AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kurnool: ఆ వాగులో వజ్రాలు దొరుకుతున్నాయట.. పోటెత్తుతున్న జనం..

నల్లమల అడవిలో పారే రాళ్లవాగు ఇప్పుడు వజ్రాల వాగుగా పేరు తెచ్చుకుంది. వజ్రాలు దొరుకుతాయనే ప్రచారంతో వందలాది మంది పేదలు, కూలీలు అదృష్టం పరీక్షించుకుంటున్నారు. వజ్రాలు దొరకకపోయినా, అక్కడి వ్యాపారాలు మాత్రం బాగానే జరుగుతున్నాయి. పూర్తి డీటేల్స్ కథనం లోపల తెలుసుకుందాం పదండి..

Kurnool: ఆ వాగులో వజ్రాలు దొరుకుతున్నాయట.. పోటెత్తుతున్న జనం..
Diamond Hunt
J Y Nagi Reddy
| Edited By: Ram Naramaneni|

Updated on: Nov 08, 2025 | 6:11 PM

Share

నల్లమల అడవిలో పారే రాళ్లవాగు ఇప్పుడు వజ్రాల వాగుగా ప్రచారం పొందుతోంది. అక్కడ వజ్రాలు దొరకడం దేవుడికే తెలియాలి గానీ, వజ్రాల ఆశతో పేదలు, కూలీలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వజ్రాల కోసం వాగులో తవ్వకాలు, శోధనలు సాగుతుండటంతో ఈ విషయం ఉమ్మడి కర్నూలు జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. మహానంది మండలం గాజులపల్లె గ్రామ సమీపంలోని నల్లమల అడవిలో ప్రాచీన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం ఉంది. ఆ దేవాలయంలో స్వామి, అమ్మవార్ల కళ్యాణం సందర్భంగా వజ్రాలతో తలంబ్రాలు పోశారనే నమ్మకం స్థానికుల్లో ఉంది. ఆలయం క్రింద భాగంలో ప్రవహించే రాళ్లవాగును ప్రజలు ఇప్పుడు వజ్రాల వాగుగా పిలుస్తున్నారు. గత కొన్నేళ్లుగా ఈ వాగులో వజ్రాలు లభ్యమవుతున్నాయనే ప్రచారం ఉండేది. దీంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు డబ్బు ఆశతో వాగులో వజ్రాల కోసం వెతికినా, ఇప్పటివరకు ఎవరికి ఏ వజ్రం దొరకలేదని చెబుతున్నారు. కేవలం సుద్దరాళ్లు మాత్రమే లభిస్తున్నాయని తెలుస్తోంది.

ఇటీవల సోషల్ మీడియా ప్రభావంతో వజ్రాల వాగు పేరు పెద్ద ఎత్తున ప్రచారం కావడంతో, వందలాది మంది ఆశావహులు అక్కడికి తరలివస్తున్నారు. గాజులపల్లె రైల్వే స్టేషన్ సమీపంలో ఉండటం, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఉండటంతో మహిళలు కూడా ఎక్కువ సంఖ్యలో వస్తున్నారు. రైల్వే సౌకర్యం కారణంగా గుంటూరు, విజయవాడ, ప్రకాశం జిల్లాల నుంచి కూడా పేద కూలీలు ఈ వజ్రాల వేటలో పాల్గొంటున్నారు. వజ్రాల కోసం వచ్చే వారు జల్లెడలు, గడ్డపారలు వంటి పరికరాలు తెచ్చుకుని వాగులో తవ్వకాలు చేస్తున్నారు. వజ్రం దొరికిందని అనుమానం కలిగితే, దానిని పరీక్షించేందుకు అక్కడే కొందరు వ్యక్తులు పరికరాలతో పరీక్షిస్తున్నారు. ఒకప్పుడు ఒక్క రాయి పరీక్షించేందుకు పది రూపాయలు తీసుకుంటే, ఇప్పుడు ఆ రేటు ముప్పై రూపాయలకు పెరిగింది.

ఇక వజ్రాల వేటతో పాటు వాగు సమీపంలో కొత్తగా హోటళ్లు, కూల్‌డ్రింక్‌ షాపులు, ఐస్‌బండ్లు కూడా వెలిసి రద్దీగా మారాయి. వజ్రాలు దొరకకపోయినా, వ్యాపారుల వ్యాపారం మాత్రం మూడు పూలు, ఆరు కాయలుగా సాగుతోంది. ఫారెస్ట్‌ పరిధిలో ఉండే ఈ ప్రాంతంలో వందలాది మంది రోజూ వజ్రాల కోసం వెదుకుతుండగా, అధికారులు మాత్రం చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా ఫారెస్ట్ అధికారులు జాగ్రత్తలు తీసుకుని, వజ్రాల వాగు వైపు జనసంచారం నియంత్రిస్తే ప్రమాదాలు తప్పించుకోవచ్చని పలువురు సూచిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..