Diarrhea Cases in AP: ఏపీలో డయేరియా కలకలం.. ఒకరు మృతి.. పెరుగుతున్న కేసులు..

|

Jun 23, 2024 | 7:15 AM

ఏపీలో డయేరియా దడ పుట్టిస్తోంది. అతిసార వ్యాధి జనాలను అతలాకుతలం చేస్తోంది. మరీ ముఖ్యంగా ఎన్టీఆర్‌, నంద్యాల జిల్లాల్లో జనం బెంబేలెత్తిపోతున్నారు. ఇప్పటికే ఈ వ్యాధితో ఒకరు చనిపోవడం, ఇబ్బడిముబ్బడిగా కేసులు నమోదవ్వడం మరింత ఆందోళన కలిగిస్తోంది.

Diarrhea Cases in AP: ఏపీలో డయేరియా కలకలం.. ఒకరు మృతి.. పెరుగుతున్న కేసులు..
Diarrhea Cases
Follow us on

ఏపీలోని పలు జిల్లాల్లో డయేరియా కలకలం సృష్టిస్తోంది. ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేట జనాలను కలవరపెడుతోంది. ఇప్పటికే ఒకరు చనిపోవడం, పెద్ద ఎత్తున కేసులు నమోదవ్వడంతో జనాలు వణికిపోతున్నారు. నియోజకవర్గంలోని 8 గ్రామాలకు ఈ అతిసార వ్యాధి పాకింది. దీంతో జగ్గయ్యపేట ప్రభుత్వాసుపత్రి పేషెంట్లతో నిండిపోయింది. ఇక వెంటనే అప్రమత్తమైన అధికారులు రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రిలో 16 మంది వైద్యులు 24 గంటలపాటు సేవలు అందిస్తున్నారు. జగ్గయ్యపేటలో డయేరియా విజృంభణ నేపథ్యంలో.. ఇవాళ మంత్రులు పర్యటించనున్నారు. మంత్రులు సత్యకుమార్‌, నారాయణ ఉ.9:30కి ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించనున్నారు.

నంద్యాల జిల్లానూ కలవరపెడుతోందీ డయేరియా. జూపాడు బంగ్లా మండలంలోని పలు గ్రామాలకు వేగంగా విస్తరించింది. మరీ ముఖ్యంగా జాబోలు గ్రామంలో ఈ అతిసార వ్యాధి మరింత ముదరింది. బాధితుల సంఖ్య 30కి చేరగా.. వాంతులు, విరేచనాలతో ప్రభుత్వ ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. దీంతో వైద్యాధికారులు అప్రమత్తమై గ్రామాల్లో మెడికల్‌ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా కర్నూలు, కాకినాడ జిల్లాల్లోనూ డయేరియా కేసులు పెద్ద ఎత్తున నమోదవుతున్నాయి.

డయేరియా వ్యాధి విజృంభణపై డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్ అధికారులను నిలదీశారు. ఇన్ని కేసులు నమోదవుతుంటే వ్యాధి కట్టడిపై అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. అంతేకాదు రివ్యూ మీటింగ్‌ కూడా నిర్వహించారు. దీంతో అధికార యంత్రాంగంలో కదలిక వచ్చింది. జగ్గయ్యపేటకి వెళ్లి పరిస్థితిపై ఆరా తీశారు కలెక్టర్‌. మరోవైపు డయేరియా కట్టడిపై వివిధ శాఖల అధికారులతో సీఎస్‌ నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజలకు రక్షిత తాగునీరు అందించేలా చూడాలని కలెక్టర్లను ఆదేశించారు. మంచినీటి పైపులైన్లు లీకేజీలు లేకుండా చూడాలని స్పష్టం చేశారు. జులై 1 నుంచి ఆగస్టు 31 వరకు డయేరియా నియంత్రణపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. డయేరియా నియంత్రణకు కట్టుదిట్టమైన ప్రణాళిక అమలు చేయాలని సీఎస్‌ ఆదేశించారు. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మున్సిపల్, ఆరోగ్య శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని ఆదేశించారు సీఎస్‌ నీరభ్‌ కుమార్.

మొత్తంగా… అతిసార వ్యాధిపై ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎక్కడిక్కడ మెడికల్‌ క్యాంపులు నిర్వహిస్తోంది. వర్షాకాల నేపథ్యంలో అంటురోగాలు ప్రబలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..