AP Political Disputes: చిలకలూరిపేట రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. ఎమ్మెల్యే విడుదల రజనీ, మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ మధ్య విబేధాలు మరోసారి బయటపడ్డాయి. వైసీపీ ఏర్పాటు నుంచి పార్టీలో ఉన్న మర్రి రాజశేఖర్ కు 2019లో పేట టికెట్ ఇవ్వలేదు. ఆర్థికంగా బలమైన అభ్యర్థిని రంగంలోకి దింపాలన్న నిర్ణయంతో బీసీ మహిళైన రజనీకి పార్టీ అధినేత జగన్ అవకాశం ఇచ్చారు. టీడీపీ నేత పుల్లారావుపై పోటీ చేయటానికి విడుదల రజని కూడా ముందుకొచ్చారు. అయితే ఆమె గెలిస్తే మర్రి రాజశేఖర్ కు సముచిత స్థానం ఇస్తామని జగన్ బహిరంగంగానే ప్రకటించారు. జగన్ మాటపై విశ్వాసంతో రజనీ గెలుపు కోసం రాజశేఖర్ కూడా తీవ్రంగా శ్రమించారు. 2019 ఎన్నికల్లో విడుదల రజనీ పుల్లారావుపై విజయం సాధించారు.
అయితే అప్పటి నుండి రాజకీయాలు శర వేగంగా మారిపోయాయి. నియోజకవర్గంలో రజనీ పట్టు సాధిస్తుండటంతో మర్రి వర్గంలో ఆందోళన మొదలైంది. దీంతో ఆమెకు చెక్ పెట్టేందుకు మర్రి తన అనుచరులను రంగంలోకి దింపారు. ఇక్కడే మర్రి రాజశేఖర్ కు అనుకూలంగా నర్సరావుపేట ఎంపీ కృష్ణదేవరాయలు రంగంలోకి దిగారు. ఎమ్మెల్యే రజని, ఎంపీ కృష్ణదేవరాయలకు ఎన్నికల సమయం నుండి విబేధాలున్నాయి.
శత్రువుకు శత్రువు మిత్రుడు అన్న సామెతను నిజం చేస్తూ మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్, ఎంపీ కృష్ణదేవరాయలు ఒక్కటయ్యారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే వ్యతిరేక వర్గానికి మద్దతునివ్వటం ప్రారంభించారు. దీన్ని పసిగట్టిన ఎమ్మెల్యే తన వర్గాన్ని వాళ్ళకి వ్యతిరేకంగా రంగంలోకి దింపారు. దీంతో రెండు మూడు చోట్ల ఎమ్మెల్యే ప్రమేయం లేని కార్యక్రమాలకు ఎంపీ హాజరు కావడం, వారిని ఎమ్మెల్యే వర్గీయులు అడ్డుకోవడం జరిగింది. ఎమ్మెల్యే రజని తమను కలుపుకోనిపోవటం లేదని ఎంపీ, మాజీ ఎమ్మెల్యే వర్గం ఆరోపిస్తే.. వారిద్దరూ నాకు సహకరించడం లేదని ఎమ్మెల్యే రజనీ ప్రత్యారోపణలు చేశారు.
ఇది ఇలా ఉండగానే రెండేళ్ళు గడిచిపోయాయి. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికలు రావటంతో మర్రి రాజశేఖర్ కు ఆ పదవి వస్తుందని అంతా ఆశించారు. అయితే గవర్నర్ కోటాలో అప్పిరెడ్డికి, స్థానిక సంస్థల కోటాలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మురుగుడు హనుమంతరావుకి సీఎం అవకాశమిచ్చారు. ఈ నిర్ణయంతో.. ఎమ్మెల్సీ అయినా వస్తే ఎమ్మెల్యే రజనికి చెక్ పెట్టవచ్చని భావించిన మర్రి ఆశలు అడియాసలయ్యాయి. దీంతో ఆయన వర్గం భగ్గుమంటుంది.
తాజాగా మాజీ సీఎం రోశయ్య సంస్మరణ సభలో మర్రి రాజశేఖర్ బావ, మాజీ ఎమ్మెల్యే సోమేపల్లి సాంబయ్య కొడుకు వెంకట సుబ్బయ్య వైసీపీపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ ఇవ్వకుండా మోసం చేశారన్నారు. గుండెల్లో పెట్టుకుంటామని చెప్పి మాట తప్పారన్నారు. వైసీపీలో తమ కులం లేదంటూ సామాజిక వర్గాన్ని తీసుకొచ్చారు. ఇదే సమయంలో చిలకలూరిపేట మార్కెట్ యార్డు ఛైర్మన్ పదవి ప్రమాణ స్వీకార సభకు తమను ఆహ్వానించలేదంటూ ఎంపీ వర్గం సోషల్ మీడియాలో వాపోయింది. ప్రస్తుతం జిల్లా మొత్తం మీద ఒక్క చిలకలూరిపేటలోనే అధికార పార్టీలో ఆధిపత్య రాజకీయాలు నడుస్తున్నాయి. మరి ఈ సమస్యను అధిష్టానం ఏవిధంగా పరిష్కరిస్తుందోనని జిల్లావాసులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
రిపోర్టర్: టి నాగరాజు, టివి9, గుంటూరు.
Also read:
General Bipin Rawat: రావత్ నోట చివరి మాట అదే.. బోరున విలపించిన ప్రత్యక్ష సాక్షి.. ఎందుకంటే..!
Black Box for Aliens: ఏలియన్స్ కోసం ఎర్త్ బ్లాక్ బాక్స్ రెడీ.. ఈ బాక్స్ ఏం చేస్తుందో తెలుసా?..