APSRTC: బస్టాండ్‌కు వెళ్లాల్సిన పనే లేదు.. ఇంటి వద్దకే బస్సు.. ప్రయాణికులకు ఆర్టీసీ సరికొత్త ఆప్షన్..
ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటి వద్దకే బస్సు వచ్చి పికప్ చేసుకోనుంది. ఇక నుంచి మీరు బస్టాండ్ వద్దకు వెళ్లాల్సిన పని ఉండదు. దీని వల్ల సమయం, డబ్బులు ఆదా అవుతాయి. ఈ విధానం అమలుకు సంబంధించి ఆర్టీసీ అధికారులు కసరత్తు చేస్తున్నారు.

ఏపీఎస్ఆర్టీసీ తమ ప్రయాణికులకు శుభవార్త అందించింది. టికెట్లు బుక్ చేసుకుంటే ఇంటి వద్దకే బస్సును పంపే విధానాన్ని శ్రీకారం చుట్టనుంది. పది టికెట్లను బల్క్‌గా బుక్ చేసుకుంటే ఇంటి వద్దకే బస్సు వచ్చి పికప్ చేసుకుంటుంది. మీరు బస్టాండ్‌కు వెళ్లి ఎక్కాల్సిన పని ఉండదు. కేవలం పదికిపైగా బల్క్ టికెట్లు బుక్ చేసుకున్నవారికి మాత్రమ ఈ అవకాశం ఉంటుంది. మిగతవారు ప్రస్తుతం ఉన్న విధానంలో బస్టాండ్‌కు వెళ్లి బస్సు ఎక్కాల్సి ఉంటుంది. తొలుత విజయవాడ నగర పరిధిలో దీనిని అమలు చేయాలని ఏపీఎస్‌ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు. పైలట్ ప్రాజెక్టుగా ప్రస్తుతం దీనిని అమలు చేయాలని భావిస్తున్నారు. ఈ వ్యవస్థ అమల్లో వస్తే లోటుపాట్లు, సమస్యలు గుర్తించిన అనంతరం ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించాని ఏపీఎస్ఆర్టీసీ సమాలోచనలు చేస్తోంది.
ప్రస్తుతం కేవలం దూర ప్రాంతాలకు వెళ్లే హైయ్యండ్ బస్సులకు మాత్రమే ఇంటి వద్దకు వెళ్లి పికప్ చేసుకునే విధానాన్ని వర్తింపచేస్తారు. అయితే బల్క్‌గా పదికిపైగా టికెట్లు బుక్ చేసుకుంటున్నప్పుడు ప్రయాణికులు ముందుగా ఆర్టీసీ అధికారులకు సమాచారం అందించాలి. అనంతరం బస్టాండ్‌కు వెళ్లాల్సిన పని లేకుండా ఇంటి వద్దకే బస్సును పంపిస్తారు. ఈ విధానం అమలు కోసం త్వరలో కొత్త వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ఏపీఎస్‌ఆర్టీసీ సిద్దమవుతోంది. ప్రస్తుతం దీనికి సంబంధించి కసరత్తు చేస్తున్నారు. మరింత సమాచారం త్వరలోనే వెల్లడయ్యే అవకాశముంది. ఎలా బుక్ చేసుకోవాలి.. అధికారులను ఎలా సంప్రదించాలి.. అనే వివరాలు కొద్ది రోజుల్లో ప్రకటించనున్నారు. ఈ విధానం వల్ల ఒకేసారి బల్క్‌గా టికెట్లు బుక్ చేసుకునేవారికి బస్టాండ్‌కు వెళ్లే సమయం ఆదా అవుతుంది. కుటుంబసభ్యులందరూ కలిసి ఒకేసారి వెళ్లాలనుకుప్పుడు ఈ కొత్త వ్యవస్ధ ఉపయోగపడుతుంది.
ఇక లగేజీ ఎక్కువగా ఉన్నప్పుడు బస్టాండ్ వరకు వాటిని తీసుకెళ్లాలంటే ఇబ్బందికరంగా ఉంటుంది. అలాగే బస్సు ఆగే చోటకు వెళ్లాలన్నా పెద్ద సమస్యగా ఉంటుంది. ఇక నుంచి అలాంటి ఇబ్బంది లేకుండా బస్సునే ఇంటి వద్దకు రావడం వల్ల లగేజీ సమస్యలు కూడా తొలగిపోతాయి. ప్రస్తుతానికి దూర ప్రాంతానికి వెళ్లే అగ్రశ్రేణి బస్సుల్లో ఈ కొత్త విధానం అమలుకు సిద్దమవుతున్నారు. ప్రస్తుతం కొన్ని బస్సుల్లో మాత్రమే ఈ విధానం అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. విజయవాడ రీజియన్ ఆర్టీసీ అధికారులు తొలుత ఈ సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం ఉన్న విధానంలో బల్క్‌గా టికెట్లు ఒకేసారి బుక్ చేసినా బస్టాండ్‌కు వెళ్లి బస్సు ఎక్కాల్సి ఉంది. రాబోయే రోజుల్లో ఎక్కువమంది ప్రయాణికులు ఉంటే ఇంటి వద్దకే బస్సు వచ్చి పికప్ చేసుకునేలా ఆర్టీసీ ప్రణాళికలు రూపొందిస్తోంది. ప్రయాణికులకు ఆర్టీసీ సేవలను మరింత చేరువచేసేందుకు ఈ ఆలోచన చేసినట్లు తెలుస్తోంది.
