AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP News: కించపరిచే పోస్టులతో జాగ్రత్త.. కేసు నమోదైతే భవిష్యత్ ఖతం.. యువతకు పోలీస్ వార్నింగ్‌

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోషల్ మీడియాలో కించపరిచే విధంగా పోస్టులు పెట్టేవారిపై పోలీసులు గట్టి చర్యలు తీసుకుంటున్నారు. ప్రకాశం జిల్లా పోలీసులు సోషల్‌ మీడియాలో అసభ్యకరమైన, అనైతిక, విద్వేషాలు రెచ్చగొట్టేలా పోస్టులు పెట్టిన వారి పని పడుతున్నారు.

AP News: కించపరిచే పోస్టులతో జాగ్రత్త.. కేసు నమోదైతే భవిష్యత్ ఖతం.. యువతకు పోలీస్ వార్నింగ్‌
Cops Taking Serious Action On Unnecessary Social Media Posts In Prakasam
Fairoz Baig
| Edited By: |

Updated on: Nov 15, 2024 | 7:11 PM

Share

సోషల్‌ మీడియాలో అసభ్యకరమైన, అనైతిక, విద్వేషాలు రెచ్చగొట్టేలా పోస్టులు పెట్టిన వారికి ప్రకాశం జిల్లా పోలీసులు చుక్కలు చూపిస్తున్నారు. వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ఇన్ స్టాగ్రామ్, టెలిగ్రామ్, యూట్యూబ్, ఎక్స్ (ట్విట్టర్) ఇతర సోషల్‌ మీడియాలో ఇతరులను కించపరిచేలా అసభ్యకరమైన, అనైతిక, అవమానకర రీతిలో పోస్టులు పెడితే ఐటీ యాక్ట్ కింద కేసులుపెట్టి నోటీసులు జారీ చేస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మద్దిపాడు పోలీస్ స్టేషన్లో వివాదాస్పద సినీ దర్శకుడు రాంగోపాల్‌వర్మ, సినీనటుడు వైసీపీ నేత పోసాని కృష్ణమురళిలపై కేసులు నమోదు చేశారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా కందుకూరు పట్టణ పోలీస్ స్టేషన్లో సినీ నటుడు పోసాని కృష్ణ మురళిని అరెస్ట్ చేయాలని తెలుగుదేశం నాయకులు ఫిర్యాదు చేశారు. పోసాని మీడియా సమావేశంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును దూషించారని అతనిపై చర్యలు తీసుకోవాలని టీ.ఎన్.ఎస్.ఎఫ్ నాయకులు బెజవాడ ప్రసాద్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ సాంబశివయ్యకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసేందుకు లీగల్‌ ఒపీనియన్‌ తీసుకుంటున్నారు. ఇక్కడ కేసు నమోదైతే పోసానికి ఇబ్బందులు తప్పవని తెలుస్తుంది.

ఇది కూడా చదవండి: వారెవ్వా.. ఏం టాలెంట్ గురూ..మిల్లెట్స్‌తో అమెరికా వైస్ ప్రెసిడెంట్‌ దంపతుల చిత్రం..

మరో వైపు ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్‌ స్టేషన్‌లో ప్రముఖ సినీ దర్శకుడు రాంగోపాల్‌వర్మపై నమోదైన కేసులో పోలీసులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. విచారణకు ఈనెల 19న మద్దిపాడు పోలీస్ స్టేషన్లో హాజరుకావాలంటూ ప్రకాశం జిల్లా పోలీసులు రాంగోపాల్‌వర్మకు హైదరాబాద్‌కు వెళ్ళి మరీ నోటీసులు ఇచ్చారు. వ్యూహం సినిమా ప్రమోషన్లలో భాగంగా ఎక్స్‌లో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, నారా లోకేష్, నారా బ్రాహ్మణిలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మద్దిపాడు మండల టీడీసీ ప్రధాన కార్యదర్శి ఎం. రామలింగం మద్దిపాడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వర్మపై కేసు నమోదైంది. సామాజిక మాధ్యమాల్లో సమాజంలోని వ్యక్తులపై, సంస్థలపై హేయమైన, జుగుప్సాకరమైన పదజాలంతో ఫొటోలు/వీడియోలు మార్ఫింగ్, ట్రోలింగ్ చేసినా, వ్యక్తిగత దూషణలు, బెదిరింపులు, కించపరిచే వ్యాఖ్యలు చేస్తే బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ దామోదర్‌ తెలిపారు. ఇతరుల మనోభావాలు, మానాభిమానలు దెబ్బతినేలాగానీ కుల/మత/రాజకీయ వర్గాల మధ్య విద్వేషాలు రగిల్చేలా, మతపరమైన, సున్నిత అంశాల్లో వదంతులు/అవాస్తవాలు ప్రచారం చేస్తూ శాంతి భద్రతలకు భంగం కలిగించేలా పోస్టులు పెట్టరాదన్నారు.

సోషల్ మీడియాలో అసభ్యకరమైన, హేయమైన, విద్వేషకర పోస్టులు చేసే వారిపై, నిజానిజాలు తెలుసుకోకుండా వివాదాస్పద విషయాలు లేదా తప్పు దారి పట్టించే ఫేక్ న్యూస్ పెట్టిన, షేర్ చేసే వారిపై, సంబంధిత గ్రూప్ అడ్మిన్లపై చట్ట ప్రకారం చర్యలు తప్పవంటున్నారు. సామాజిక మాధ్యమాల్లో అసభ్య పోస్టులు పెట్టడానికి ప్రోత్సహించటం, సహకరించటం, కుట్ర చేయటం వంటివి కూడా చట్టరీత్య నేరమని ఎస్పీ తెలిపారు. అలాగే సోషల్‌ మీడియాలో తప్పుడు, రెచ్చగొట్టే పోస్టులు పెట్టే వారిని పోలీసులు సైబర్ సెల్ లోని సోషల్ మీడియా టిమ్ ద్వారా నిరంతరం గమనిస్తూ ఉంటారని, సోషల్ మీడియాలో పోస్టులు చేసేటప్పుడు జాగ్రత్తగా అప్రమత్తతో వ్యవహరించాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా యువత, అనవసర పోస్ట్‌ల ద్వారా వారి  జీవితాన్ని నాశనం చేసుకోవద్దని, ఒకసారి కేసు నమోదు అయితే ఉద్యోగావకాశాలు, పాస్‌పోర్ట్, వీసాల కోసం ఇబ్బందులు ఎదురవుతాయని ఎస్పీ సూచించారు.

ఇది చదవండి: 

మంత్రులే ఆలస్యంగా వస్తే ఎలా?..ఆ మంత్రిపై స్పీకర్ ఆగ్రహం..ఎందుకంటే?

జెట్ స్పీడ్‌లో భోగాపురం ఎయిర్ పోర్ట్ పనులు.. అందుబాటులోకి ఎప్పుడంటే?

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి