AP: ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌లో కీలక మలుపు: కొనసాగుతున్న అరెస్టుల పర్వం, నిందితుల విచారణ..

|

Mar 10, 2023 | 6:48 AM

AP Skill Development Scam: సీమెన్స్‌ మాజీ ఉద్యోగి జీవీఎస్‌ భాస్కర్‌ను నోయిడాలో అరెస్ట్‌ చేసిన సీఐడీ పోలీసులు.. ట్రాన్సిట్‌ వారెంట్‌పై విజయవాడకు తీసుకొచ్చారు. GGHలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అక్కడి నుంచి నేరుగా సీఐడీ కోర్టుకు తరలించారు.

AP: ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌లో కీలక మలుపు: కొనసాగుతున్న అరెస్టుల పర్వం, నిందితుల విచారణ..
Cid
Follow us on

Andhra Pradesh skill development scam: స్కిల్ డెవ‌ల‌ప్ మెంట్ స్కాంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. స్కాంలో కీలక‌పాత్ర పోషించిన భాస్కర్‌ను సీఐడీ కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. ఆయితే, ఆయన రిమాండ్‌ని మాత్రం న్యాయస్థానం తిరస్కరించింది. మ‌రోవైపు మాజీ ఎండీ అర్జా శ్రీకాంత్ ను సుదీర్ఘంగా విచారించారు. గ‌త ప్రభుత్వ హ‌యాంలో నైపుణ్య శిక్షణ పేరుతో పెద్ద ఎత్తున అక్రమాలు జ‌రిగాయ‌నేది సీఐడీ ఆరోప‌ణ‌..త్వరలో మ‌రింత‌మందిని విచారించేలా సీఐడీ ముందుకెళ్తోంది.

సీమెన్స్‌ మాజీ ఉద్యోగి జీవీఎస్‌ భాస్కర్‌ను నోయిడాలో అరెస్ట్‌ చేసిన సీఐడీ పోలీసులు.. ట్రాన్సిట్‌ వారెంట్‌పై విజయవాడకు తీసుకొచ్చారు. GGHలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అక్కడి నుంచి నేరుగా సీఐడీ కోర్టుకు తరలించారు.

ఇప్పటికే ఈ కేసులో ఐఆర్‌టిఎస్‌ మాజీ అధికారి డాక్టర్ అర్జా శ్రీకాంత్ నిన్న విచారణకు హాజరయ్యారు. స్కిల్‌ డెవలప్‌మెంట్ ఎండీగా 2019 మార్చి నుంచి 2021 ఫిబ్రవరి వరకూ శ్రీకాంత్ పని చేశారు. సీఆర్‌పీసీలోని సెక్షన్ 160 కింద శ్రీకాంత్‌కు సీఐడీ నోటీసులు ఇచ్చింది. ఆయన పని చేసిన సమయంలో జరిగిన అవకతవకలపై ప్రశ్నించారు అధికారులు. స్కాంకు సంబంధించిన పూర్తివివ‌రాల‌న్నీ అర్జా శ్రీకాంత్ దగ్గర ఉన్నట్టు సమాచారం. సీఐడీ అధికారుల విచార‌ణ‌లో సీమెన్స్ తో పాటు షెల్ కంపెనీల వివ‌రాలు కూడా రాబ‌ట్టిన‌ట్లు తెలుస్తోంది.

శ్రీకాంత్ ను విచారించే స‌మయంలో కేంద్ర ఆదాయ‌ప‌న్ను శాఖ అధికారులు కూడా సీఐడీ కార్యాల‌యానికి వెళ్లారు. జీఎస్టీ ఎగ‌వేత‌ల్లో భాగంగా సీమెన్స్ బాగోతం బ‌య‌ట‌ప‌డ‌టంతో ఎక్కడెక్కడ నుంచి ఎంతెంత లావాదేవీలు జ‌రిగాయ‌నే దానిపై ఐటీ అధికారులు కూడా సీఐడీ అధికారుల‌కు స‌మాచారం ఇచ్చిన‌ట్లు తెలిసింది.

స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌ ప్రాజెక్టు ధరను ఇష్టానుసారం పెంచడంలో భాస్కర్‌దే కీలక పాత్ర.

సీమెన్స్ ఇండస్ట్రియల్ సాఫ్ట్‌వేర్ ప్రైవేట్ లిమిటెడ్ ఇచ్చిన సాఫ్ట్‌వేర్ ధర కేవలం 58 కోట్ల రూపాయలు. కానీ అంచనాలను తారుమారు చేసి.. చూపెట్టిన ప్రాజెక్ట్ ధర అక్షరాలా.. 3300 కోట్లు. 58కోట్ల రూపాయలు ఎక్కడ.. 3300 కోట్లు ఎక్కడ.? భారీ మొత్తంలో పెంచడంతో.. ప్రాజెక్టు వ్యయంలో 10 శాతం చెల్లింపుల కింద.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై అదనంగా 371 కోట్ల రూపాయల భారం పడింది. దీంతో గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలపై ఫోకస్ పెట్టింది ప్రభుత్వం.

అప్పట్లో సీమెన్స్ ఇండియాకు ఎండీగా ఉన్న సుమ‌న్ బోస్ తో గత ప్రభుత్వంలోని కొంత‌మంది కుమ్మక్కయి షెల్ కంపెనీలు సృష్టించిన‌ట్లు అధికారులు గుర్తించారు. ప్రాజెక్ట్ ద్వారా నిధుల మ‌ళ్లింపు కోసం వాడుకున్న షెల్ కంపెనీల్లో కూడా జీవీఎస్ భాస్కర్ కీల‌కంగా వ్యవహరించారు. దీంతో భాస్కర్‌ను అరెస్ట్ చేసి విజ‌య‌వాడ కోర్టులో హాజ‌రుప‌రిచారు. అయితే ఆయన రిమాండ్‌ని మాత్రం న్యాయస్థానం తిరస్కరించింది.

మొత్తంగా భారీ స్కాంలో ప్రమేయం ఉన్న అంద‌రినీ విచారించ‌డంతో పాటు త్వరలో మ‌రింత‌మందికి నోటీసులు ఇచ్చేందుకు సిద్దమవుతున్నారు సీఐడీ అధికారులు. ఈ కేసులో మరికొంత మంది కీలక వ్యక్తుల పేర్లు తెరపైకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..