నమూనాలను డ్రోన్ల ద్వారా తరలించారు. వాటిలో 596 సికిల్‌సెల్ నమూనాలు ఉన్నాయి. నమూనాలు త్వరగా ల్యాబ్‌లకు చేరడంతో పరీక్షల ఫలితాలు కూడా సకాలంలో అందే అవకాశం ఏర్పడింది. దీంతో ముఖ్యంగా సికిల్‌సెల్ స్క్రీనింగ్‌కు ఈ వ్యవస్థ ఉపయోగపడుతోంది.
మొత్తంగా 9,000కుపైగా వైద్య పరీక్షలకు ఈ విధానం ద్వారా అవకాశం కల్పించారు. వైద్య పరీక్షల నమూనాల తరలింపుతో పాటు అవసరమైన మందులు, వ్యాక్సిన్లు, ఇతర వైద్య సామగ్రిని కూడా డ్రోన్ల ద్వారా పంపిస్తున్నారు. డ్రోన్ ఆధారిత వైద్య రవాణా వ్యవస్థ వల్ల ఇప్పటివరకు 24,500 మందికిపైగా రోగులకు సేవలు అందించినట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇంతకుముందు పరీక్షల కోసం లేదా మందుల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన గిరిజనులకు ఇప్పుడు కొంత మేర ఆ అవసరం తగ్గుతోంది. రోగి ప్రయాణించే సమయం మాత్రమే కాదు.. కుటుంబ సభ్యులు వెంట వెళ్లాల్సిన అవసరం, ప్రయాణ ఖర్చులు, పనిదినాల నష్టాన్ని కూడా తగ్గించేందుకు ఈ విధానం దోహదపడుతోంది. మారుమూల ప్రాంతాల్లో వైద్య సేవలను వేగంగా అందించడమే ఈ వ్యవస్థ ప్రధాన ఉద్దేశం.
డ్రోన్ వ్యవస్థను ఒక్క ప్రాంతానికే పరిమితం చేయకుండా వైద్య సంస్థల నెట్‌వర్క్‌తో అనుసంధానించారు. పాడేరు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రితో పాటు లొథుగెడ్డ, తాజంగి, సుంకరమెట్ట, భీమవరం, అనంతగిరి పీహెచ్‌సీలు, ముంచింగిపుట్టు సీహెచ్‌సీ, చింతపల్లి, అరకు ఏరియా ఆసుపత్రులను డ్రోన్ నెట్‌వర్క్‌తో అనుసంధానించారు. దీంతో ఒక ప్రాంతంలో సేకరించిన వైద్య నమూనాలను అవసరమైన ల్యాబ్‌కు, మరో ప్రాంతానికి అవసరమైన మందులు లేదా వ్యాక్సిన్లను సంబంధిత ఆరోగ్య కేంద్రానికి వేగంగా పంపే అవకాశం ఏర్పడింది. ఇటీవల గన్నెల పీహెచ్‌సీ నుంచి ఆర్‌కే నగర్ గ్రామానికి డ్రోన్ ద్వారా వైద్య పరీక్షల నివేదికలు, వ్యాక్సిన్లు, మందులను తరలించే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. ఇది మారుమూల ప్రాంతాల్లో వైద్య సేవలను మరింత వేగంగా అందించేందుకు డ్రోన్ వ్యవస్థను ఎలా ఉపయోగించవచ్చో చూపించే ఉదాహరణగా నిలిచింది. సికిల్‌సెల్ వంటి వ్యాధుల స్క్రీనింగ్‌తో పాటు ప్రజారోగ్య కార్యక్రమాల్లోనూ ఈ సాంకేతికతను మరింత సమర్థంగా వినియోగించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
డ్రోన్ సేవలు కేవలం సాంకేతిక పరిజ్ఞానానికే పరిమితం కాకుండా స్థానిక యువతకు ఉపాధి, నైపుణ్య అవకాశాలను కూడా కల్పించే దిశగా సాగుతున్నాయి. డ్రోన్ కార్యకలాపాలు, సహాయక సేవల్లో స్థానికుల భాగస్వామ్యాన్ని పెంచేందుకు ఇప్పటివరకు 25 మందికిపైగా స్థానిక, గిరిజన యువతకు శిక్షణ ఇచ్చారు. స్థానిక పరిస్థితులు, భౌగోళిక అంశాలపై అవగాహన ఉన్న యువత భాగస్వామ్యంతో సేవలను మరింత సమర్థంగా నిర్వహించే అవకాశం ఏర్పడుతోంది. ఇప్పటివరకు అందిన ఫలితాల ఆధారంగా డ్రోన్ ఆధారిత వైద్య రవాణా వ్యవస్థను మరింత విస్తరించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. మారుమూల ప్రాంతాల్లో వైద్య సేవలు అందించడంలో ప్రధాన అడ్డంకిగా ఉన్న దూరాన్ని సాంకేతికతతో అధిగమించేందుకు ఈ విధానం ఉపయోగపడుతోంది. ఒకవైపు వైద్య పరీక్షల నమూనాలు త్వరగా ల్యాబ్‌లకు చేరడం.. మరోవైపు మందులు, వ్యాక్సిన్లు అవసరమైన ప్రాంతాలకు వేగంగా చేరడం.. గిరిజనులకు సకాలంలో వైద్యం అందించడంలో కీలకంగా మారుతోంది. కొండలు.. అడవులు.. రహదారులు అడ్డుగా ఉన్నా.. వైద్యం మాత్రం ఆగకూడదన్న లక్ష్యంతో మొదలైన ఈ ప్రయోగం ఇప్పుడు విస్తరణ దిశగా అడుగులు వేస్తోంది. కొండ ప్రాంతాల్లో రహదారి కష్టాలను అధిగమిస్తూ.. గిరిజనుల ఆరోగ్యానికి ఆకాశమార్గం చూపుతున్న ఈ డ్రోన్ వైద్య సేవలు.. రాష్ట్రంలో సాంకేతికత ఆధారిత ప్రజారోగ్య సేవలకు కొత్త దారిగా మారుతున్నాయి.