బాడీ బిల్డింగ్ కాంపిటేషన్స్‌లో అద్భుతాలు సృష్టిస్తున్న దివ్యాంగుడు..

| Edited By: Balaraju Goud

Mar 01, 2025 | 5:03 PM

ఒక మనిషి లక్ష్యం ఎంత పెద్దదైనా గమ్యాన్ని చేరుకోవడం కోసం నిరంతరం శ్రమిస్తే విజయం సొంతం అవుతుందని నిరూపించాడు సూర్యనారాయణ. ఇతని పట్టుదలకు అందరూ ప్రశంసిస్తున్నారు. జిమ్ లో జాయిన్ అయి కండలు పెంచాడు. అనంతరం బాడీ బిల్డింగ్ కాంపిటీషన్‌కు వెళ్ళటం ప్రారంభించాడు. సూర్యనారాయణ పాల్గొన్న ప్రతి ఒక్క పోటీలో అతనిదే పైచేయి.

బాడీ బిల్డింగ్ కాంపిటేషన్స్‌లో అద్భుతాలు సృష్టిస్తున్న దివ్యాంగుడు..
Suryanarayana,bodybuilder
Follow us on

లక్ష్య సాధన ముందు ఎంతటి అంగవైకల్యం అయినా వెన్ను చూపాల్సిందే అని రుజువు చేశాడు విజయనగరం జిల్లాకు చెందిన ఈదుబిల్లి సూర్యనారాయణ. ఆశయ సాధన కోసం ఈయన పడుతున్న కష్టం అందరినీ ఆలోచింప చేస్తుంది. ధత్తిరాజేరు మండలం వంగర గ్రామానికి చెందిన ఈదుబిల్లి అప్పలస్వామి, పోలమ్మలు వ్యవసాయం చేసుకుని జీవనం సాగిస్తున్నారు. వీరికి సూర్యనారాయణ అనే కుమారుడు ఉన్నాడు. సూర్యనారాయణ పుట్టుకతో అందంగా, ఆరోగ్యంగా పుట్టాడు. అయితే పుట్టిన కొద్ది నెలలకే సూర్యనారాయణను పోలియో మహమ్మారి వెంటాడింది. దీంతో సూర్యనారాయణ దివ్యాంగుడిగా మారాడు.

ఆరోగ్యంగా పుట్టిన తన కుమారుడు దివ్యాంగుడిగా మారడంతో తల్లిదండ్రులు కూడా తల్లడిల్లిపోయారు. తల్లిదండ్రుల వేదన చూసిన బంధువులు సైతం బాధపడ్డారు. బంధువులు, స్నేహితులు అంతా పోలియో బారిన పడ్డ సూర్యనారాయణ జీవనం ఎలా సాగిస్తాడో అని ఆవేదన చెందేవారు. అయితే సూర్యనారాయణ మాత్రం ఆ మాటలను పట్టించుకోలేదు. ఎలాగైనా తాను జీవితంలో ఏదో ఒకటి సాధించి తన కంటూ ఒక గుర్తింపు ఉండాలని తపన పడ్డాడు. ఈ క్రమంలోనే డిగ్రీ వరకు కష్టపడి చదివాడు. అనంతరం ఉన్నత విద్య కొనసాగిస్తూనే మరోవైపు క్రీడారంగంలో రాణించాలని నిర్ణయించుకున్నాడు.

అందుకోసం ముందుగా జిమ్ లో జాయిన్ అయి కండలు పెంచాడు. అనంతరం బాడీ బిల్డింగ్ కాంపిటీషన్‌కు వెళ్ళటం ప్రారంభించాడు. సూర్యనారాయణ పాల్గొన్న ప్రతి ఒక్క పోటీలో అతనిదే పైచేయి. కాంపిటీషన్‌కు వెళ్లేందుకు కొంత డబ్బులు అవసరం అయ్యేవి. అయితే డబ్బు కోసం తల్లిదండ్రుల మీద ఆధారపడటం ఇష్టం లేని సూర్యనారాయణ జిమ్ లో ట్రైనర్ గా జాయిన్ అయి, అక్కడ వచ్చే జీతంతో కాంపిటీషన్స్ కోసం ఖర్చు పెడుతుంటాడు. ఎవరి సహాయం అడగకుండా ఆత్మాభిమానంతో పోటీల్లో పాల్గొంటూ ముందుకు సాగుతూ అనేక పతకాలు పొందాడు.

ఈ క్రమంలోనే 2021 జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ లో పాల్గొని ఆల్ ఇండియా టైటిల్ పొందాడు. తర్వాత 2023 మధ్యప్రదేశ్ రట్లాంలో జరిగిన బాడీ బిల్డింగ్ పోటీల్లో మిస్టర్ ఇండియా టైటిల్ తో గోల్డ్ మెడల్ కైవసం చేసుకున్నాడు. 2023 జూన్ లో బెంగళూరులో జరిగిన బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ లో గోల్డ్ మెడల్ సాదించాడు. ఇవి కాక చెన్నైలో 20, ఢిల్లీలో 3, పంజాబ్ లో 2, కలకత్తాలో 2, రాజస్థాన్లో 3, ముంబైలో 3, బీహార్ లో 2 హైదరాబాద్‌లో 15, భువనేశ్వర్ లో 2 మెడల్స్ సాధించాడు. అంతేకాకుండా రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో జరిగిన బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ లో గోల్డ్ మోడల్స్ సొంతం చేసుకున్నాడు. ఒక మనిషి లక్ష్యం ఎంత పెద్దదైనా గమ్యాన్ని చేరుకోవడం కోసం నిరంతరం శ్రమిస్తే విజయం సొంతం అవుతుందని నిరూపించాడు సూర్యనారాయణ. ఇతని పట్టుదలకు అందరూ ప్రశంసిస్తున్నారు.