Anandayya ayurveda covid-19 medicine : నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చెందిన ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య కరోనాకు ఇస్తోన్న మందు ఇప్పుడు నెల్లూరు జిల్లాలోనే కాదు, ఏపీ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. ప్రజల నుంచి ఎలాంటి ఫిర్యాదు అందకపోయినప్పటికీ ఇటీవల లోకాయుక్త ఆదేశాలతో అధికారులు మందు పంపిణీని నిలిపివేశారు. అయితే, ఇవాళ్టి నుంచి మళ్లీ నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య ఇస్తున్న ఆయుర్వేద కరోనా మందు పంపిణీకి ప్రభుత్వం సుముఖం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీంతో కరోనా మందు కోసం జనం ఎగబడుతున్నారు. మందు పంపిణీ విషయం తెల్సుకున్న కరోనా రోగులు నెల్లూరు GGH ఆస్పత్రి ఖాళీ చేసి ఆనందయ్య ఆయుర్వేద మందు కోసం పరుగులు తీశారు. దీంతో హాస్పిటల్ మొత్తం ఖాళీ అయిపోయింది. ఈ నేపథ్యంలో ఆనందయ్య కరోనా మందు తీసుకోవడంతోనే తన ప్రాణాలు నిలబడ్డాయంటూ అనేక మంది కరోనా నుంచి బయటపడ్డ వాళ్లు చెప్పుకొస్తున్నారు. “ఊపిరి అందడంలేదు. కొన ఊపిరితో ఉన్న నాకు ఇంకా రెండు నిముషాలు ఆగితే చనిపోయే పరిస్థితి. ఈ క్రమంలో మావాళ్లు వచ్చి వెంటనే కంటిలో మందు వేశారు. 10, 15 నిముషాల్లో కోలుకున్నా.. ఈ మందు చాలా అద్భుతం” అని కృష్ణపట్నం మందు వేసుకున్న ఓ రిటైర్డ్ మాస్టారు చెప్పారు. ఈ వీడియో ఇప్పడు సోషల్ మీడియాలోనూ చక్కర్లు కొట్టడం మొదలైంది.