కడప రైతు వరదరాజ్‌కు ప్రధాని మోదీ ప్రశంసలు.. ఎందుకో తెలుసా..?
PM Modi Mann Ki Baat Telugu: 137వ మన్ కీ బాత్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్‌లోని కడపకు చెందిన రైతు వరదరాజ్‌ను ప్రస్తావించారు. అవకాడో సాగుతో అదనపు ఆదాయం పొందుతున్న వరదరాజ్ గురించి ప్రశంసిస్తూ, వ్యవసాయంలో కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవాలని రైతులకు సూచించారు.

ఆంధ్రప్రదేశ్‌లోని కడపకు చెందిన రైతు వరదరాజ్ అవకాడో సాగుతో అదనపు ఆదాయం సంపాదిస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. 137వ ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో మాట్లాడిన మోదీ.. వ్యవసాయంలో కొత్త పద్ధతులను అవలంబిస్తూ రైతులు ఆదాయ మార్గాలను విస్తరించుకోవాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు.
కడపకు చెందిన వరదరాజ్ అవకాడోలను సాగు చేస్తూ అదనపు ఆదాయం పొందుతున్నారని ప్రధాని తెలిపారు. తమిళనాడులోని కొడైకెనాల్‌కు చెందిన చంద్రశేఖరన్ కూడా అవకాడో సాగుతో లాభాలు పొందుతున్నట్లు పేర్కొన్నారు. సంప్రదాయ పంటలతో పాటు మార్కెట్‌లో డిమాండ్ ఉన్న ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయడం ద్వారా రైతులు కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని ఈ ఉదాహరణలు సూచిస్తున్నాయి.
ఇదే కార్యక్రమంలో మాదకద్రవ్యాల రహిత యువత, పీఎం స్వనిధి యోజన, పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ, మిషన్ శక్తిసాట్, ‘వోకల్ ఫర్ లోకల్’, స్వయం సమృద్ధి భారత్ వంటి అంశాలపై ప్రధాని మోదీ మాట్లాడారు. మాదకద్రవ్యాలకు దూరంగా ఉండే యువతతోనే వికసిత భారత్ సాధ్యమని పేర్కొన్న మోదీ.. సృజనాత్మకతను సామాజిక మార్పుకు ఉపయోగించాలని యువత, కంటెంట్ క్రియేటర్లకు పిలుపునిచ్చారు. అలాగే పండుగల సమయంలో స్థానికంగా తయారైన వస్తువులను కొనుగోలు చేయడం ద్వారా ‘వోకల్ ఫర్ లోకల్’ను ప్రోత్సహించాలని ప్రధాని మోదీ సూచించారు.
మరోవైపు, ముంబైకు చెందిన కృష్ణ శేషాద్రి www.bharatrajya.com అనే వెబ్‌సైట్‌ను రూపొందించారని, ఏ సంవత్సరం ఎంచుకున్నా ఆ సమయంలో భారత్‌లోని ఏ ప్రాంతాన్ని ఎవరు పాలించారో తెలుసుకోవచ్చని, ఈ చరిత్ర విద్యార్థులకు మాత్రమే కాదు, అందరికీ గతం గురించి నేర్చుకునేందుకు సహాయపడుతుందని అన్నారు.
