Cyclone Asani: బాపట్ల దగ్గర తీరాన్ని తాకిన అసని.. కృష్ణ, ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాలకు భారీ వర్ష సూచన

|

May 11, 2022 | 5:24 PM

కృష్ణా జిల్లాకు రానున్న 6 గంటలు కీలకమని ప్రకటించారు అధికారులు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు మునిగే ప్రమాదముందని ప్రకటించారు.

Cyclone Asani: బాపట్ల దగ్గర తీరాన్ని తాకిన అసని..  కృష్ణ, ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాలకు భారీ వర్ష సూచన
Asani
Follow us on

Andhra Pradesh: బాపట్ల(Bapatla) దగ్గర  ‘అసని’ తుఫాన్‌ తీరాన్ని తాకింది. ఇది తీరం దాటేందుకు మరో 2 గంటలు పట్టే అవకాశం ఉంది. రేపల్లె సమీపంలో భూ ఉపరితలానికి చేరింది ‘అసని’. ఆ తర్వాత మళ్లీ సముద్రంలోకే తుఫాను గమనం ఉండనుంది. తీరాన్ని తాకిన సమయంలో భారీ ఈదురుగాలులు వీసాయి. అసని ప్రభావం ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రపై భారీగా ఉంది. దీంతో  ఉమ్మడి గుంటూరు(Guntur), కృష్ణా(Krishna), ప్రకాశం, గోదావరి జిల్లాలకు భారీ రెయిన్ అలెర్ట్ వచ్చింది. తుఫాన్‌ ప్రభావంతో తీరప్రాంత జిల్లాల్లో కూడా భారీ వర్షాలు పడుతున్నాయి. కాగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తుపాను తీవ్రత దృష్ట్యా కోస్తాంధ్ర తీర ప్రాంత జిల్లాల్లో రెడ్ అలెర్ట్ కొనసాగుతోంది.

ఇక కృష్ణా జిల్లాకు రానున్న 6 గంటలు కీలకమని ప్రకటించారు అధికారులు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు మునిగే ప్రమాదముందని ప్రకటించారు. వరి, అరటి, బొప్పాయి పంటలు దెబ్బతినే అవకాశముందని హెచ్చరించారు. తుపానుపై సీఎం జగన్‌ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్షించారు. తీసుకోవాల్సిన చర్యలపై ఆదేశాలిచ్చారు. తుపాను బలహీన పడినా నిర్లక్ష్యం వద్దన్నారు సీఎం జగన్‌. తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో సహాయకచర్యలు చేపడుతున్నామన్నారు హోంమంత్రి తానేటి వనిత. భారీ వర్షాలకు ప్రాణ నష్టం జరగకుండా చర్యలు చేపట్టామని..పునరావాస కేంద్రాల్లోని కుటుంబాలకు ఆర్థికసాయం అందిస్తామని ప్రకటించారు.

తుఫాన్లు తీరాన్ని తాకిన తర్వాత విధ్వంసం సృష్టిస్తాయి. పెనువేగంతో గాలులు వీయడంతో పాటు భారీ వర్షాలు కురుస్తాయి.  దీంతో అధికారులు అలెర్ట్ అయ్యారు. అసని ఎఫెక్ట్‌ కృష్ణా జిల్లా తీర ప్రాంతంపై స్పష్టంగా కనిపిస్తోంది. బలమైన గాలులకు పలు ప్రాంతాల్లో భారీ వృక్షాలు నేలమట్టమయ్యాయి. తీరప్రాంతం గిలకలదిండిలో సముద్రపు ఆటుపోట్లతో ఇళ్లలోకి చేరింది వరదనీరు. తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు.

అనకాపల్లి జిల్లా.. యస్ .రాయవరం మండలంలో విషాదం నెలకొంది. రాయవరం నుండి ఉప్పరాపల్లి వెల్తుండగా కొబ్బరి చెట్టు పడి ఉప్పరాపల్లి MPTC తుంపాల కాసు మృతి చెందాడు. దీంతో ఆయన కుటుంబంలో విషాదచాయలు అలుముకున్నాయి.