AP Rains: దూసుకొస్తున్న తుఫాన్.. ఏపీకి మరో ముప్పు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్.. వెదర్ రిపోర్ట్ ఇదిగో

|

Dec 07, 2022 | 8:32 AM

Cyclone Mandous: దక్షిణ అండమాన్‌ను ఆనుకుని ఏర్పడిన అల్పపీడనం బలపడింది. ఇది బుధవారం సాయంత్రానికి పశ్చిమ వాయవ్యదిశగా కదులుతూ మాండూస్ తుఫాన్‌‌గా..

AP Rains: దూసుకొస్తున్న తుఫాన్.. ఏపీకి మరో ముప్పు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్.. వెదర్ రిపోర్ట్ ఇదిగో
Andhra Weather Report
Follow us on

ఆగ్నేయ బంగాళాఖాతం, దక్షిణ అండమాన్‌ను ఆనుకుని ఏర్పడిన అల్పపీడనం మంగళవారం సాయంత్రానికి వాయుగుండంగా బలపడింది. ప్రస్తుతం ఇది చెన్నైకి 1020 కి.మీ దూరంలో తూర్పు ఆగ్నేయంగా కేంద్రీకృతమై ఉండగా.. బుధవారం సాయంత్రానికి పశ్చిమ వాయవ్యదిశగా కదులుతూ మాండూస్ తుఫాన్‌(Cyclone Mandous)గా బలపడి గురువారం ఉదయానికి పుదుచ్చేరి, ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంద్ర తీరాల సమీపంలోకి చేరుకుంటుంది. ఇక ఈ తుఫాన్ 9వ తేదీన తమిళనాడులోని మహాబలిపురం సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. ఈ మాండూస్ తుఫాన్.. తుఫానుగానైనా లేదా బలహీనపడి వాయుగుండంగానైనా తీరం దాటే అవకాశం ఉందని.. అనంతరం చిత్తూరు వైపు కదులుతూ క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో మూడు రోజుల పాటు అనగా 8,9, 10 తేదీల్లో దక్షిణ కోస్తాలోని ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య, కడప, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. మిగిలిన చోట్ల విస్తారంగా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. ఈ మేరకు ఇప్పటికే ప్రభావిత జిల్లాల యంత్రాంగానికి రాష్ట్ర ప్రభుత్వం సూచనలు జారీ చేసింది.

మరోవైపు తీరం వెంబడి గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. సముద్రం అల్లకల్లోలంగా మారుతుందని దక్షిణ కోస్తా – తమిళనాడు తీరాల వెంబడి శనివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించింది. అలాగే వేటకు వెళ్ళిన మత్స్యకారులు వెంటనే వెనక్కి తిరిగి రావాలని హెచ్చరించింది. అత్యవసర సహయం, సమాచారం కోసం విపత్తుల సంస్థలో 24 గంటలు అందుబాటులో ఉండే స్టేట్ కంట్రోల్ రూమ్ నెంబర్లు 1070, 18004250101, 08632377118 సంప్రదించాలన్నారు. అటు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ అంబేద్కర్ కోరారు.

కాగా, తమిళనాడు రాష్ట్రంలోని 13 జిల్లాలకు ఐఎండీ రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. విల్లుపురం, చెంగల్పట్టు, కడలూర్‌, కాంచీపురం, తిరువళ్లూరు, అరియలూరు, పెరంబలూర్‌, చెన్నై, కళ్లకురిచ్చి, మైలదుతురై, తంజావూర్‌, తిరువరూర్‌, నాగపట్నం జిల్లాలకు ఐఎండీ రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో ఆరు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు రాష్ట్రానికి చేరుకున్నాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ న్యూస్ కోసం..