Andhra Pradesh: ఎమ్మెల్యేని కూడా వదల్లేదు.. ఏకంగా 1.07 కోట్ల కుచ్చుటోపి..

డిజిటల్ యుగంలో సైబర్ నేరగాళ్లు ఎంతకు తెగిస్తున్నారో చెప్పడానికి ఈ ఘటనే ఉదాహరణ. టీడీపీ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడ్డారు. కేటుగాళ్లు డిజిటల్ అరెస్ట్ పేరుతో ఆయన నుంచి భారీగా డబ్బును కాజేశారు. ముంబై క్రైమ్ బ్రాంచ్ అధికారులమని.. ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేస్తామంటూ ఎమ్మెల్యేని భయపెట్టారు.

Andhra Pradesh: ఎమ్మెల్యేని కూడా వదల్లేదు.. ఏకంగా 1.07 కోట్ల కుచ్చుటోపి..
Mydukuru Mla Putta Sudhakar Yadav

Updated on: Oct 19, 2025 | 11:48 AM

ఈ డిజిటల్ యుగంలో సైబర్ నేరాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఫేక్ లింక్స్, డిజిటల్ అరెస్టులతో కేటుగాళ్లు అందినకాడికి దోచుకుంటున్నారు. వీఐపీల నుంచి మొదలు సామాన్యుల వరకు అందరినీ సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేస్తున్నారు. తాజాగా ఓ టీడీపీ ఎమ్మెల్యే సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకున్నారు. టీడీపీ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్‌ను డిజిటల్ అరెస్ట్ పేరుతో భయపెట్టి భారీగా నగదు దోచుకున్నారు. మైదుకూరు ఎమ్మెల్యే అయిన సుధాకర్ యాదవ్ నుంచి సైబర్ ముఠా రూ. 1.07 కోట్లు కొల్లగొట్టింది.

అసలేం జరిగింది..?

ఈ నెల 10న ఉదయం ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్‌కు బంజారాహిల్స్ నివాసంలో ఉండగా ఒక నంబర్ నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్ చేసిన వ్యక్తి తాను ముంబై క్రైమ్ బ్రాంచ్ అధికారి గౌరవ్ శుక్లాగా పరిచయం చేసుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత మరొక నంబర్ నుంచి వీడియో కాల్ వచ్చింది. ఆ వ్యక్తి ముంబై సైబర్ క్రైమ్ బ్రాంచ్ అధికారి విక్రమ్‌గా పరిచయం చేసుకున్నాడు. ఉగ్రవాదుల బ్యాంకు లావాదేవీల కేసులో ఎమ్మెల్యేకు ప్రమేయం ఉందని, మనీ లాండరింగ్ జరిగిందని ఆరోపించారు. ఒక ఉగ్రవాది ఖాతా నుంచి రూ. 3 కోట్లు ఎమ్మెల్యే ఖాతాకు బదిలీ అయ్యాయని నకిలీ పత్రాలు, అరెస్ట్ వారెంట్లు చూపించి బెదిరించారు.

రూ. 1.07 కోట్లు బదిలీ

‘‘మీ బ్యాంకు అకౌంట్‌ను పరిశీలించాల్సి ఉంది. సహకరించకపోతే ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేస్తాం’’ అంటూ బెదిరించి.. పలు దఫాలుగా ఎమ్మెల్యే నుంచి రూ. 1.07 కోట్లు తమ ఖాతాలకు బదిలీ చేయించుకున్నారు. ఆ తర్వాత కూడా మరో రూ. 60 లక్షలు డిమాండ్ చేయడంతో తాను మోసపోయానని ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ గ్రహించారు. వెంటనే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సామాన్యులే కాదు ఎమ్మెల్యేను సైతం లక్ష్యంగా చేసుకొని సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..