Daggubati Purandeswari on Pawan Kalyan: స్కిల్ డవలప్‌మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత ఏపీ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబుతో భేటీ అనంతరం జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక ప్రకటన చేశారు. టీడీపీ, జనసేన రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని ప్రకటించారు. బీజేపీ కూడా సానుకూలంగా స్పందించి తమతో కలిసి వస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై స్పందించారు. టీవీ9 తో ప్రత్యేకంగా మాట్లాడిన ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి.. పవన్ వ్యాఖ్యలను మేము తప్పుగా చూడటం లేదని తెలిపారు. బీజేపీ అధిష్టానానికి అన్నీ వివరిస్తామని పవన్ చెప్పారని, జనసేన పార్టీ బీజేపీతో పొత్తులోనే ఉందని పురంధేశ్వరి స్పష్టం చేశారు. తమ పార్టీ పెద్దల దృష్టికి రాష్ట్ర పరిస్థితులు.. పవన్ తీసుకువెళతామన్నారని, దీనిపై కేంద్రం పెద్దలు మాతో చర్చలు చేసిన సమయంలో తమ అభిప్రాయాలు చెబుతామని స్పష్టం చేశారు.
అయితే, చంద్రబాబు అరెస్టుపై బీజేపీ స్పందించలేదన్న విషయం గురించి కూడా పురంధేశ్వరి మాట్లాడారు.. చంద్రబాబు అరెస్ట్‌పై బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి స్పందిస్తూ.. చంద్రబాబు అరెస్ట్‌పై మొదట స్పందించింది బీజేపీనే అని అన్నారు. అరెస్ట్ చేసిన విధానం తప్పని బీజేపీ చెప్పిందని, చంద్రబాబు అరెస్ట్ వెనుక కేంద్రం ఉందనడం అవాస్తవమని ఆమె స్పష్టంచేశారు.
కాగా.. చంద్రబాబు అరెస్టు అనంతరం ఏపీ బీజేపీ నేతలకంటే.. తెలంగాణ బీజేపీ నేతలు ఎక్కువగా రెస్పాండ్ అయ్యారు. బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమార్, విజయశాంతి సహ పలువురు నేతలు అరెస్టు చేసిన విధానంపై జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ క్రమంలో ఏపీ బీజేపీ స్పందన గురించి గత కొన్ని రోజులుగా చర్చ జరుగుతోంది. ఈ తరుణంలో దగ్గుబాటి పురంధేశ్వరి స్పందించి.. తామే మొదట మాట్లాడామంటూ క్లారిటీ ఇచ్చారు. అంతేకాకుండా పొత్తులపై కూడా అధిష్టానం చూసుకుంటుందని ఫుల్ క్లారిటీ ఇచ్చారు. తాజా వ్యాఖ్యలతో జనసేన, టీడీపీ, బీజేపీ పొత్తు గురించి త్వరలోనే నిర్ణయం రానున్నట్లు తెలుస్తోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..