Andhra: తీరం దాటిన వాయుగుండం.. ఏపీలోని ఈ ప్రాంతాలకు వర్షసూచన

ఈసారి వాయుగుండం ప్రభావం ఏపీపై పెద్దగా లేకపోవడం రైతులకు బిగ్ రిలీఫ్. శ్రీలంక సమీపంలో తీరం దాటి బలహీనపడిన వాయుగుండం తమిళనాడు వైపు కదులుతుండగా, రాయలసీమ–దక్షిణ కోస్తాలో కేవలం తేలికపాటి వర్షాలకే పరిమితమవనుంది. చలి తీవ్రత మాత్రం కొనసాగనుంది. .. ..

Andhra: తీరం దాటిన వాయుగుండం.. ఏపీలోని ఈ ప్రాంతాలకు వర్షసూచన
Andhra Weather Report

Updated on: Jan 11, 2026 | 9:04 AM

ఏపీకి ఇది బిగ్ రిలీఫ్ అనే చెప్పాలి. ఈ సారి వాయుగుండం ప్రభావం రాష్ట్రంపై పెద్దగా లేదు. లేదంటే పంట చేతికి వచ్చే వేళ.. రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు.  శ్రీలంకకు ఈశాన్యంగా ముల్లయిట్టివుకు సమీపంలో వాయుగుండం తీరం దాటినట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. తీవ్ర వాయుగుండం బలహీనపడి వాయుగుండంగా మారి పశ్చిమంగా కదులుతూ దక్షిణ తమిళనాడు వైపు పయనిస్తుంది. ఇది తీవ్ర అల్పపీడనం బలహీనపడే అవకాశం ఉంది.  దీని ప్రభావంతో తమిళనాడులోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

దీని ప్రభావం ఏపీపై కూడా లైట్‌గా ఉండనుంది. ఆంధ్రాలోని రాయలసీమ ,దక్షిణ కోస్తాకు వర్ష సూచన చేసింది అమరావతి వాతావరణ కేంద్రం.  తిరుపతి, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో  తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, గుంటూరు జిల్లాల్లో కూడా జల్లులు పడే అవకాశం ఉందని తెలిపింది. ఆకాశం  మేఘావృతం అయి ఉండటంతో పాటు..  ఉత్తర గాలులతో చలి తీవ్రత కొనసాగుతుందని వాతావరణ కేంద్రం తెలిపింది. శనివారం ముంచంగిపుట్టులో 6.4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదయ్యింది.

మరోవైపు తెలంగాణలోనూ చలి తీవ్రత కొనసాగుతుంది. తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి దిగువ స్థాయి గాలులు తెలంగాణ వైపు వీస్తూ ఉండటంతో.. మూడు రోజుల్లో చలి తీవ్రత పెరగడంతో  పాటు 11 నుంచి 15 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..