Cyclone Montha: ఏపీ ప్రభుత్వం అలెర్ట్.. ఆస్పత్రులకు 787మంది గర్భిణీ స్త్రీలు..

మొంథా తుఫాన్ ఏపీ తీరం వైపు దూసుకొస్తోంది. ఈ రాత్రికి మచిలీపట్నం-కళింగపట్నం మధ్య సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఏపీలో అతి భారీ వర్షాలు పడతాయని హెచ్చరికలు జారీ అయ్యాయి. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం ముందస్తు సహాయక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా డెలివరీకి దగ్గరగా ఉన్న 787 మంది గర్భిణీ స్త్రీలను జాగ్రత్తగా ఆసుపత్రులకు తరలించారు.

Cyclone Montha: ఏపీ ప్రభుత్వం అలెర్ట్.. ఆస్పత్రులకు 787మంది గర్భిణీ స్త్రీలు..
Ap Govt Shifts 787 Pregnant Women To Hospitals

Updated on: Oct 28, 2025 | 9:16 AM

ఏపీని మొంథా తుఫాన్ గజగజ వణికిస్తుంది. ఇది తీవ్ర తుఫాన్‌ మారి.. ఏపీ తీరం వైపు దూసుకొస్తుంది. ప్రస్తుతం మచిలీపట్నానికి 190 కిలోమీటర్లు.. కాకినాడకు 310 కిలోమీటర్లు.. విశాఖకు 340 కిలోమీటర్ల దూరంలో తుఫాన్ కేంద్రీకృతమై ఉంది. మంగళవారం రాత్రి మచిలీపట్నం-కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరం దాటనుంది. తుఫాన్ ప్రభావంతో ఏపీలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిచింది. దీంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. స్కూళ్లకు సెలవులు ఇవ్వడంతో పాటు ముందస్తు సహాయక చర్యలు చేపట్టింది. ముందస్తు జాగ్రత్తగా ప్రసవానికి దగ్గరగా ఉన్న 787 మంది గర్భిణీ స్త్రీలను సమీపంలోని ఆసుపత్రులకు సురక్షితంగా తరలించినట్లు మంత్రి సత్య కుమార్ యాదవ్ వెల్లడించారు.

తుఫాను నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ పటిష్ట చర్యలు చేపట్టింది. డెలివరీ డేట్‌కు వారం రోజులు మాత్రమే సమయం ఉన్న మహిళలను స్థానిక వైద్య అధికారులు గుర్తించి, ఏరియా, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. తుఫాను ప్రభావిత 17 జిల్లాల్లో ఈ తరలింపు చర్యలు చేపట్టారు. గర్భిణీలలో ముఖ్యంగా అధిక ప్రమాదం ఉన్న మహిళలకు సంబంధించి వైద్యులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. కృష్ణ జిల్లాలో 240 మంది, ఏలూరు జిల్లాలో 171, కోనసీమ జిల్లాలో 150 మంది, తూర్పు గోదావరి జిల్లాలో 142 మంది గర్భిణీలను ఆస్పత్రులకు తరలించారు.

551శిబిరాలు – వైద్య బృందాలు సిద్ధం

తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ప్రభుత్వ ఆశ్రయాలలో వైద్య శిబిరాలను ఏర్పాటు చేసినట్లు మంత్రి సత్యకుమార్ తెలిపారు. ఇప్పటివరకు 551 శిబిరాలను ఏర్పాటు చేశామని.. ప్రతి శిబిరంలో ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారి, ఒక ఏఎన్ఎం, ఆశా కార్యకర్త అందుబాటులో ఉంటారని వెల్లడించారు. ప్రజల ఆరోగ్యం, భద్రత దృష్ట్యా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.