AP News: చీరాల గ్యాంగ్ రేప్, హత్య కేసులో కీలక తీర్పు.. కామాంధులకు యావజ్జీవ జైలు శిక్ష
బాపట్ల జిల్లా చీరాల సమీపంలో యువతిపై సామూహిక అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో ఒంగోలు కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ప్రధాన నిందితులైన ఇద్దరికి యావజ్జీవ కారాగార శిక్ష, జరిమానా విధించగా, సాక్ష్యాలను తారుమారు చేసేందుకు సహకరించిన మరో నిందితుడికి ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. అలాగే బాధితురాలి కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం అందించాలని న్యాయస్థానం ఆదేశించింది..

బాపట్ల, జూన్ 23: బాపట్ల జిల్లా చీరాల సమీపంలోని ఓ గ్రామానికి చెందిన 21 ఏళ్ళ యువతిపై ముగ్గురు యువకులు గ్యాంగ్ రేప్‌కు పాల్పడి అనంతరం దారుణంగా యువతిని హత్య చేసిన కేసులో న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. ఇద్దరు నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష, ఒక్కొక్కరికి 20 వేల జరిమానా విధించింది. మరో నిందితుడికి ఐదేళ్ళ జైలు శిక్ష, 2 వేల జరిమానా విధిస్తూ ఒంగోలు రెండవ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి లలిత తీర్పు చెప్పారు. మహిళలపై జరిగే అఘాయిత్యాల కేసులను ప్రత్యేకంగా విచారించిన అనంతరం న్యాయమూర్తి లలిత నిందితులకు శిక్షలు ఖరారు చేశారు.
యువతి గ్రామానికే చెందిన దేవరకొండ విజయ్, కారంకి మహేష్ బాబులు మద్యం తాగేందుకు సమీపంలోని రైల్వే ట్రాక్ దగ్గర 2024 జూన్ 20న మద్యం తాగేందుకు వచ్చారు. అక్కడ ఫూటుగా మద్యం సేవిస్తుండగా తెల్లవారుజామున కాలకృత్యాలు తీర్చుకునేందుకు రైల్వే ట్రాక్ సమీపంలోకి ఒంటరిగా వచ్చిన ఓ యువతిని గమనించారు. అక్కడ ఎవరూ లేకపోవడంతో అప్పటికే మద్యం మత్తులో ఉన్న ఆ ఇద్దరు యువకులు ఆమెపై దాడి చేశారు. కామాంధులుగా మారిన ఆ ఇద్దరూ యువతిపై సామూహికంగా అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం మద్యం మత్తు తలెకెక్కి ఉన్మాదులా మారిన ఆ ఇద్దరూ ఆ యువతిని దారుణంగా చంపేశారు.
సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నం..
అనంతరం ఆ ఇద్దరు నిందితులిద్దరూ సమీపంలోని లాడ్జికి వెళ్ళారు. అక్కడ తమ స్నేహితుడైన మూడవ నిందితుడు దేవరకొండ శ్రీకాంత్‌కు తాము చేసిన ఘోరాన్ని వివరించారు. దీంతో ఈ విషయం తెలిస్తే పోలీసులు పట్టుకుంటారని, సాక్ష్యాలను రూపుమాపాలని శ్రీకాంత్ వారికి సలహాలు ఇచ్చి, వారి దుస్తులు మార్పించి సాక్ష్యాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించాడు. బహిర్భూమికి వెళ్ళిన యువతి తిరిగిరాకపోవడంతో ఆమె తల్లిదండ్రులు గాలింపు చర్యలు చేపట్టడంతో జరిగిన దారుణం వెలుగు చూసింది. ఈ ఘటనపై అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేగింది. ఈ ఘటనలో బాధిత యువతి తల్లిదండ్రులను అప్పుడే అధికారంలోకి వచ్చిన కూటమి ఎమ్మెల్యేలు వంగలపూడి అనిత, ఎంఎం కొండయ్యలు పరామర్శించి ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
యువతి తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు పూర్తి చేసి కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఈ కేసులో బలమైన సాక్ష్యాలను సమీకరించి నేరం రుజువయ్యేందుకు చీరాల DSP మొయిన్ కిందిస్థాయి సిబ్బందిని పర్యవేక్షించారు. ఈ కేసులో నేరం రుజువుకావడంతో నిందితులు విజయ్, మహేష్ బాబులకు యావజ్జీవ జైలు శిక్ష తోపాటు 20 వేల రూపాయల జరిమానా విధించింది న్యాయస్థానం. వీరికి సహకరించిన మరో నిందితుడు శ్రీకాంత్‌కు ఐదేళ్ళ జైలు శిక్ష, రెండు వేల జరిమానా విధించారు. బాధితురాలి కుటుంబానికి పదిలక్షల ఆర్ధిక సాయం పరిహారంగా అందించాలని తీర్పు చెప్పారు.




