
తుఫాన్లు, వాయుగుండాలు ఏర్పడినప్పుడల్లా వాతావరణ శాఖలు ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తుంటాయి. ఇవి తుఫాన్ తీవ్రత, దిశ, దూరం ఆధారంగా ప్రజలు, పోర్టు అధికారులు, మత్స్యకారులు ముందుగానే జాగ్రత్తలు తీసుకునేందుకు ఉపయోగపడతాయి. భారత వాతావరణ విభాగం తుఫాన్ల తీవ్రతను సూచించేందుకు 1 నుంచి 11 వరకు నంబర్లలో ప్రత్యేక హెచ్చరికల వ్యవస్థను అమలు చేస్తుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ తీరాన్ని లక్ష్యంగా చేసుకున్న “మొంథా” తుఫాన్ కారణంగా మచిలీపట్నం, కృష్ణపట్నం, నిజాంపట్నం పోర్టులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. ఇక ఈ హెచ్చరిక నంబర్ల వెనక ఉన్న అర్థం ఏమిటో చూద్దాం…
1, 2వ నంబరు హెచ్చరికలు ప్రాథమిక జాగ్రత్తలు
తుఫాన్ ఒక పోర్టు నుండి 400 నుంచి 750 నాటికల్ మైళ్ల దూరంలో ఉన్నప్పుడు 1వ లేదా 2వ నంబరు హెచ్చరికలు జారీ చేస్తారు. ఇవి కేవలం జాగ్రత్త సూచనలే. తుఫాన్ దిశ, గాలి ఒత్తిడి మార్పులను పర్యవేక్షించమని సూచిస్తాయి.
3, 4వ నంబరు హెచ్చరికలుఅప్రమత్తత దశ
తుఫాన్ 150 నుంచి 400 నాటికల్ మైళ్ల దూరంలో ఉన్నప్పుడు ఈ హెచ్చరికలు వస్తాయి. ఈ దశలో తుఫాన్ ప్రభావం మొదలయ్యే అవకాశం ఉన్నందున పోర్టు అధికారులు అప్రమత్తంగా ఉండాలి.
5, 6వ నంబరు హెచ్చరికలుప్రమాద సూచికలు
ఇవి తుఫాన్ 50 నుంచి 150 నాటికల్ మైళ్ల దూరంలో ఉన్నప్పుడు జారీ చేస్తారు. ఈ సమయంలో గాలులు బలంగా వీచి, సముద్రం ఉప్పొంగుతుంది. పోర్టు పరిసరాల్లో అలల ఎత్తు పెరుగుతుంది. సాధారణంగా ఈ దశలో పోర్టు కార్యకలాపాలను నిలిపివేస్తారు.
8 నుంచి 10వ నంబరు హెచ్చరికలు అత్యంత ప్రమాద స్థాయి
తుఫాన్ 50 నాటికల్ మైళ్ల లోపలకి చేరుకున్నప్పుడు ఈ హెచ్చరికలు జారీ చేస్తారు. అంటే తుఫాన్ తీరాన్ని తాకే అవకాశముందని అర్థం. గాలి వేగం 80 నుంచి 200 కి.మీ. వరకు ఉండవచ్చు. ఈ దశలో పోర్టులు పూర్తిగా మూసివేసి, నౌకలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తారు. ఎమర్జెన్సీ రెస్క్యూ టీమ్‌లు సిద్ధంగా ఉంటాయి.
11వ నంబరు హెచ్చరిక అత్యవసర పరిస్థితి
ఇది అత్యున్నత స్థాయి హెచ్చరిక. తుఫాన్ పోర్టు సమీపాన లేదా దాని మీదుగా దూసుకువస్తున్నప్పుడు జారీ చేస్తారు. తీవ్రమైన గాలులు, భారీ వర్షాలు కారణంగా విద్యుత్, కమ్యూనికేషన్, రవాణా వ్యవస్థలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. ప్రజలు, సిబ్బంది వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించబడాలి.తుఫాన్ల తీవ్రతను బట్టి 1 నుంచి 11 వరకు ఉన్న ఈ హెచ్చరిక వ్యవస్థ తీరప్రాంత ప్రజలు, మత్స్యకారుల భద్రతకు కీలకం. ఈ సూచనల అర్థం తెలుసుకుంటే ముందుగానే చర్యలు తీసుకుని ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడవచ్చు.